PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

తెలంగాణలో ఆపిల్‌ ఎయిర్‌పాడ్ల తయారీ!, కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఫాక్స్‌కాన్‌


Foxconn – Apple AirPod: ఆపిల్‌ ఐఫోన్లను ఉత్పత్తి చేసే తైవాన్‌ కంపెనీ ఫాక్స్‌కాన్ (Foxconn), ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ రూపొందించే ఆర్డర్‌ను గెలుచుకున్నట్లు సమాచారం. వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లను ఉత్పత్తి చేయడానికి భారత్‌లోనే ఒక ఫ్యాక్టరీని నిర్మించాలని ఫాక్స్‌కాన్‌ యోచిస్తోందని, ఈ విషయం గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు తమకు చెప్పినట్లు రాయిటర్స్‌ రిపోర్ట్‌ చేసింది.

ప్రపంచంలోని అతి పెద్ద కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్. ప్రపంచంలో తయారయ్యే మొత్తం ఐఫోన్లలో 70% ఈ కంపెనీలోనే అసెంబుల్‌ అవుతున్నాయి. ఈ కంపెనీ మొదటిసారిగా ఎయిర్‌పాడ్ కాంట్రాక్ట్‌ గెలుచుకుంది. చైనా+ వ్యూహంలో భాగంగా ఉత్పత్తి ప్రదేశాలను పెంచుకోవాలనుకుంటున్న ఆపిల్‌ ప్లాన్‌లో ఇదొక భాగం. ప్రస్తుతం, ఆపిల్‌ ఎయిర్‌పాడ్లను వివిధ చైనీస్ సంస్థలే సరఫరా చేస్తున్నాయి.

తెలంగాణలో ఫ్లాంటు ఏర్పాటు చేస్తామన్న ఫాక్స్‌కాన్‌        
భారత్‌లో తమ కార్యకలాపాలను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని ఇటీవలే ప్రకటించిన ఫాక్స్‌కాన్‌, తెలంగాణలో ఒక భారీ స్థాయి ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని కూడా వెల్లడించింది. ఇప్పుడు, ఆపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ ఉత్పత్తి ప్లాంటును తెలంగాణలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ ఫ్లాంట్‌ నిర్మాణం కోసం 200 మిలియన్‌ డాలర్లకు పైగా పెట్టుబడి పెడుతుందని సమాచారం. 

అయితే, ఆపిల్‌ ఎయిర్‌పాడ్ల ఆర్డర్ విలువ ఎంతో స్పష్టంగా తెలియడం లేదు. ఎయిర్‌పాడ్‌ల అసెంబ్లింగ్‌ వల్ల లాభాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి, ఆపిల్‌ ఎయిర్‌పాడ్లను ఉత్పత్తి చేయాలా, వద్దా అన్న విషయం మీద ఫాక్స్‌కాన్‌లో నెలల తరబడి చర్చలు జరిగాయి. చివరకు, ఆపిల్‌తో సంబంధాన్ని బలపరుచుకోవడం కోసం ఎయిర్‌పాడ్‌ కాంట్రాక్ట్‌ తీసుకున్నట్లు సదరు వ్యక్తులు వెల్లడించారు. 

ఆపిల్‌ అభ్యర్థన      
ముఖ్యమైన విషయం ఏంటంటే… ఎయిర్‌పాడ్ల ఉత్పత్తిని భారత్‌లోనే చేపట్టమని ఆపిల్‌ స్వయంగా అభ్యర్థించినట్లు సమాచారం.  

ఫాక్స్‌కాన్ అనుబంధ సంస్థ అయిన ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ లిమిటెడ్, ఈ ఏడాది ద్వితీయార్థంలో తెలంగాణలో తయారీ కేంద్ర నిర్మాణాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్లు, 2024 చివరి నాటికి ఉత్పత్తిని ప్రారంభించాలని యోచిస్తోందని సదరు వ్యక్తి చెప్పారు.

ఈ వార్తపై ఫాక్స్‌కాన్, ఆపిల్‌ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

ప్రపంచ డిమాండ్‌కు తగ్గట్లు ఆపిల్‌ ఉత్పత్తుల తయారీని పెంచడానికి, ఉత్పత్తి కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి చైనాయేతర దేశాల్లో పెట్టుబడులను పెంచుతామని ఫాక్స్‌కాన్ బుధవారం వెల్లడించింది.

తెలంగాణలో తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తామని, ఇటీవల తెలంగాణలో పర్యటించిన ఫాక్స్‌కాన్ ఛైర్మన్ యాంగ్ లియూ కూడా ప్రకటించారు. ముఖ్యమంత్రి KCRకు కూడా లేఖ రాశారు. ఈ నెల రెండో తేదీన సమావేశంలో వెల్లడించినట్లుగా.. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఉత్పత్తి ఫ్లాంటు ఏర్పాటుకు ఫాక్స్‌కాన్ కట్టుబడి ఉందని లేఖలో పేర్కొన్నారు. కొంగరకలాన్‌లో ఉత్పత్తి కార్యకలాపాలు త్వరగా ప్రారంభమయ్యేలా తమ బృందానికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం కావాలని యాంగ్ లియూ అభ్యర్థించారు.

ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీ అయిన Apple ఉత్పత్తులను ఫాక్స్‌కాన్‌తో పాటు విస్ట్రాన్‌ కార్ప్‌ (Wistron Corp), పెగట్రాన్‌ కార్ప్‌ (Pegatron Corp) వంటి తైవానీస్ కంపెనీలు కూడా తయారు చేస్తున్నాయి.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *