PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

రోజుకు దాదాపు 38 కోట్ల డిజిటల్ పేమెంట్స్‌, వాటిలో UPI వాటా 78%


Digital Transactions: ప్రస్తుతం, డిజిటల్ లావాదేవీల విషయంలో భారతదేశం ప్రపంచంలోనే ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంది. డిజిటల్ చెల్లింపుల్లో అభివృద్ధి చెందిన దేశాలను సైతం భారత్ ఏ విధంగా వెనక్కు నెట్టిందన్నది ఇప్పుడు ఒక కేస్‌ స్టడీగా మారింది. భారత్‌ అనుభవాల ఆధారంగా చాలా దేశాలు డిజిటల్‌ పేమెంట్స్‌ సిస్టమ్స్‌లో మార్పులు తీసుకొస్తున్నాయి. ప్రపంచానికే “డిజిటల్‌ పేమెంట్స్‌ గురు”గా మారిన భారత్‌లో, రోజుకు ఎన్ని డిజిటల్‌ ట్రాన్జాక్షన్స్‌ జరుగుతున్నాయో మీకు తెలుసా?

రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ (RBI Governor Shaktikanta Das), భారత్‌లో డిజిటల్ చెల్లింపుల వృద్ధికి సంబంధించిన లెక్కలు ప్రకటించారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌, రూ. 2000 నోటు రద్దు నిర్ణయం నుంచి ద్రవ్యోల్బణం, రెపో రేటు, డిజిటల్ లావాదేవీల వరకు చాలా అంశాలపై మాట్లాడారు. 

డిజిటల్ చెల్లింపుల్లో UPIదే సింహభాగం
2016లో, దేశవ్యాప్తంగా ప్రతి రోజూ సగటున 2.28 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరగగా, ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 38 కోట్లకు పెరిగిందని ఆర్‌బీఐ గవర్నర్‌ చెప్పారు. తాజా లెక్కల ప్రకారం, దేశంలో ప్రతిరోజూ సగటున 37.75 కోట్ల డిజిటల్ పేమెంట్స్‌ జరుగుతున్నాయి. వీటిలో సింహభాగం UPI ఆధారిత చెల్లింపులదే. కేవలం UPI లావాదేవీల ద్వారానే ప్రతిరోజూ దాదాపు 29.5 కోట్ల డిజిటల్ పేమెంట్స్‌ పూర్తవుతున్నాయి.

డిజిటల్ చెల్లింపుల వృద్ధిలో 4 మూల స్తంభాలు
భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు పెరగడానికి ప్రధానంగా 4 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం పెద్ద నోట్ల రద్దు (Demonetization). 2016 నవంబర్‌లో, దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దును ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని నెలల పాటు మార్కెట్‌లో నగదు కొరత ఏర్పడింది. దీంతో చిన్న దుకాణదార్లు సైతం డిజిటల్‌ పేమెంట్స్‌ స్వీకరించడం ప్రారంభించారు. రెండో కారణం UPI. డిజిటల్‌ పేమెంట్స్‌ ట్రెండ్‌కు యూపీఐ విపరీతమైన వేగాన్ని అందించింది. UPI వల్ల, ఒక బ్యాంక్‌ ఖాతా నుంచి మరొక బ్యాంక్‌ ఖాతాకు డబ్బు పంపడం చిటికె వేసినంత సులభంగా మారింది. మూడో కారణం ఇంటర్నెట్‌ వ్యాప్తి. 4G రూపంలో మారుమూల ప్రాంతాలకు కూడా అందిన చౌకైన, వేగవంతమైన ఇంటర్నెట్‌ డిజిటల్‌ ట్రాన్జాక్షన్స్‌కు ఆజ్యం పోసింది. నాలుగో కారణం కొవిడ్‌-19. కరోనా మహమ్మారి కూడా డిజిటల్‌ పేమెంట్స్‌ విప్లవానికి పిల్లర్‌గా మారింది. అంటువ్యాధి దేశవ్యాప్తంగా వ్యాపించిన సమయంలో, ప్రజలు ఫిజికల్‌ కరెన్సీని వదిలి పెట్టి డిజిటల్ లావాదేవీల వైపు దౌడు తీశారు.

గుర్తుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు జ్ఞాపకాలు 
2016 నాటి డీమోనిటైజేషన్ జ్ఞాపకాలు రూ.2 వేల నోట్ల ఉపసంహరణ రూపంలో ప్రజలకు మళ్లీ గుర్తుకొచ్చిన తరుణంలో, డిజిటల్ చెల్లింపుల డేటాను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ప్రకటించారు. 2000 రూపాయల నోటును ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గత వారం ప్రకటించింది. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, మార్కెట్‌లో హఠాత్తుగా ఏర్పడిన నగదు కొరతను తగ్గించడానికి ఈ పింక్‌ నోట్లు విడుదలయ్యాయి. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో ప్రజలకు మళ్లీ నోట్ల రద్దు సమస్యలు గుర్తుకు వచ్చాయి. అయితే, ఈసారి పరిస్థితి గతం కంటే చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే, ఇప్పుడు మార్కెట్లో డిజిటల్ మీడియం అందుబాటులో ఉంది. కాబట్టి సాధారణ లావాదేవీలపై పెద్దగా ప్రభావం పడలేదు.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *