అదానీ వ్యూహం..
5జీ స్పెక్ట్రమ్ వేలంలో అదానీ గ్రూప్ పాల్గొన్న విషయం మనందరికీ తెలిసిందే. అప్పట్లో ఆయన కూడా టెలికాం రంగంలోకి అడుగు పెట్టడానికి ఈ చర్యకు పాల్పడ్డారని అందరూ భావించారు. అయితే.. వీటికి చెక్ పెడుతూ తమ కంపెనీల అవసరాల కోసమే కొనుగోలు చేస్తున్నట్లు అదానీ గ్రూప్ వివరణ ఇచ్చింది. అయితే కంపెనీ మాత్రం దేశంలో టెలికాం వ్యాపారాన్ని ప్రారంభించటానికి వీలైన లైసెన్సును కేంద్రం నుంచి పొందింది.

టెల్కోలకు ఆశ్చర్యం..
అయితే కొత్త సంవత్సరంలో.. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఎంటర్‌ప్రైజ్, వినియోగదారుల మొబైల్ 5G సేవలు, వినియోగదారు యాప్‌లను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ నిర్ణయం టెలికాం పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇది పూర్తి స్థాయి అమలు, విస్తరణ జరగితే టెలికాం రంగంలో మరింత వేడిని, పోటీని పెంచుతుంది. పైగా ఈ రంగంలో దాదాపుగా ఏకచత్రాధిపత్యం వహిస్తున్న అంబానీ రిలయన్స్ జియో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అదానీ తాజా ప్రకటన..
ఉద్యోగులతో నూతన సంవత్సర ప్రసంగం సందర్భంగా.. అదానీ తన ఎంటర్‌ప్రైజ్ 5G సేవలు, B2C యాప్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మిలియన్ల మంది కస్టమర్లను డిజిటల్‌గా ఆన్‌బోర్డ్ చేయడానికి గ్రూప్ పని చేస్తుందని అదానీ ఉద్యోగులకు తెలిపారు. అయితే ఇది రానున్న కాలంలో కన్స్యూమర్ మొబిలిటీ స్పేస్‌లోకి ప్రవేశించేందుకు తొలి అడుగు అని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా..
గత సంవత్సరం 5G స్పెక్ట్రమ్ వేలం సమయంలో అదానీ, రిలయన్స్ జియో తరఫున సహచర బిలియనీర్ ముఖేష్ అంబానీ ముఖాముఖీ తలపడ్డారు. అయితే ప్రస్తుతం మారుతున్న పరిస్థితులపై అంతర్జాతీయ రేటింగ్ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ స్పందించింది. అదానీ టెలికాం రంగంలోకి రారనే వాదనలపై సందేహాన్ని వ్యక్తం చేశారు. వినియోగదారు మొబైల్ సేవల్లోకి అదానీ ప్రవేశానికి ఇది తలుపులు తెరుస్తుందని అనలిటిక్స్ మ్యాగజైన్ వెల్లడించింది.

అదానీకి లాభమేనా..?
కేవలం 5G సేవలతో కొత్త నెట్‌వర్క్‌ను ప్రారంభించడం అదానీకి లాభదాయకంగా ఉండదని ప్రముఖ వార్తా సంస్థ అభిప్రాయపడింది. ప్రస్తుతం 5జీ సాంకేతిక టెలికాం సేవలను ప్రజలకు చేరువ చేయటంలో అంబానీ జియో తలమునకలై ఉంది. పైగా అధిక విలువైన 5జీ సేవలను అందించటానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నా.. అందుకు అవసరమైన కస్టమర్లకు పొందటంలో జియోతో సహా అన్ని టెలికాం కంపెనీలు కష్టపడుతున్నాయి.

విస్తరణ ప్రణాళిక..
ప్రస్తుతం అదానీ గ్రూప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్ సాంకేతికతలపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. దీనికి తోడు ఇండస్ట్రియల్ క్లౌడ్ సామర్థ్యాలను నిర్మించడానికి.. డేటా సెంటర్లను విస్తరించాలని ప్రణాళికలు వేసింది. దేశంలో తన వ్యాపార ఫుట్ ప్రింట్ ను పెంచుకోవాలని అదానీ గ్రూప్ ప్రయత్నిస్తోంది.