PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

చిన్నపాటి పెట్టుబడితో మీ కుమార్తెకు 21 ఏళ్లు వచ్చేసరికి ₹50 లక్షలు చేతికివ్వండి


Sukanya Samriddhi Yojana: భారతదేశంలో ఆడపిల్లల బంగారు భవిష్యత్‌ కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజనను (Sukanya Samriddhi Yojana లేదా SSY) ప్రారంభించింది. ఈ పథకం కింద చిన్న మొత్తాల్లో మీరు పెట్టే పెట్టిబడి, మీ కుమార్తెను లక్షాధికారిని చేస్తుంది. ఇందు కోసం, మీ పాప పుట్టినప్పటి నుంచి మీరు పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. ఈ పథకాన్ని కేవలం ఆడపిల్లల కోసమే ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. ఈ స్కీమ్‌ కింద, 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికల తల్లిదండ్రులు వారి కుమార్తెల పేరుతో ఖాతాలను ప్రారంభించవచ్చు.

ఆడపిల్ల పుట్టిన సమయంలో ఈ పథకాన్ని ప్రారంభించడానికి తల్లిదండ్రులకు వీలు పడకపోతే, ఆమెకు 10 లోపు వయస్సు ఉన్నంతవరకు ఎప్పుడైనా ఈ ఖాతాను ప్రారంభించవచ్చు. ఆ పాపకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత, అప్పటి వరకు పెట్టిన పెట్టుబడిలో సగం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇది, మీ కుమార్తె ఉన్నత చదువుల కోసం పనికి వస్తుంది. పాపకు 21 ఏళ్లు పూర్తయిన తర్వాత, ఆ ఖాతాలో ఉన్న మొత్తం పెట్టుబడిని తీసేసుకోవచ్చు. ఇది, ఉన్నత చదువు లేదా వివాహ ఖర్చుల కోసం ఉపయోగపడుతుంది. అంటే, మీ కూతురి చదువు నుంచి పెళ్లి వరకు అయ్యే ఖర్చులను ఈ పథకం భరిస్తుంది.

సుకన్య సమృద్ధి యోజన కింద ఎంత వడ్డీ ఇస్తారు?         
సుకన్య సమృద్ధి యోజన కింద ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీని నిర్ణయిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి, ఈ పథకంపై వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం, సుకన్య సమృద్ధి యోజన పథకం కోసం చెల్లిస్తున్న వార్షిక వడ్డీ 8 శాతం. దీనికిముందు, ఏటా 7.60 శాతం వడ్డీని ఇచ్చేది. అంటే, FY 2024 మొదటి త్రైమాసికంలో SSY వడ్డీ రేటు 40 బేసిస్‌ పాయింట్లు (bps) పెరిగింది. ఈ పథకం కింద పోస్టాఫీసులో ఖాతా తెరవవచ్చు.

మీ కుమార్తె 21 ఏళ్లకే అర్ధ కోటీశ్వరురాలు అవుతుంది                      
లెక్క ప్రకారం, ఒక వ్యక్తి తన కుమార్తె పుట్టిన వెంటనే సుకన్య సమృద్ధి పథకం కింద ఖాతా ప్రారంభించి, నెలకు రూ. 10 వేలు చొప్పున పెట్టుబడి పెట్టడం మొదలు పెట్టాలి. అలా, అతను 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టగలడు. ఇది కాకుండా, ఆ తల్లిదండ్రులు తమ కుమార్తెకు 18 ఏళ్లు నిండిన తర్వాత మెచ్యూరిటీ మొత్తంలో 50 శాతం విత్‌డ్రా చేసుకోకుండా ఉండాలి. తద్వారా, ఆమెకు 21 సంవత్సరాలు వచ్చేసరికి మెచ్యూరిటీ రూపంలో 51 లక్షల రూపాయలు పొందుతుంది.

ఇందులో రూ. 18 లక్షలు తల్లిదండ్రులు పెట్టిన పెట్టుబడి. 21 ఏళ్ల మెచ్యూరిటీ వ్యవధి తర్వాత రూ. 33 లక్షలు వడ్డీ రూపంలో అందుతుంది. మొత్తం కలిపి రూ. 51 లక్షలు అవుతుంది. అంటే ఆడపిల్ల పుట్టిన వెంటనే సుకన్య సమృద్ధి పథకం ఖాతాలో తల్లిదండ్రులు నెలకు రూ. 10 వేలు జమ చేస్తూ వెళితే, 21 ఏళ్లకే ఆ అమ్మాయి అర్ధ కోటీశ్వరురాలు అవుతుంది.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *