సూపర్ సోకో ఆవిష్కరించిన సరికొత్త ఎలక్ట్రిక్ టూవీలర్ల పేర్లు ఇలా ఉన్నాయి. అవి: సూపర్ సోకో టిసి వాండరర్, టిఎస్ హంటర్ మరియు క్యుమిని. వీటిలో టిసి వాండరర్ నేక్డ్ స్పోర్టీ ఈ-బైక్ కాగా, టిసి హంటర్ రెట్రో-స్టైల్ మోటార్‌సైకిల్. ఇకపోతే, మిగిలినది క్యుమిని ఎలక్ట్రిక్ స్కూటర్.

సూపర్ సోకో రెట్రో-స్టైల్ మోటార్‌సైకిల్ డిసి వాండరర్ గుండ్రటి హెడ్‌ల్యాంప్, సింపుల్ బాడీవర్క్, చిన్న విండ్‌షీల్డ్ మరియు ఫ్లాట్ కేఫ్-రేసర్ స్టైల్ సీట్‌ను కలిగి ఉంటుంది.

ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో డిజిటల్ మరియు అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సెక్యూరిటీ అలారం, కీలెస్ ఇగ్నిషన్, మూడు రైడింగ్ మోడ్లు, యుఎస్డి ఫ్రంట్ ఫోర్కులు, రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లు, పూర్తి- ఎల్ఈడి లైటింగ్ మరియు డ్యూయల్ పర్పస్ టైర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

సూపర్ సోకో టిసి హంటర్ నేక్డ్ ఈ-బైక్ విషయానికి వస్తే, ఈ మోడల్ని టిసి వాండరర్ ఆధారంగానే తయారు చేశారు. ఇందులో హెడ్‌లైట్, సీట్ మరియు రియర్ డిజైన్‌లో మార్పులు చేశారు. ఇంకా ఇందులో గ్లోసీ ప్యానెల్స్, రైడర్ సౌకర్యం కోసం ట్రిపుల్ డెన్సిటీ ఫోమ్‌తో తయారు చేసిన సీట్ మరియు రిలాక్స్డ్ రైడింగ్ పొజిషన్ కోసం వెడల్పాటి హ్యాండిల్ బార్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

అంతేకాకుండా, ఇందులో పూర్తిగా డిజిటల్ ఎల్సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు చివర్లలో సింగిల్ డిస్క్ బ్రేక్‌లు, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (సిబిఎస్), యుఎస్డి ఫోర్కులు మరియు రోడ్-బయాస్డ్ రబ్బర్‌తో తయారు చేసిన 17-ఇంచ్ టైర్లు మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

ఎలక్ట్రిక్ మోటార్ విషయానికి వస్తే, ఈ రెండు మోటార్‌సైకిళ్లలో 2.5 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఈ మోటార్‌ను వెనుక చక్రంలోని హబ్‌లో అమర్చారు. ఇది గరిష్టంగా 180 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి గరిష్చంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

ఈ ఎలక్ట్రిక్ మోటార్లు బైక్‌లో అమర్చిన 32 ఆంపియర్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తాయి. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, పూర్తి చార్జ్‌పై ఇవి 200 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తాయి. ఇవి ఈ విభాగంలో కబీరా కెఎమ్ 4000 మరియు కెఎమ్ 3000 ఎలక్ట్రిక్ బైక్‌లకు పోటీగా నిలుస్తాయి.

సూపర్ సోకో లైనప్‌లో చివరిది క్యుమిని ఇ-స్కూటర్. ఇది బేసిక్ డిజైన్ ఎలిమెంట్స్‌తో చాలా సింపుల్‌గా కనిపించే ఎలక్ట్రిక్ స్కూటర్. ప్రత్యేకించి అర్బన్ మొబిలిటీ కోసం ఈ స్కూటర్‌ను రూపొందించారు. ఇందులో 12 ఇంచ్ టైర్లు ఉంటాయి.

క్యుమిని ఎలక్ట్రిక్ స్కూటర్ 600 వాట్ కంటిన్యూస్ మోటార్‌తో పనిచేస్తుంది. ఇందులో తొలగించగలిగిన 20 ఆంపియర్ బ్యాటరీ ఉంటుంది, ఈ బ్యాటరీ బరువు కేవలం 7.8 కిలోలు మాత్రమే ఉంటుంది. పూర్తి చార్జ్‌పై ఈ స్కూటర్ గరిష్టంగా 60-70 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది.

ఇంకా ఇందులో పూర్తి ఎల్ఈడి లైటింగ్ మరియు కీలెస్ స్టార్టప్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులోని స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సాయంతో అలారం, జిపిఎస్ మరియు బ్యాటరీ చార్జ్ వంటి పలు అంశాలను సులువుగా తెలుసుకోవచ్చు. ఇది ఈ విభాగంలో ఆంపియర్ మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా నిలుస్తుంది.