[ad_1]
September 2023 Car Sales Report: 2023 సెప్టెంబర్‌లో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ సుమారు 3.62 లక్షల ప్యాసింజర్ వాహనాల అమ్మకాలతో మంచి గ్రాఫ్‌ను నమోదు చేసింది. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే రెండు శాతానికి పైగా వృద్ధిని, ఈ సంవత్సరం ఆగస్టుతో పోలిస్తే 0.7 శాతం వృద్ధిని చూసింది. పండుగ సీజన్‌లో ఈ అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
అగ్రస్థానంలో మారుతీ సుజుకి
భారతదేశపు అతిపెద్ద వాహనాల తయారీ సంస్థ మారుతి సుజుకి… బ్రెజా, గ్రాండ్ విటారా, జిమ్నీ వంటి మోడళ్లతో దేశంలోని ప్రముఖ ఎస్‌యూవీ తయారీదారుగా అగ్రస్థానంలో ఉంది. ఈ ఇండో-జపనీస్ వాహన తయారీ సంస్థ 2022 సెప్టెంబర్‌లో 1,48,380 యూనిట్లు విక్రయించగా… 2023 సెప్టెంబర్‌లో ఆ సంఖ్య కాస్త పెరిగి 1,50,812 యూనిట్ల రిటైల్ విక్రయాలను నమోదు చేసింది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా తన అత్యధిక నెలవారీ విక్రయాలను సాధించింది. మొత్తంగా 54,241 యూనిట్లను హ్యుందాయ్ విక్రయించింది. ఈ స్థాయి అమ్మకాలను సాధించడానికి క్రెటా, వెన్యూ, ఎక్సెటర్ ప్రధాన సహకారాన్ని అందించాయి. అయితే టాటా మోటార్స్ అమ్మకాలు సంవత్సరానికి 6.0 శాతం క్షీణించాయి. కంపెనీ గత ఏడాది సెప్టెంబర్‌లో 47,655 యూనిట్లను విక్రయించింది. కానీ ఈ సంవత్సరం సెప్టెంబర్‌కు అది 44,810 యూనిట్లకు తగ్గింది. హారియర్, సఫారీ కొత్త మోడళ్ల రాక కోసం వేచి ఉండటమే టాటా అమ్మకాలు తగ్గడానికి కారణం అని చెప్పవచ్చు.
41,267 యూనిట్ల మొత్తం అమ్మకాలతో మహీంద్రా నాలుగో స్థానాన్ని పొందింది. ఎక్స్‌యూవీ700 దాని అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. టయోటా కిర్లోస్కర్ మోటార్ కూడా అద్భుతమైన పనితీరును కొనసాగించింది. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో టయోటా కిర్లోస్కర్ 22,168 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే 44 శాతం వృద్ధిని సాధించింది.
ఆల్ టైమ్ రికార్డు అమ్మకాలు సాధించిన ఎస్‌యూవీలు
గత నెలలో ఎస్‌యూవీ అమ్మకాలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 2022 సెప్టెంబర్‌లో టాటా నెక్సాన్ 14,518 యూనిట్లు విక్రయించగా… 2023 సెప్టెంబర్‌లో 15,325 యూనిట్లతో భారతదేశంలోనే అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా నిలిచింది. దీని అమ్మకాలు ఏకంగా ఆరు శాతం పెరిగింది. మారుతీ సుజుకి బ్రెజా 15,001 యూనిట్లతో అమ్మకాలలో రెండో స్థానంలో నిలిచింది. కాగా ఈ కాలంలో టాటా పంచ్ మొత్తం 13,036 యూనిట్లను విక్రయించి మూడో స్థానంలో నిలిచింది.
హ్యుందాయ్ క్రెటా మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు నాయకత్వం వహించింది. 2023 సెప్టెంబర్‌లో హ్యుందాయ్ క్రెటాకు సంబంధించి 12,717 యూనిట్లు అమ్ముడుపోయాయి. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన నాలుగో ఎస్‌యూవీగా నిలిచింది. 12,204 యూనిట్లతో హ్యుందాయ్ వెన్యూ ఐదో స్థానంలో ఉంది.
మరోవైపు మారుతి సుజుకి 2023 ఆటో ఎక్స్‌పోలో ఈవీఎక్స్ కాన్సెప్ట్‌ను తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా ప్రదర్శించింది. 2023 టోక్యో మోటార్ షోలో ఈ కాన్సెప్ట్ ప్రొడక్షన్ రెడీ ప్రివ్యూ మోడల్‌ను ప్రదర్శించనున్నట్లు సుజుకి మోటార్ కార్పొరేషన్ అధికారికంగా ప్రకటించింది.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
Read Also: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే – కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
[ad_2]
Source link