Elon Musk Movie 2023: ఎక్స్‌ (గత పేరు ట్విట్టర్‌) ఓనర్‌ ఎలాన్ మస్క్, ప్రపంచ టెక్ పరిశ్రమలోని అత్యంత అసాధారణ వ్యక్తుల్లో ఒకరు. మస్క్‌ మామ ప్రొఫెషనల్‌ లైఫ్‌, తీసుకునే నిర్ణయాలు, చేసే కామెంట్లు, పలికించే హావభావాలతో పాటు అతని వ్యక్తిగత జీవితం కూడా ఎప్పుడూ వార్తల్లో హెడ్‌లైన్‌గా ఉంటుంది. ఇప్పుడు, ఎలాన్‌ మస్క్‌ జీవిత చరిత్ర వెండితెర పైకి ఎక్కబోతోంది.

పుస్తక రూపంలో ఎలాన్‌ మస్క్‌ జీవిత చరిత్ర
ఈ టెక్ మొఘల్‌ జీవిత చరిత్ర ఇప్పటికే పుస్తకం రూపంలో వచ్చింది, దాని పేరు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk). వాల్టర్ ఐజాక్సన్ (Walter Isaacson) ఆ బుక్‌ రాశారు. సౌత్‌ ఆఫ్రికాలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన మస్క్‌, ప్రపంచ కుబేరుడిగా ఎలా ఎదిగారు, తన వృత్తిగత జీవితంలో ఎలాంటి విజయాలు సాధించారు, ఏ సవాళ్లను ఎదుర్కొన్నారు, నిర్ణయాలు ఎలా తీసుకునేవారు, వ్యక్తిగత జీవితం ఎలా సాగింది వంటి అంశాలు ఈ పుస్తకంలో పుష్కలంగా ఉన్నాయి. 

మస్క్‌ మామ పర్సనల్‌ హిస్టరీ పుస్తకంలోని అక్షర రూపాన్ని దాటి సిల్వర్‌ స్క్రీన్‌ మీద దృశ్య రూపంలో కనువిందు చేయనుంది. హాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థ A24, వాల్టర్ ఐజాక్సన్ నుంచి ఎలాన్ మస్క్ బయోపిక్ హక్కులు దక్కించుకుంది. ఈ సినిమా తీయడానికి, ప్రఖ్యాత దర్శకుడు డారెన్  అరోనోఫ్‌స్కీతో (Darren Aronofsky) కలిసి A24 పనిచేస్తుంది.

ఐజాక్సన్, ఆపిల్‌ కో-ఫౌండర్‌ స్టీవ్ జాబ్స్ (Steve Jobs) జీవిత చరిత్రను రాశారు. దానిని 2015లో దానిని సినిమాగా తీస్తే హిట్‌ అయింది. ఇందులో, మైఖేల్ ఫాస్‌బెండర్ ఆపిల్‌ సీఈవోగా (Apple CEO) నటించారు.

బయోపిక్‌ విశేషాలు
డారెన్ అరోనోఫ్‌స్కీ, “రిక్వియమ్ ఫర్ ఎ డ్రీమ్” (2000), “బ్లాక్ స్వాన్” (2010), “మదర్!” (2017) వంటి సినిమాలను డైరెక్ట్‌ చేశారు. బ్రెండన్ ఫ్రేజర్‌ ప్రధాన పాత్రలో, గత సంవత్సరం ఆస్కార్‌కు పోటీ పడిన “ది వేల్” మూవీకి కూడా డారెన్ ఆర్‌న్ఫోస్కీ దర్శకత్వం వహించారు. ఇప్పుడు, టెస్లా (Tesla) అధినేత ఎలాన్ మస్క్ జీవిత కథను చెప్పే సవాలును స్వీకరించారు. సంక్లిష్టమైన కథలను కళాత్మకంగా, ఆకట్టుకునే విధంగా తీస్తాడని డారెన్ అరోనోఫ్‌స్కీకి హాలివుడ్‌లో పేరుంది. ఇప్పుడు తీయబోయే ఎలాన్‌ మస్క్‌ జీవిత చరిత్రలో, మస్క్‌ వృత్తిగత, వ్యక్తిగత వివరాలు ఉంటాయని తెలుస్తోంది. అయితే, కీలకమైన మస్క్‌ పాత్రలో ఎవరు నటిస్తారనే వివరాలు ఇంకా బయటకు రాలేదు.

ఎలాన్‌ మస్క్‌, 2002లో స్పేస్‌ఎక్స్‌ను (Space X), 2003లో టెస్లాను స్థాపించారు. ఆ తర్వాత ది బోరింగ్‌, న్యూరాలింక్‌, సోలార్‌ సిటీ వంటి కంపెనీలను ఏర్పాటు చేశారు. తాను స్థాపించిన కంపెనీలు, వాటి విజయాల్లో కీలక పాత్ర పోషించిన దూరదృష్టి గల వ్యాపారవేత్తగా ఎలాన్ మస్క్ ప్రయాణాన్ని వెండితెరపై A24 ఆవిష్కరిస్తుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తి అయినా మస్క్, సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ట్విటర్‌ను (Twitter) గత ఏడాది 44 బిలియన్‌ డాలర్లకు కొన్నారు, ఆ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత, ట్విట్టర్‌ పేరును ఎక్స్‌గా (X) రీబ్రాండింగ్ చేసి మరోమారు తన ఆలోచన శైలిని ప్రపంచానికి చాటారు. 

ఈ చిత్రం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. మస్క్ జీవితాన్ని ఆన్-స్క్రీన్ మీద చూడడానికి సినీ ప్రియులు, టెక్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్టును A24 చేపట్టడం, అరోనోఫ్‌స్కీ దర్శకత్వం వహిస్తుండడంతో, ఎలాన్‌ మస్క్‌ మూవీ మీద ఇప్పట్నుంచే చాలా అంచనాలు ఉన్నాయి.

మరో ఆసక్తికర కథనం: మళ్లీ పెరిగిన పసిడి – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficialSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *