సెబీ హెచ్చరిక..
సెక్యూరిటీస్ మార్కెట్‌లో నిరంతరం సాఫీగా లావాదేవీలు జరిపేందుకు ఇన్వెస్టర్లు తమ పాన్‌ను మార్చి 31లోగా ఆధార్ నంబర్‌తో లింక్ చేయాలని క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ సూచించింది. సీబీడీటీ సర్క్యులర్‌కు అనుగుణంగా ప్రక్రియను పూర్తి చేయని వారి ఖాతాలు KYC కానివిగా పరిగణించబడతాయి. దీనికి తోడు సెక్యూరిటీలు, ఇతర లావాదేవీలపై పరిమితులు ఉండవచ్చని సెబీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.

టాక్స్ రూల్స్ ప్రకారం..
ఆదాయపు పన్ను చట్టం-1961లోని నిబంధనల ప్రకారం PAN నంబరు కేటాయించబడిన ప్రతి వ్యక్తి తమ ఆధార్ నంబర్‌ను నిర్దేశిత అధికారికి తెలియజేయడం తప్పనిసరి. దీని ద్వారా పాన్, ఆధార్ లను అనుసంధానించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను నోటిఫై చేసిన తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే సీబీడీటీ 2022 మార్చిలో విడుదల చేసిన సర్క్యులర్ నెం-7 ప్రకారం మార్చి 31, 2023లోపు ఆధార్‌తో లింక్ చేయకపోతే ఒక వ్యక్తికి కేటాయించిన పాన్ పనిచేయదు.

PAN ఎందుకు కీలకం..
సెబీ రిజిస్టర్డ్ ఎంటిటీలు, మార్కెట్లో సెక్యూరిటీల అన్ని లావాదేవీలను నిర్వహించటానికి KYC పూర్తి చేయటం అత్యవసరం. అయితే దీనికి PAN కీలకమైన గుర్తింపు సంఖ్య. ఈ క్రమంలో మ్యూచువల్ ఫండ్స్, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (AMCలు), ట్రస్టీ ఎంటిటీల కోసం ఫోరెన్సిక్ ఆడిటర్ల ఎంప్యానెల్‌మెంట్ కోసం దరఖాస్తుల సమర్పణ కోసం క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ మార్చి చివరి వరకు గడువును పొడిగించింది.