సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ బినోయ్ విశ్వం
ఘనంగా చండ్ర రాజేశ్వరరావు 111వ జయంతి ఉత్సవాలు
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
స్వాతంత్య్ర పోరాటకాలంలో గాంధీజీ నినదించిన ‘స్వరాజ్యం’ అంటే ప్రజలందరికీ కూడు, గూడు, నీడ అని, 75 ఏండ్ల స్వాతంత్య్రానంతరం స్వరాజ్యం ఎక్కడుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ బినోయ్ విశ్వం అన్నారు. ప్రధాని మోడీ నినదిస్తున్న ‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్’ పూర్తిగా అబద్దమని అన్నారు. మోడీ బడా పెట్టుబడిదారులతో, కార్పోరేట్ సంస్థలతో అంటకాగుతున్నారని విమర్శించారు. చండ్ర రాజేశ్వరరావు 111వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్ కొండాపూర్ సీఆర్ ఫౌండేషన్‌లో సోమవారం జరిగాయి. ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కె.నారాయణ అధ్యక్షతన జరిగిన సభలో బినయ్ విశ్వంతోపాటు ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి హాజరయ్యారు. దేశంలో ఫాసిజం ఎత్తుగడలో భాగంగా మతోన్మాదం పేరుతో ప్రజలను చీల్చి రెండు వర్గాలనూ దోచుకునే ఎత్తుగడ కొనసాగుతోందనిబినోరు విశ్వం విమర్శించారు. 1980లో మొట్టమొదటిసారి సీపీఐ, సీపీఐ(ఎం) రెండు పార్టీలు కలిసి కేరళలో ఉమ్మడిగా పోరాటానికి సిద్ధపడ్డాయని తెలిపారు. సిఆర్, నంబూద్రిపాద్ చేసే ఉపన్యాసాలు వినేందుకు కేరళ రాష్ట్ర ప్రజలు తండోపతండాలుగా వచ్చేవారని ఆయన గుర్తుచేశారు. ప్రతీ దేశంపై సుంకాల పేరుతో ట్రంప్ చేస్తున్న దాడిని ప్రపంచం తిరస్కరిస్తుంటే ఆ విధానాన్ని మోడీ తిరస్కరించడం లేదన్నారు. ఆర్థికవేత్త ప్రొఫెసర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ప్రజల కొనుగోలు శక్తి ఆధారంగా పేదరికాన్ని అంచనా వేయడం తగదన్నారు. భారతదేశం జీడీపీ వృద్ధిలో జపాన్ దాటిపోయామని చెబుతున్నా ప్రధాని, మరి తలసరి ఆదాయంలో భారత్ 136వ స్థానంలో ఎందుకు ఉందని ప్రశ్నించారు. అంతకుముందు సీఆర్ ఫౌండేసన్ ప్రాంగణంలో ఉన్న సిఆర్, తెలంగాణ సాయుధ పోరాట యోధులు రావి నారాయణరెడ్డి విగ్రహాలకు బినోయ్ విశ్వం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు జల్లి విల్సన్, ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి, కార్యదర్శులు చెన్నమనేని వెంకటేశ్వరరావు, పి.జె.చంద్రశేఖరరావు, సీఆర్ పాలిక్లినిక్ డైరెక్టర్ డాక్టర్ కె.రజని, నీలం రాజశేఖరరెడ్డి పరిశోధన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ టి.సురేష్, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జాతీయ నాయకులు డాక్టర్ బి.వి.విజయలక్ష్మి, పి.ప్రేమ్ పావని, ఫౌండేషన్ కోశాధికారి వి. చెన్నకేశవ రావు, తదితరులు పాల్గొన్నారు.
The post స్వరాజ్యం ఎక్కడుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు appeared first on Navatelangana.