PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

ఆదాయం పెరిగినా 15% తగ్గిన రిలయన్స్ Q3 లాభం


Reliance Q3 Result: 2022-23 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో (Q3FY23) నికర లాభం రూ. 15,792 కోట్లుగా రిలయన్స్‌ ప్రకటించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో (Q3FY22) ఈ కంపెనీ రూ. 18,549 కోట్ల లాభాన్ని ఆర్జించింది.  శుక్రవారం (20 జనవరి 2023) మార్కెట్‌ పని గంటల తర్వాత, డిసెంబర్‌ త్రైమాసిక ఫలితాలను RIL ప్రకటించింది.

గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ. 1,91,271 కోట్లతో పోలిస్తే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో రూ. 2,20,592 కోట్లకు పెరిగింది. ఇది 15% వృద్ధి. ఏడాది ప్రాతిపదికన ‍‌(YoY), ఎబిటా (EBITDA) 13.5% పెరిగి రూ. 38,460 కోట్లకు (4.6 బిలియన్ డాలర్లు) చేరుకుంది.

మొత్తం వ్యయాలు పెరగడమే లాభ క్షీణతకు కారణంగా రిలయన్స్‌ వెల్లడించింది. విడివిడిగా చూస్తే.. ఆర్థిక లేదా రుణ వ్యయాలు 36.4% పెరిగి రూ. 5,201 కోట్లకు, ఇతర వ్యయాలు రూ. 5,421 కోట్ల  మేర పెరిగాయని తెలిపింది. తరుగుదల కూడా 32.6% పెరిగి రూ. 10,187 కోట్లుగా నమోదైంది. డీజిల్‌, విమాన ఇంధన ఎగుమతులపై విధించిన పన్ను వల్ల లాభం మీద 1898 కోట్ల రూపాయల మేర ప్రభావం కనిపించింది.

లాభం పెంచుకున్న రిలయన్స్ జియో 
రిలయన్స్‌ టెలికాం విభాగమైన రిలయన్స్ జియో (Reliance Jio) నికర లాభం డిసెంబర్‌ త్రైమాసికంలో 28.3% పెరిగి రూ. 4,638 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 3,615 కోట్ల నికర లాభాన్ని ఈ విభాగం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 19,347 కోట్లుగా జియో ఆదాయం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 18.8% వృద్ధితో రూ. 22,993 కోట్లకు పెరిగింది.

మూడో త్రైమాసికంలో, రిలయన్స్ జియో మొత్తం డేటా ట్రాఫిక్ 23.9% పెరిగి 29 బిలియన్ GBకి చేరుకుంది. మొత్తం వాయిస్ ట్రాఫిక్ కూడా 10.4% పెరిగి 1.27 ట్రిలియన్ నిమిషాలకు చేరుకుంది. జియో చందాదారుల సంఖ్య 17.5 వృద్ధితో 43.3 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారుపై సగటు ఆదాయం (ARPU -ఆర్పు) రూ. 151.6 నుంచి రూ. 178.2 కి చేరింది. Jio భారతదేశంలోని 22 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 134 నగరాలను True5G నెట్‌వర్క్‌తో ఈ కంపెనీ కనెక్ట్ చేసింది. రిలయన్స్ జియో 5G నెట్‌వర్క్‌ను వేగంగా ఏర్పాటు చేస్తోందని జియో ఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ వెల్లడించారు. True5G నెట్‌వర్క్‌ను 2023 డిసెంబరు కల్లా దేశవ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు.

రిటైల్‌ వ్యాపారంలో 38% వృద్ధి
2022 డిసెంబర్‌ త్రైమాసికంలో డిజిటల్ కామర్స్ & న్యూ కామర్స్ వ్యాపారాల్లో గణనీయమైన వృద్ధి కనిపించింది. రిలయన్స్‌ రిటైల్‌ ఆదాయం రూ. 50,654 కోట్ల నుంచి 18.64% YoY వృద్ధితో రూ. 60,096 కోట్లకు పెరిగింది. నికర లాభం 6.4% పెరిగి రూ. 2,400 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా మరో 789 స్టోర్లను కంపెనీ ప్రారంభించింది, వీటితో కలిపి మొత్తం స్టోర్ల సంఖ్య 17,225 కు చేరింది. డిజిటల్‌ కామర్స్‌ & న్యూ కామర్స్‌ బిజినెస్‌లు 38% పెరిగాయి. ఇవి ఉమ్మడిగా, రిటైల్‌ ఆదాయంలో 18% వాటాను అందించాయి.

గ్రీన్‌ ఎనర్జీ మీద ఫోకస్‌
గ్రీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేసే గిగా ఫ్యాక్టరీల ఏర్పాటు, 5జీ సర్వీసులు, రిటైల్‌ బిజినెస్‌ విస్తరణ కోసం NCDలను జారీ చేసి రూ. 20,000 కోట్లను సమీకరిస్తామని రిలయన్స్‌ వెల్లడించింది. ఈ విభాగాలపై, ముఖ్యంగా గిగా ఫ్యాక్టరీల మీద ఏడాది వ్యవధిలోనే ఈ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టింది. వీటి కోసం తెచ్చిన రుణాల కారణంగా, RIL మొత్తం రుణాలు క్రితం ఏడాది నుంచి ఇప్పటి వరకు రూ. 59,000 కోట్లు పెరిగి రూ. 3,03,530 కోట్లకు చేరుకున్నాయి. కంపెనీ వద్ద రూ. 1,93,282 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *