విషాదంలో షేక్‌పేట.. మిన్నంటిన కుటుంబసభ్యుల రోదనలు
మరో 8 మంది మాత్రం విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతన్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఇక మృతదేహాలు, క్షతగాత్రులు షేక్‌పేటకు చేరుకోవడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.
బాధిత కుటుంబసభ్యులు, బంధువుల కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, ఆదివారం సాయంత్రం సత్యనారాయణ, సరిత, శ్రీనిత్య మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పాతబస్తీలోని నివాసానికి లత మృతదేహాన్ని తరలించారు.

డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఘోరం.. 30 సెకన్ల ముందు చెప్పాడు..
కాగా, అరకు బస్సు లోయలో పడేందుకు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రమాదం నుంచి బయటపడిన బాధితుడు తెలిపారు. లోయలో పడే కొన్ని క్షణాల ముందు బస్సు బ్రేకులు ఫెయిల్ అయినట్లు డ్రైవర్ చెప్పాడని, ఆ తర్వాత అతడు బస్సులోంచి కిందకు దూకేశాడని తెలిపారు. ట్రావెల్స్ వారు మంచి అనుభవం ఉన్న డ్రైవర్‌ను పంపించమంటే.. అనుభవం లేని డ్రైవర్‌ను పంపించారని, డ్రైవర్ వల్లే ఈ ఘోరం జరిగిందని బాధితుడు వాపోయాడు.

కేజీహెచ్‌లో చికిత్స అంతంత మాత్రమే.. కేసీఆర్‌కు వినతి
ఇది ఇలావుంటే, విశాఖ కేజీహెచ్‌లో సరైన చికిత్స అందించడం లేదని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను హైదరాబాద్‌కు తరలిస్తే సొంత ఖర్చులతో చికిత్స చేయించుకుంటామని చెబుతున్నారు. ఈ మేరకు మీడియా ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బాధిత కుటుంబసభ్యులు విన్నవించారు. అరకులో జరిగిన బస్సు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 19 మందికి గాయాలైన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 10న హైదరాబాద్ నుంచి కుటుంబసభ్యులంతా విహారయాత్రకు బయల్దేరారు. గత శుక్రవారం ఉదయం అరకు వెళ్లి పర్యటక ప్రాంతాల్లో సరదాగా గడిపారు. బొర్రా గుహలను సందర్శించి శుక్రవారం రాత్రి తిరుగుపయనమైన క్రమంలో రాత్రి 7గంటలకు ఈ ప్రమాదం జరిగింది.