కవిత పీఏలమంటూ..
టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత పీఏలమని చెప్పుకుంటూ, బెదిరింపులకు పాల్పడి, డబ్బులు వసూలు చేస్తోన్న ముగ్గురు వ్యక్తులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఎంపీ అధికారిక నివాసం వద్దే ఈ అరెస్టులు చోటుచేసుకున్నాయి. సదరు వ్యక్తులు ముగ్గురూ కవిత పీఏలమని చెప్పుకుంటూ ఢిల్లీలోని ఓ ఇంటి యజమానిని నుంచి డబ్బులు గుంజారు. నిందితుల్లో ఒకరు సాక్షాత్తూ ఎంపీ కారు డ్రైవర్ కావడం వ్యవహారాన్ని మరింత వివాదాస్పదంగా మార్చింది.

అక్రమ కట్టడానికి అనుమతి పేరుతో..
ఢిల్లీకి చెందిన మన్మీత్ సింగ్ లాంబా అనే వ్యక్తి.. న్యూ గుప్తా కాలనీలో కొత్తగా ఓ ఇల్లు నిర్మించుకుంటున్నాడు. అయితే ఆ స్థలం వివాదంలో ఉందని, ఇల్లు కడితే అది అక్రమ నిర్మాణం కిందికి వస్తుందంటూ కొందరు వ్యక్తులు ఆయన్ని కలిశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎండీసీ) అధికారులు ఆ ఇంటి జోలికి రాకుండా చూసుకుంటామని, తాము ఎంపీ మాలోత్ కవిత పీఏలమని సదరు వ్యక్తులు లాంబాను నమ్మించారు. అలా ఎంపీ పీఏలుగా, ఎండీసీ అధికారులుగా బిల్డప్ ఇస్తూ రూ.5 లక్షలు ఇస్తే అంతా సెట్ చేస్తామని నమ్మించారు. చివరికి..

రెడ్ హ్యాండెడ్గా సీబీఐ చేతికి..
నిందితులు అడిగినట్లు రూ.5 లక్షలు కాకుండా చివరికి రూ.1లక్షకు బేరం ఫిక్సయిన తర్వాత బాధితుడు లాంబా నేరుగా సీబీఐని ఆశ్రయించాడు. ఎంపీ కవిత పీఏలమని, ఎండీసీ అధికారులమని ముగ్గురు వ్యక్తులు తనను బెదిరించిన వైనంపై లాంబా ఫిర్యాదు చేశాడు. ఎంపీ ఇంటి దగ్గరికే డబ్బులు తేవాల్సిందిగా డిమాండ్ చేశారని చెప్పడంతో ముందు లాంబాను పంపి, ఆ వెనకే సీబీఐ అధికారులు వెళ్లారు. ఎంపీ క్వార్టర్స్ లో డబ్బులు తీసుకుంటుండగా ముగ్గురు నిందితులనూ సీబీఐ అరెస్టు చేసింది. కాగా,

అతను నా డ్రైవరే, కానీ..
అక్రమ నిర్మాణం పేరు చెప్పి బెదిరించి, ఎంపీ కవిత పీఏలమంటూ మోసానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను రాజీబ్ భట్టాచార్య, సుభాంగి గుప్తా, దుర్గేష్ కుమార్ లుగా సీబీఐ గుర్తించింది. అందులో దుర్గేష్ కుమార్ ఎంపీ కవిత డ్రైవర్ కావడం గమనార్హం. బెదిరింపులు, లంచం వ్యవహారంలో ఎంపీ పాత్రపై సీబీఐ ప్రస్తుతానికి ఎలాంటి ఆరోపణలు, వ్యాఖ్యలు చేయలేదు. కాగా, ఈ వివాదంపై ఎంపీ కవిత గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దుర్గేష్ కుమార్ తన దగ్గర పనిచేసే డ్రైవరే అని, అతను తన స్టాఫ్ క్వార్టర్స్ లోనే ఉంటున్నాడని, ఒకవేళ నిజంగా తప్పు చేస్తే అతనిపై నిరభ్యంతరంగా చర్యలు తీసుకోవచ్చని ఎంపీ కవిత అన్నారు.