జగన్ లేఖ, అమరావతి కేసులపై సుప్రీం డెడ్‌లైన్
గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా సీఎం జగన్ రాసిన లేఖపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసులు నిన్న విచారణకు వచ్చాయి. అలాగే అమరావతి భూముల స్కాంపై ఏసీబీ దర్యాప్తును అడ్డుకుంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కూడా విచారణకు వచ్చింది. అలాగే అమరావతి భూముల స్కాంపై మంత్రివర్గ ఉపసంఘం, సిట్ విచారణపై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన మరో పిటిషన్ కూడా విచారణకు వచ్చింది. ఇవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న పిటిషన్లే కావడంతో వీటిపై విచారణ పూర్తి చేసేందుకు మార్చి 5ని సుప్రీంకోర్టు డెడ్‌లైన్‌గా ప్రకటించింది.

ఛీఫ్ జస్టిస్‌కు జగన్ లేఖ కేసు
ఏపీ హైకోర్టులో ఉన్న కొందరు న్యాయమూర్తులతో కలిసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారంటూ సీఎం జగన్ గతంలో ఛీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. అయితే ఈ లేఖలో జడ్జీలపై జగన్ చేసిన ఆరోపణలు దారుణంగా ఉన్నాయని, భవిష్యత్తులో జగన్ జడ్డీలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా అడ్డుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. సీజేకు జగన్ రాసిన లేఖపై ఆయన నిర్ణయం తీసుకోనప్పటికీ ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు జగన్‌పై ప్రభావం చూపే అవకాశముంది. దీంతో ఈ కేసు కీలకంగా మారింది.

అమరావతి భూముల స్కాంపై విచారణ
అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ చోటు చేసుకుందని, తద్వారా భారీ ఎత్తున టీడీపీకి చెందిన ముఖ్యులు కుంభకోణానికి పాల్పడ్డారంటూ ఆరోపించిన వైసీపీ సర్కారు.. వాటిపై మంత్రివర్గ ఉపసంఘ, సిట్ దర్యాప్తులకు ఆదేశించింది. అయితే హైకోర్టులో టీడీపీ నేతలు దీన్ని సవాల్ చేశారు. ఈ కేసు విచారించిన హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ స్టేను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అలాగే మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌తో పాటు మరికొందరు రాజధానిలోనేరపూరిత కుట్రతో భూములు కొన్నారని ఏసీబీ కేసులు పెట్టింది. ఈ కేసుల దర్యాప్తుపై హైకోర్టు ఇచ్చిన స్టేను కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులోసవాల్ చేసింది. ఈ రెండు పిటిషన్లపై తీర్పుకు కూడా మార్చి 5న డెడ్‌లైన్‌గా సుప్రీంకోర్టు నిర్ణయించింది.

జగన్,అమరావతి ఇరువురికీ కీలకం
సీజేకు జగన్ రాసిన లేఖ తర్వాత మరోసారి జడ్డీలపై విమర్శలు చేయకుండా ఆయన్ను అడ్డుకోవడం, అలాగే అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా భూముల స్కాం జరిగిందా లేదా అన్న అంశాలపై దర్యాప్తు భవిష్యత్తును సుప్రీంకోర్టు తీర్పులు నిర్ణయించే అవకాశముంది. దీంతో ఈ మూడు పిటిషన్లపై తదుపరి దర్యాప్తును సుప్రీంకోర్టులోని జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డితో కూడిన ధర్మాసనం నిర్ణయించబోతోంది. కాబట్టి మార్చి 5న సుప్రీం ధర్మాసనం ఇచ్చే తీర్పులు ఇటు జగన్‌కూ, అటు అమరావతి భవిష్యత్తుకూ కీలకంగా మారాయి. వీటి ప్రభావం రాష్ట్ర రాజకీయాలపై పడటం ఖాయంగా తెలుస్తోంది.