|
900 విమానాలు ఆలస్యంగా..
ఇటీవల ఇండిగో ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు దేశవ్యాప్తంగా ప్రభావితమయ్యాయి. సిబ్బంది కొరత కారణంగా 900 విమానాలు ఆలస్యంగా ప్రయాణించాల్సి వచ్చింది. సిబ్బంది అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమని చెబుతున్నారు. కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. శనివారం కేవలం 45 శాతం ఇండిగో విమానాలు మాత్రమే సమయానికి నడపబడ్డాయి. పెద్ద సంఖ్యలో సిబ్బంది సిక్ లీవ్ తీసుకొని ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్‌కు బయలుదేరారని పీటీఐ వార్త సంస్థ తన కథనంలో తెలిపింది. పరిశ్రమకు చెందిన ఒక అధికారి వార్తా సంస్థతో మాట్లాడుతూ.. “ఎయిర్ ఇండియా రెండవ దశ రిక్రూట్మెంట్ డ్రైవ్ శనివారం జరిగింది. చాలా మంది ఇండిగో క్యాబిన్ సిబ్బంది సిక్ లీవ్ తీసుకుని దాని కోసం వెళ్లారు” అని తెలిపారు. విమాన సేవలు ఆలస్యంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.
ఏఏ విమానాలు ఆలస్యం అయ్యాయంటే..
ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్, విస్తారా, గోఫస్ట్, ఎయిర్ఏషియా ఇండియా వరుసగా 77.1%, 80.4%, 86.3%, 88%, 92.3% విమానాలను సమయానికి నడిపాయి. గత ఏడాది అక్టోబర్ 8న ఎయిర్‌లైన్ బిడ్‌ను విజయవంతంగా గెలుచుకున్న టాటా గ్రూప్ జనవరి 27న ఎయిర్ ఇండియా నియంత్రణను చేపట్టింది. కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసి సేవలను మెరుగుపరచాలని యోచిస్తున్న ఎయిర్ ఇండియా రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించింది.
వివరణ కోరిన DGCA:
భారీగా విమానాల ప్రయాణాల్లో జాప్యంపై ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగోను వివరణ కోరింది.DGCA అధికారి మాట్లాడుతూ.. “డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగోపై, దేశవ్యాప్తంగా విమానయాన సంస్థ విమానాలను ఆలస్యంపై వివరణ కోరడం జరిగింది” అని తెలిపారు.