National
oi-Rajashekhar Garrepally
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా-బీజాపూర్ సరిహద్దుల్లో శనివారం మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో సెర్చ్ ఆపరేషన్ కోసం వెళ్లిన 22 మంది జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా ఉన్నట్లు ఇంటెలీజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
సెర్చ్ ఆపరేషన్ కోసం వెళ్లిన జవాన్లపై ఒక్కసారిగా వందలాది మంది మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. అప్పటికే మావోయిస్టులు భద్రతా దళాల రాకకోసం వేచిచూస్తున్నట్లు సమాచారం. జవాన్లు అక్కడికి చేరుకోగానే.. ఒక్కసారిగా వందలాది మంది మావోయిస్టులు ఆధునాతన తుపాకులతో కాల్పులకు తెగబడ్డారు. బాంబులు వేశారు. సుమారు మూడు గంటలపాటు మావోయిస్టులు, జవాన్లకు మధ్య కాల్పులు జరిగాయి. మావోయిస్టుల కాల్పుల్లో 22 మంది జవాన్లు మృతి చెందగా, 31 మంది తీవ్రగాయాలపాలయ్యారు.

సూత్రధారి హిడ్మా అలియాస్ హిడ్మన్నా గురించి
జవాన్లపై కాల్పులకు కుట్ర పన్నిన మావోయిస్టు నేత 40ఏళ్ల హిడ్మా సుకుమా జిల్లాలోని పుర్వర్తి గ్రామానికి చెందిన ఓ ట్రైబల్. 1990లలో ఇతడు నక్సల్స్‌లో కలిశాడు. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్ఏజీ) బెటాలియన్ నెంబర్ 1కు హెడ్మా అధిపతిగా ఉన్నారు. ఇతని ఆధ్వర్యంలో గతంలో కూడా అనేక తీవ్రమైన బాంబు దాడులు జరిగాయి. 180-250 మంది మావోయిస్టు ఫైటర్లకు ఇతడు నాయకత్వం వహిస్తున్నాడు. ఇతని టీంలో మహిళలు కూడా ఉన్నారు. మావోయిస్టుల దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్‌జడ్)లో ఇతడు సభ్యుడిగా ఉన్నాడు.
21 మంది సభ్యులు గల సీపీఐ మావోయిస్టు సుప్రీం సెంట్రల్ కమిటీలో హిడ్మానె యువ సభ్యుడు కావడం గమనార్హం. సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు ఇతడు చీఫ్ గా నియమిలైనట్లు సమాచారం. హిడ్మాకు సంబంధించి ఇటీవల కాలంలోని ఎలాంటి ఫొటోలు బయటికి రాలేదు. అతని పేరుపై రూ. 40 లక్షల రివార్డు ఉంది.
భీమ్ మండవి హత్య కేసులో హిడ్మాకు వ్యతిరేకంగా ఎన్ఐఏ అభియోగాలు నమోదు చేసింది. పమేద్, కొంటా, జగర్గుండా, బసగూడకు చెందిన ప్లాటూన్లు తాజా దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.
ప్రతి సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు, మావోయిస్టులు తమ వ్యూహాత్మక ఎదురుదాడి ప్రచారాన్ని (టిసిఒసి) ప్రారంభిస్తారు, ఇక్కడ నక్సల్స్.. భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఘోరమైన ఆకస్మిక దాడి చేస్తుంది. గతంలో కూడా ఇలాంటి దాడులు ఈ మావోయిస్టుల ప్లాటూన్లు దాడులకు పాల్పడ్డాయి.
సుకుమాలో గత మార్చిలో అంబూష్ పేల్చి 17 మందిని పొట్టనపెట్టుకున్నారు మావోయిస్టులు. ఏప్రిల్ 2019లో బీజేపీ ఎమ్మెల్యే భీమా మండవిని, అతని డ్రైవర్ ను, మరో ముగ్గురు భద్రతా సిబ్బందిపై దాడి చేసి చంపేశారు. ఏప్రిల్ 2010లో సుకుమా జిల్లాలోని తడ్మెట్లలో జరిపిన మావోయిస్టుల దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. కాగా, తాజా దాడికి మావోయిస్టులు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జవాన్ల త్యాగాలను వృథా కానివ్వమని అన్నారు.