హైదరాబాద్: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా.. మహిళలపై జరుగుతున్న దారుణాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా, హైదరాబాద్ నగర శివారులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని అత్యాచారానికి గురైంది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం చోటు చేసుకుంది.
ఘట్ కేసర్ సమీపంలోని ఓ కాలేజీలో చదువుతున్న ఫార్మసీ విద్యార్థిని.. కాలేజీ ముగిసిన తర్వాత ఆటోలో ఇంటికి బయల్దేరింది. అయితే, ఆ విద్యార్థినిపై కన్నేసిన ఆటో డ్రైవర్.. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లాడు. ఆ తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
అనంతరం ఆ యువతిని వివస్త్రగా మార్చి రోడ్డుపై వదిలి అక్కడ్నుంచి పరారయ్యాడు ఆటో డ్రైవర్. బాధితురాలిని మేడిపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి నుంచి వాంగ్మూలం తీసుకున్న ఘట్ కేసర్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, నిందిత ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తమ కూతురుపై జరిగిన దారుణ ఘటనపై ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిన అమ్మాయి తిరిగి సురక్షితంగా వస్తుందన్న నమ్మకం పోతోందని వాపోయారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.