ఈ సూచీల్లో కూర్పులు
ఈ ఏడాది మార్చి 31 నుంచి కొన్ని సూచీల్లో అదానీ విల్మార్, అదానీ పవర్‌లను చేర్చనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన సూచీలను సర్దుబాటు చేయనున్నట్లు తెలిపింది. నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ 100 ఇండెక్స్ లలో అదానీ విల్మార్ భాగం కానుండగా.. నిఫ్టీ 500, నిఫ్టీ 200, నిఫ్టీ మిడ్ క్యాప్ 100, నిఫ్టీ మిడ్ క్యాప్ 150, నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250లో అదానీ పవర్ ను చేర్చనున్నట్లు పేర్కొంది.

నిఫ్టీ 50లో మాత్రం..
NSE ఇండెక్స్ లిమిటెడ్ కి చెందిన ఇండెక్స్ మెయింటెనెన్స్ సబ్-కమిటీ తన రెగ్యులర్ సమీక్షలో భాగంగా వివిధ సూచీల్లోని స్టాక్ లను అప్ డేట్ చేయడానికి నిర్ణయించింది. నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ లో అదానీ విల్‌మార్ తో పాటు ABB ఇండియా, కెనరా బ్యాంక్, పేజ్ ఇండస్ట్రీస్, వరుణ్ బెవరేజెస్ కొత్తగా చేర్చబడుతున్నాయి. బంధన్ బ్యాంక్, బయోకాన్, గ్లాండ్ ఫార్మా, ఎంఫాసిస్, పేటీఎం లను తొలగించనున్నారు. అయితే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 50 ఇండెక్స్ లో ఈసారి ఎలాంటి మార్పు చేయలేదు.

మే నెలకు వాయిదా
రెండు అదానీ గ్రూపు సంస్థలు అదానీ టోటల్ గ్యాస్, అదానీ ట్రాన్స్ మిషన్ల వెయిటేజీల తగ్గింపును.. ఇండెక్స్ ప్రొవైడర్ MSCI గత వారం వాయిదా వేసింది. ధరల పరిమితి మెకానిజమ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా ఫిబ్రవరిలో అమలు కావాల్సిన ఈ చర్యలు మే నెలకు వాయిదా పడ్డాయి.