News
oi-Chandrasekhar Rao
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవ్వాళ నష్టాలతో ముగిశాయి. ప్రధాన సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లు నష్టాల బారిన పడ్డాయి. లోయర్ సర్క్యుట్‌లో ట్రేడ్ అయ్యాయి. కిందటి రోజుతో పోల్చుకుని చూస్తే నష్టాల శాతం తగ్గిందే తప్ప పూర్తిగా మాయం కాలేదు. కాస్తంత ఊరట కల్పించిందంతే. ఈ ఉదయం నష్టాలతో ప్రారంభమైన ట్రేడింగ్.. లాభాల్లోకి వెళ్లి మరీ.. దిగజారింది.
ఈ ఉదయం నష్టాలతోనే ప్రారంభమైంది స్టాక్ మార్కెట్. కిందటి రోజు సెన్సెక్స్ 52,846.70 పాయింట్ల వద్ద మార్కెట్స్ ముగిశాయి. ఈ ఉదయం 52,767.75 పాయింట్లతో ట్రేడింగ్ ఆరంభమైంది. కొద్దిసేపటికే పైపైకి ఎగబాకింది సెన్సెక్స్ గ్రాఫ్. 53,000 మార్క్‌ను కూడా దాటుకుంది. గరిష్ఠంగా 53,071.59 పాయింట్లను అందుకుంది.
అది కొద్దిసేపు మాత్రమే. ఆ తరువాత మళ్లీ నేలచూపులు చేసింది. మధ్యాహ్నం 2:20 గంటల సమయంలో కనిష్ఠానికి పతనమైంది. 52,518.70 పాయింట్లకు దిగజారింది. మరింత దిగజారుతుందని భావించినప్పటికీ.. అలా జరగలేదు. మళ్లీ పైకెగిసింది. 52,693.57 పాయింట్ల వద్ద సెన్సెక్సె ట్రేడింగ్ ముగిసింది.

నిఫ్టీ 50దీ అదే తీరు. నష్టాలతోనే ఆరంభమైంది.. లాభాల్లోకి వెళ్లింది.. మళ్లీ క్షీణించింది. కిందటి రోజుతో పోల్చుకుంటే 100 పాయింట్ల నష్టంతో ఈ ఉదయం నిఫ్టీ ట్రేడింగ్ మొదలైంది. ఆ తరువాత ఇంట్రాడే హయ్యెస్ట్‌గా 15,853.55 పాయింట్ల వరకూ వెళ్లింది. మళ్లీ పతనమైంది. 42.30 పాయింట్ల నష్టంతో 15,73.10 పాయింట్ల వద్ద నిఫ్టీ ట్రేడింగ్ ముగించుకుంది.
సెన్సెక్స్, 52,518 పాయింట్ల వద్ద ట్రేడింగ్ కావడం 11 నెలల తరువాత ఇదే తొలిసారి. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఈ స్థాయిలో పతనం కాలేదు. సోమవారం భారీ నష్టాలతో వణికిపోయిన మార్కెట్స్ ఈ ప్రకంపనల నుంచి తేరుకోలేదు గానీ.. ఇంట్రాడేలో కొంతమేర అప్పర్ సర్క్యుట్‌లో ట్రేడింగ్ కావడం ఇన్వెస్టర్లకు కొంత ఊపిరి పోసినట్టయింది.
అత్యధికంగా బజాజ్ ఆటో షేర్లు నష్టపోయాయి. షేర్ల బైబ్యాక్ ప్రకటించిన తరువాత ఈ స్థాయిలో నష్టపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మెటల్ షేర్లదీ అదే తీరు. అదాని ఎంటర్ప్రైజెస్ ఆరు శాతం మేర లాభపడింది. దీనికి కారణం.. టోటల్ ఎనర్జీస్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడమే. ఒక్కో షేర్ మీద 117 రూపాయల లాభాన్ని పంచింది అదాని ఎంటర్ప్రైజెస్.
వరుసగా 10 రోజులుగా పతనం బాట పట్టిన ఎల్ఐసీ షేర్లు ఇవ్వాళ కొంతమేర పైకి ఎగబాకాయి. ఒక్కశాతం మేర లాభపడ్డాయి. నిఫ్టీలో భారతి ఎయిర్టెల్, ఎన్టీపీసీ, దివీస్ ల్యాబొరేటరీస్, మహీంద్ర అండ్ మహీంద్ర, సిప్లా.. టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, టెక్ మహీంద్ర, హెచ్డీఎఫ్సీ లైఫ్, హీరో మోటోకార్ప్.. నిఫ్టీలో టాప్ లూజర్స్.
English summary
Stock Market on June 14, 2022: Sensex falls nearly 153 points, Nifty also down slightly
Stock Market on June 14, 2022: Sensex falls nearly 153 points, Nifty also down slightly as 30 points.
Story first published: Tuesday, June 14, 2022, 16:38 [IST]