వైసీపీ ఆటవిక చర్యలను ఖండిస్తున్నానన్న చంద్రబాబు
వైసిపి నేతలు సామాన్య ప్రజలను సైతం వదలడం లేదని మండిపడ్డారు చంద్రబాబు. నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం ఇస్సప్పాలెం పరిధిలో వైసీపీకి ఓటు వేయలేదని ఇళ్ల ముందు ఉండే డ్రైనేజీ, మెట్లు, ర్యాంపులను పంచాయతీ సెక్రటరీ మరియు పోలీసు అధికారులు దగ్గరుండి కూలగొట్టడం దారుణమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇలాంటి ఆటవిక చర్యలను ఖండిస్తున్నానని ఆయన సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ బలపరిచిన వ్యక్తికి ఓటెయ్యకుంటే ఇంటిని జెసిబితో కూలుస్తారా ?
వైసిపి బలపరిచిన అభ్యర్థి కి ఓటు వేయలేదని ఓ సామాన్యుడి ఇంటిని జెసిబితో ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని దీంతో తన ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాడని అందుకు సంబంధించిన ఫోటోను సైతం పోస్ట్ చేసి చంద్రబాబు వైసీపీ తీరుపై విమర్శలు గుప్పించారు.
అంతేకాదు గోగులపాడు పంచాయతీ ఐదో వార్డులో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థి గెలిచినందుకు వైసీపీ ప్రభుత్వం తీర్చుకున్న ప్రతీకారం ఇది. ప్రజలు ప్రత్యర్థి అభ్యర్థిని గెలిపిస్తే వారిపై కక్షగట్టి, వారి వ్యక్తిగత ఆస్తులను కూలుస్తారా? ఇలాంటి రాజకీయాన్ని రాజారెడ్డి రాజ్యాంగం నేర్పిందా? అంటూ చంద్రబాబు నాయుడు వైసిపి నాయకులపై నిప్పులు చెరిగారు.

టీడీపీ నేతల ఇళ్ళ నిర్మాణాలపై మండిపడిన వర్ల రామయ్య
ఇక చంద్రబాబు నాయుడు మాత్రమే కాకుండా టీడీపీ నేతలు సైతం వైసిపి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .టీడీపీ నేతల ఇళ్ల నిర్మాణాల కూల్చివేతపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఓటు వేయకుంటే కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా అంటూ మండిపడ్డారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపి రెడ్డి పేరుకే డాక్టర్ అని మానవత్వం లేని మనిషి అని దుయ్యబట్టారు . వర్ల రామయ్య తమకు అనుకూలంగా ఓటెయ్యకుంటే ప్రభుత్వ పథకాలు ఆపేస్తామని బెదిరిస్తారా అంటూ నిలదీశారు.

అధికార పార్టీ నేతల మాట వినకపోతే జెసిబిలతో తొక్కిస్తారా?
ఎన్నికల సంఘం ఇలాంటి ఘటనలపై దృష్టి సారించాలని టిడిపి నేతలు కోరుతున్నారు . ఇంతటి దుర్మార్గపు ఆలోచన ఎవరూ చేయలేరని తీవ్ర విమర్శలు గుప్పించారు. రెండు దఫాలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో దౌర్జన్యాలను జరిగాయని పేర్కొన్న వర్ల రామయ్య పోలీసుల చట్ట ప్రకారం నడుచుకోవాలని హితవు పలికారు . అధికార పార్టీ నేతల మాట వినకపోతే జెసిబి లతో తొక్కిస్తారా అంటూ మండిపడిన వర్ల రామయ్య జగన్మోహన్ రెడ్డి సీఎంగా అనర్హులంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.