Andhra Pradesh
oi-Srinivas Mittapalli
అమరావతిలో హైకోర్టు బార్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం రసాభాసగా ముగిసింది. బార్ అసోసియేషన్ ఎన్నికలపై చర్చించేందుకు సమావేశమైన సభ్యుల మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేదాకా వెళ్లింది. న్యాయవాదుల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా… కొంతమంది సభ్యులు కుర్చీలతో పరస్పరం దాడి చేసుకున్నారు.
ఈ ఘర్షణలో బార్ కౌన్సిల్ సభ్యుడు అజయ్ కుమార్‌కి తలకు గాయాలయ్యాయి. పోలీసులకు సమాచారం అందడంతో హుటాహుటిన అక్కడికి చేరుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు.
ఈ వివాదాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు వివరించాలని గాయపడ్డ న్యాయవాదులు భావిస్తున్నారు.న్యాయవాదులు కోస్తా వర్గం,రాయలసీమ వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగినట్లు తెలుస్తోంది.

సాధారణంగా ప్రతీ ఏడాది బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతుంటాయి. ఈ ఏడాది ఇప్పటికే సుప్రీం కోర్టు నుంచి బెజవాడ కోర్టు వరకు అన్ని న్యాయస్థానాలకు బార్ కౌన్సిల్ ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే అమరావతిలోని ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికలు మాత్రం ఇప్పటివరకూ జరగలేదు. గతేడాది కరోనా కారణంగా వాయిదాపడ్డ ఎన్నికలను ఇప్పుడు నిర్వహించేందుకు తాజాగా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అయితే హైకోర్టును ప్రభుత్వం కర్నూలు తరలించే యోచనలో ఉంది కాబట్టి… అక్కడికి తరలించాకే ఎన్నికలు నిర్వహించాలని రాయలసీమకు చెందిన న్యాయవాదులు కోరినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను కోస్తాకు చెందిన కొంతమంది న్యాయవాదులు వ్యతిరేకించడంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.
ఎన్నికలు ఇక్కడే నిర్వహించాలని ఒక వర్గం… లేదు హైకోర్టుకు కర్నూలుకు తరలించాకే నిర్వహించాలని మరో వర్గం పట్టుబట్టడమే గొడవకు కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో న్యాయవాదులు కుర్చీలతో దాడి చేసుకోవడంతో అజయ్ కుమార్ అనే న్యాయవాది తలకు గాయాలయ్యాయి. హైకోర్టు చీఫ్ జస్టిస్ గోస్వామికి దీనిపై ఆయన ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.