జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ శరవేగంగా సాగుతుంది. సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులపై మంగళవారం నాడు విచారణ కొనసాగింది. ప్రజా ప్రతినిధులపై ఉన్న పెండింగ్ కేసుల విచారణను వేగవంతం చేయాలని సుప్రీం ఆదేశాలతో, విచారణలో స్పీడ్ పెంచిన నాంపల్లి ప్రత్యేక కోర్టు ఈరోజు వైయస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పెన్నా, రఘురాం సిమెంట్స్ కేసులో అభియోగాల నమోదుపై విచారణను బుధవారానికి వాయిదా వేసింది. దీంతో రేపు మరోమారు కేసుల విచారణ జరగనుంది.
ఇక ఓబులాపురం మైనింగ్ కేసు విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం. ఓబులాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు సిబిఐ అధికారులు మరోసారి గడువు కోరారు. దీంతో ఈ కేసు విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
జగన్ అక్రమాస్తుల కేసులో మరో నిందితుడు గా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ తాను విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులు సడలించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిమ్మగడ్డ పిటిషన్ కు సిబిఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. పరిశీలించిన ధర్మాసనం నిమ్మగడ్డ అభ్యర్థనపై తన నిర్ణయాన్ని రేపు వెల్లడిచనుంది . జగన్ అక్రమాస్తుల కేసుల పై విచారణ రేపు మరోమారు కొనసాగనుంది.