ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు గృహ ప్రవేశం చేస్తున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా ఆయన కొత్త ఇంట్లోకి అడుగు పెట్టనున్నారు. అదే.. ఆయన సొంత నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో గత 2023లో ప్రారంభించిన సొంతిల్లు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు, మంత్రులు కూడా చంద్రబాబును ఎద్దేవా చేశారు. 35 ఏళ్లుగా నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్నా.. చంద్రబాబుకు ఇక్కడ సొంతిల్లు అంటూ లేదని అప్పట్లో మంత్రులు రోజా, పెద్దిరెడ్డి రామచం ద్రారెడ్డి వంటివారు విమర్శించారు.
ఈ క్రమంలోనే 2023లో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు.. కుప్పంలో స్థలం కొనుగోలు చేసి.. వైసీపీ హయాంలోనే భూమి పూజ నిర్వహించారు. ఆతర్వాత వడివడిగా పనులు ముందుకుసాగాయి. చిత్రంఏంటంటే.. ఈ ఇంటికి వైసీపీ హయాంలోనే అనుమతులు రావడం. ఇక, ఆ తర్వాత నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిరంతరం ఈ ఇంటి నిర్మాణాన్ని పర్యవేక్షించారు. అధునాతన వసతులు.. పెద్ద ఎత్తున కారు పార్కింగ్, గెస్టులు వస్తే.. ఉండేందుకు వసతులతో కూడిన ఈ ఇంటి నిర్మాణం గత నెలలోనే పూర్తయింది.

తాజాగా ఈ ఇంట అడుగు పెట్టేందుకు సీఎం చంద్రబాబు కుటుంబ పురోహితులు ముహూర్తం ఖరారు చేశారు. ఈ నెల 25న కుప్పంలోని నూతన ఇంట్లో గృహ ప్రవేశ కార్యక్రమాన్నిపెట్టుకున్నారు. నారా , నందమూరి కుటుంబాలతో పాటు నియోజకవర్గం లోని లక్ష మందికి కూడా ప్రత్యేకంగా ఆహ్వానాలు అందించారు. గృహ ప్రవేశం రోజు మండలాల వారీగా భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. కుప్పంలోనిఅన్ని మండలాల్లోనూ.. పార్టీ కార్యాలయాల వద్ద.. పేదలకు భోజనాలు పెట్టనున్నారు.
ఇక, సొంత ఇంటి వద్ద.. సుమారు 10 వేల మందికి పైగా భోజనాలు వడ్డించనున్నారు. కప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ శివపురం గ్రామం వద్ద ఉన్న భూమిలోనే చంద్రబాబు ఫ్యామిలీ ఇంటిని నిర్మించుకుంది. కాగా..ఈ గృహ ప్రవేశ ఘట్టం పూర్తిగా ప్రైవేటు కార్యక్రమమని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇదిలావుంటే.. ఇటీవల అమరావతిలోనూ చంద్రబాబు సొంత ఇంటికి శంకు స్తాపన చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ కూడా భారీ ఎత్తున సదుపాయాలతో సొంత ఇంటిని నిర్మించనున్నారు.