Income Tax Refund: 2022-23 ఆర్థిక సంవత్సరం లేదా 2023-24 మదింపు సంవత్సరానికి ఇప్పటి వరకు 6.91 కోట్లకు పైగా ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్నులు దాఖలయ్యాయి. ITR ఫైల్‌ చేసిన వాళ్లలో అర్హులైన కోట్ల మంది టాక్స్‌పేయర్లు ఇప్పటికే రిఫండ్‌ అందుకున్నారు. ఇంకా, ఆదాయ పన్ను విభాగం రీఫండ్స్‌ జారీ చేస్తూనే ఉంది. ఇప్పుడు, ఇన్‌కమ్‌ టాక్స్‌ రిఫండ్ కాల పరిమితిలో ఐటీ డిపార్ట్‌మెంట్ భారీ మార్పులు చేసే ప్రయత్నాల్లో ఉంది. 

సాధారణంగా, ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేసిన 7 రోజుల నుంచి 120 రోజుల లోపు ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ సదరు టాక్స్‌పేయర్‌కు రిఫండ్‌ చెల్లిస్తుంది. రిఫండ్‌ మొత్తం టాక్స్‌పేయర్‌ బ్యాంక్‌ అకౌంట్‌లో క్రెడిట్‌ అవుతుంది. ఈ ఏడాది రిఫండ్‌ టైమ్‌ బాగా తగ్గింది, చాలా మందికి సగటున 16 రోజుల్లోనే డబ్బు తిరిగొచ్చింది. బిజినెస్ స్టాండర్డ్‌ రిపోర్ట్‌ ప్రకారం, రిఫండ్‌ల జారీ ప్రక్రియను ఇంకా వేగవంతం చేయడానికి రెవెన్యూ శాఖ ప్రయత్నిస్తోంది. సగటు గడువు 16 రోజుల నుంచి 10 రోజులకు తగ్గించేందుకు చూస్తోంది. ఈ ప్రక్రియను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి నాటికి అమలు చేయాలనే పట్టుదలతో ముందుకు వెళ్తోంది. 

ఇది అమల్లోకి వస్తే, పన్ను చెల్లింపుదార్లపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది, రోజుల తరబడి ఎదురు చూపులకు కాలం చెల్లుతుంది. ఒక వ్యక్తి ITR దాఖలు చేసిన 10 రోజుల్లోపే డబ్బు వాపసు పొందడానికి వీలవుతుంది.

బిజినెస్ స్టాండర్డ్‌ రిపోర్ట్‌ ప్రకారం, తక్కువ సమయంలో ITR ప్రాసెసింగ్‌ పూర్తయ్యేలా చూడడం ద్వారా వీలైనంత త్వరగా రిఫండ్‌ జారీ చేయవచ్చని ఐటీ డిపార్ట్‌మెంట్‌ భావిస్తున్నట్లు ఒక సీనియర్ అధికారి చెప్పారు. దీంతో పాటు, ఇప్పుడు రిఫండ్ జారీ ప్రక్రియ పూర్తిగా ఎలక్ట్రానిక్‌గా మారిందని వెల్లడించారు. కాబట్టి, ఆదాయ పన్ను విభాగం ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా రిఫండ్‌ ఇష్యూ చేయగలుగుతుంది.

ఇప్పటివరకు ఎంత రిఫండ్‌ జారీ అయింది?
ఆదాయ పన్ను విభాగం విడుదల చేసిన డేటా ప్రకారం… ఈ ఏడాది ఏప్రిల్ 1 – ఆగస్టు 21 తేదీల మధ్య, ఐటీ డిపార్ట్‌మెంట్‌ మొత్తం రూ. 72,215 కోట్ల రిఫండ్స్‌ జారీ చేసింది. ఇందులో కంపెనీలకు రూ. 37,775 కోట్లు, వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లకు (Individual tax payers) రూ. 34,406 కోట్లు జారీ అయ్యాయి. రిఫండ్‌లను జారీ చేసిన తర్వాత, ఐటీ శాఖ నికర పన్ను వసూళ్లు (Net tax collection) రూ. 5.88 లక్షల కోట్లుగా ఉన్నాయి.

టాక్స్‌ రిఫండ్‌ ఇంకా రాలేదా?
మీరు ఐటీ రిటర్న్ ఫైల్‌ చేసి ఎక్కువ రోజులు అయినా ఇంకా రిఫండ్ రాకపోతే, ఫైలింగ్‌ సమయంలో ఏదైనా పొరపాటు జరిగిందేమో ఒకసారి క్రాస్‌ చెక్‌ చేసుకోవాలి. ముఖ్యంగా, రిటర్న్‌ ఫైల్‌ చేసిన నాటి నుంచి 30 రోజుల్లోపు దానిని ఈ-వెరిఫై చేయకపోతే, ఐటీ రిటర్న్‌ సబ్మిట్‌ చేసినట్లుగా డిపార్ట్‌మెంట్‌ పరిగణించదు. అప్పుడు, ఆ ITR ప్రాసెస్ ప్రారంభం కాదు, రిఫండ్‌ రాదు. ఇన్‌కమ్‌ టాక్స్‌ యాక్ట్‌ ప్రకారం, ఐటీఆర్‌ను ధృవీకరించిన వారికి మాత్రమే పన్ను వాపసు జారీ అవుతుంది. మీరు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ITR ఫైల్ చేసినట్లయితే, రిఫండ్‌ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో చెక్‌ చేయవచ్చు.

IT రిఫండ్ స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో ఎలా చెక్‌ చేయాలి?
ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లిండి. నకిలీ సైట్లు కూడా ఇంటర్నెట్‌లో ఉన్నాయి, జాగ్రత్త.
మీ లాగిన్ యూజర్ ID (PAN నంబర్), పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేయండి
ఆ తర్వాత, మీరు View Returns లేదా ఫామ్ ఆప్షన్‌ ఎంచుకోవాలి
డ్రాప్ డౌన్ బాక్స్‌లో ఆదాయ పన్ను రిటర్న్స్ ఆప్షన్‌ ఎంచుకోండి
ఆ తర్వాత, అసెస్‌మెంట్ ఇయర్‌ను ఎంటర్‌ చేసి సబ్మిట్‌ చేయండి
ఇప్పుడు, మీ ITR రిసిప్ట్స్‌ నంబర్‌ నమోదు చేయండి
కొన్ని నిమిషాల్లోనే మీ ITR రీఫండ్ స్టేటస్‌ మీకు కనిపిస్తుంది

వాపసు స్థితిని NSDL వెబ్‌సైట్‌లో ఎలా తనిఖీ చేయాలి?
మీరు tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html ని సందర్శించండి.
మీ పాన్ నంబర్, అసెస్‌మెంట్ ఇయర్‌, క్యాప్చా కోడ్‌ను నమోదు చేసి, ప్రొసీడ్‌పై క్లిక్ చేయండి
మీ IT రిఫండ్‌ ప్రస్తుత స్థితి వెంటనే మీ కళ్ల ముందు కనిపిస్తుంది

మరో ఆసక్తికర కథనం: బ్రోకరేజ్‌ ‘బయ్‌’ కాల్‌ ఇచ్చిన బెస్ట్‌ లార్జ్‌ క్యాప్‌ స్టాక్స్‌ – మంచి లాభాలకు అవకాశం!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *