సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్ఎల్వీ-సీ57 రాకెట్ ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇందుకు సంబంధించిన 24 గంటల కౌంట్‌డౌన్ శుక్రవారం ఉదయం 11.50 గంటలకు మొదలుకానుంది. భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలోని సూర్యుడి హాలో కక్ష్యలో ఈ ఉపగ్రహాన్ని చేర్చనున్నారు. గ్రహణాల వంటి అడ్డంకులతో సంబంధం లేకుండా సూర్యుడ్ని నిరంతరం అధ్యయనం చేసేందుకు లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్ 1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి పంపనున్నారు.
ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహం మొత్తం ఏడు పేలోడ్లను సూర్యుడి కక్ష్యలోకి మోసుకెళ్లనుంది. ‘విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ (వీఈఎల్‌సీ)తో పాటు సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్‌లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్, మ్యాగ్నెటోమీటర్ పేలోడ్‌లు’ ఇందులో అమర్చారు.
సూర్యుడి నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైన కిరణాల ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఈ పేలోడ్‌లను రూపొందించారు. ఈ పేలోడ్లు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని ఫొటోస్పియర్, క్రోమోస్పియర్‌లను అధ్యయనం చేయనున్నాయి. లాంగ్రాజ్ పాయింట్ 1 ప్రదేశానికి ఉన్న సానుకూల పరిస్థితుల దృష్ట్యా ఈ నాలుగు పరికరాలు సూర్యుడ్ని స్వయంగా పరిశీలించనున్నాయి. మిగతా మూడు సాధనాలు.. దాని సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల జాడను పసిగట్టనున్నాయి.
‘ఆదిత్య-L1 పేలోడ్‌లు సూట్ కరోనల్ హీటింగ్, కరోనల్ మాస్ ఎజెక్షన్, ప్రీ-ఫ్లేర్, ఫ్లేర్ యాక్టివిటీస్, వాటి లక్షణాలు, అంతరిక్ష వాతావరణం డైనమిక్స్, రేణువుల ప్రసారం, అంతర్ గ్రహల క్షేత్రాల వ్యాప్తి వంటి క్లిష్టమైన అంశాలను అవగాహన చేసుకోవడానికి అత్యంత కీలకమైన సమాచారాన్ని అందిస్తుందని భావిస్తున్నాం’ అని ఇస్రో ఇటీవల పేర్కొంది. మొదటిసారిగా సూర్యుడి గురించి అధ్యయనానికి ఇస్రో ఈ ప్రతిష్టాత్మక ప్రయోగం చేపట్టింది.
Read More Latest Science & Technology News And Telugu News