RBI Governor on 2000 Rupees Notes: ₹2000 నోటు ఉపసంహణపై తొలిసారి స్పందించారు రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das). మీడియా సమావేశం నిర్వహించిన దాస్‌, 2000 రూపాయల నోట్ల ఉపసంహరణపై మాట్లాడారు. ఆ నోట్లను ఎందుకు తీసుకువచ్చామో ఆ ఉద్దేశ్యం నెరవేరిందని చెప్పారు. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరత రాకుండా చూసేందుకు, వ్యవస్థలోకి వేగంగా నగదును చొప్పించడం కోసం రూ. 2,000 నోటును తీసుకొచ్చినట్లు వివరించారు. ఇప్పుడు వ్యవస్థలో నగదు కొరత లేకపోవడం & పెద్ద డినామినేషన్ నోట్ల వాడకం తగ్గడాన్ని దృష్టిలో పెట్టుకుని రూ. 2000 నోట్లను చెలామణి నుంచి వెనక్కు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. 

సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రూ. 2000 నోట్లను మార్పిడి, ఖాతాల్లో జమ జరుగుతాయని ఆర్‌బీఐ గవర్నర్‌ వెల్లడించారు. 2 వేల రూపాయల నోట్లను మార్చుకోవడానికి ప్రజలకు సెప్టెంబరు 30వ తేదీ వరకు సమయం ఇచ్చాం కాబట్టి, ఆ గడువు నాటికి చాలా వరకు రూ. 2,000 నోట్లు తిరిగి ఖజానాకు చేరతాయని తాము భావిస్తున్నట్లు శక్తికాంత దాస్‌ చెప్పారు.

₹2000k నోట్ల డిపాజిట్లకు పాత రూల్‌
రూ. 2000 నోట్ల జమకు కొత్త రూల్స్‌ ఏమీ పెట్టలేదన్న గవర్నర్‌, ఒక ఖాతాలో రూ. 50,000 కంటే ఎక్కువ మొత్తంలో చేసే డిపాజిట్లకు పాన్‌ సమర్పించాలనే నిబంధన ఇప్పటికే ఉన్నట్లు గుర్తు చేశారు. అదే నిబంధన రూ. 2,000 నోట్ల డిపాజిట్లకూ వర్తిస్తుందని స్పష్టం చేశారు. ప్రజలు తీసుకొచ్చిన రెండు వేల రూపాయల నోట్లను తీసుకుని, ఇతర డినామినేషన్ల నోట్లను ఇచ్చే విధంగా సన్నద్ధం కావాలని బ్యాంకులను ఇప్పటికే ఆదేశినట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ చెప్పారు. 

నోట్ల మార్పిడి, జమ కోసం బ్యాంకుల వద్ద బారులు తీరి ఇబ్బంది పడవద్దని దాస్‌ ప్రజలకు సూచించారు. నోట్ల మార్పిడికి, జమకు నాలుగు నెలల సమయం ఉంది కాబట్టి బ్యాంకులకు రావడానికి తొందరపడవద్దని, మార్కెట్‌లో ఇతర నోట్ల కొరత లేదని స్పష్టం చేశారు. RBI నిర్ణయాన్ని ప్రజలు సీరియస్‌గా తీసుకుని, పెద్ద నోట్లన్నీ వాపస్‌ చేస్తారనే ఉద్దేశంతోనే అంత సమయం ఇచ్చామని శక్తికాంత దాస్‌ చెప్పారు. దేశంలోని కొందరు వ్యాపారులు చాలా కాలం క్రితం నుంచే రూ. 2,000 నోట్లను తీసుకోవడం లేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఆర్‌బీఐ గవర్నర్‌ వెల్లడించారు. పెద్ద నోట్ల ఉపసంహరణ ప్రకటన తర్వాత అలాంటి వ్యాపారుల సంఖ్య పెరిగిందని అన్నారు. 

రూ.1,000 నోట్లను మళ్లీ తీసుకొస్తారా?
రూ. 2000 నోటు తీసుకురావడానికి చాలా కారణాలు ఉన్నాయని, విధాన నిర్ణయం ప్రకారం ఆ చర్య తీసుకున్నామని శక్తికాంత దాస్ తెలిపారు. 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవడం క్లీన్ నోట్ పాలసీలో భాగమని, దీన్ని ఆర్‌బీఐ కరెన్సీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లో భాగంగా పరిగణించాలని ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు. భారత కరెన్సీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ చాలా పటిష్టంగా ఉందన్న ఆర్‌బీఐ గవర్నర్, మరిన్ని రూ. 500 నోట్లను ప్రవేశపెట్టాలనే నిర్ణయం ప్రజల నుంచి వచ్చే డిమాండ్‌పై ఆధారపడి ఉంటుందని వివరించారు. రూ. 2000 రూపాయల లోటును భర్తీ చేయడానికి రూ. 1,000 నోట్లను మళ్లీ తీసుకొస్తారా అన్న ప్రశ్నకు, అలాంటి  వార్తలు కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు.

మార్కెట్‌లో చలామణీలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో రూ. 2,000 నోట్ల వాటా కేవలం 10.18% మాత్రమేనన్న గవర్నర్‌, వాటి ఉపసంహరణ వల్ల ఆర్థిక వ్యవస్థపై చాలా తక్కువ ప్రభావం ఉంటుందని అన్నారు.

ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా రూ.2000 నోట్ల డిపాజిట్లను అనుమతిస్తే నల్లధనాన్ని ఎలా గుర్తిస్తారని ఒక పాత్రికేయుడు ప్రశ్నించగా… పెద్ద మొత్తంలో జరిగే డిపాజిట్ల తనిఖీ విషయాన్ని ఆదాయ పన్ను విభాగం చూసుకుంటుందని చెప్పారు. నగదు జమ విషయంలో ఇప్పటికే ఉన్న నిబంధనలనే రూ. 2000 నోట్ల జమ సందర్భంలోనూ అమలు చేస్తాయని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: బ్యాంక్‌ల వెంటబడ్డ ఎఫ్‌పీఐలు, షాపింగ్‌ లిస్ట్‌లో ఫస్ట్‌ పేరు అదేSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *