కొత్త రుణాల కోసం..
కంపెనీల మార్కెట్ క్యాప్ భారీగా క్షీణించిన తరుణంలో అదానీ గ్రూప్ ఇప్పుడు విదేశాల నుంచి రుణాలు పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా అదానీ గ్రూప్ 400 మిలియన్ డాలర్లు (రూ.33.15 బిలియన్లు) సేకరించేందుకు గ్లోబల్ క్రెడిట్ ఫండ్స్‌తో చర్చలు ప్రారంభించింది. అదానీ గ్రూప్ ఒక ప్రధాన బొగ్గు పోర్టు ఆస్తులపై ఈ రుణాన్ని పొందాలనుకుంటోంది. ఆస్ట్రేలియన్ వివాదాస్పద కార్మైకేల్ గని నుంచి ఘన శిలాజ ఇంధనాల ఎగుమతుల్లో ఈ నౌకాశ్రయం అధిక వాటాను కలిగి ఉంది.

అదానీ ట్రస్ట్..
అదానీ ఫ్యామిలీ ట్రస్ట్ నియంత్రణలో ఉన్న నార్త్ క్వీన్స్‌ల్యాండ్ ఎక్స్‌పోర్ట్ టెర్మినల్ (NQXT) ఇప్పుడు అదానీ గ్రూప్ కోసం నిధులను సమీకరించడంలో సహాయపడుతోంది. గత నెలలో హిండెన్ బెర్గ్ నివేదిక వచ్చినప్పటి నుంచి అదానీ గ్రూప్ మెుత్తంగా 150 బిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసింది. అదానీ కంపెనీల విలువ ఉండాల్సిన దాని కంటే దాదాపు 85 శాతం ఎక్కువగా ఉందని నివేదికలో పేర్కొంది. దీనితో పాటు గ్రూప్ షేర్లలో తారుమారు జరిగినట్లు ఆరోపణలు కూడా అందులో ఉన్నాయి. NQXT గత ఏడాది డిసెంబర్‌లో మెచ్యూర్ అయిన 500 మిలియన్ డాలర్ల రుణ చెల్లింపులను కలిగి ఉందని కార్పొరేట్ ఫైలింగ్స్ ప్రకారం తెలుసుతోంది.

నిధుల కోసం వేట..
ఆస్ట్రేలియన్ పోర్ట్ ఆస్తుల్లో అదానీ గ్రూప్ ప్రమోటర్లు 100 శాతం వాటాను కలిగి ఉన్నారని ఇటీవల వెల్లడైంది. తాజాగా గ్లోబల్ క్రెడిట్ ఫండ్స్‌తో రుణాల కోసం గ్రూప్ చర్చలు ప్రారంభించిందని వర్గాలు తెలిపాయి. అలాగే గ్రూప్ ఇప్పటివరకు సంభావ్య రుణదాతల నుంచి రెండు సూచిక టర్మ్ షీట్‌లను పొందింది. గ్రూప్ NQXT నగదు ప్రవాహాలపై నిధులను సేకరించాలని చూస్తోందని వెల్లడైంది. ఇతర చెల్లింపుల కోసం అవసరమయ్యే నిధులను సమకూర్చుకునేందుకు అదానీ గ్రూప్ ఈ పనిచేస్తోందని తెలుస్తోంది. హెడ్జ్ ఫండ్ ఫరాలోన్ క్యాపిటల్ కూడా రుణదాతల్లో ఒకటిగా ఉందని సమాచారం.