సీఎం ముందుచూపు..
రాష్ట్రాన్ని ముందుకు నడిపే తరుణంలో జగన్మోహన్ రెడ్డి ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పోర్టులు, విమానాశ్రయాలు, రోడ్లు, రవాణా అండ్ లాజిస్టిక్స్, విద్యుత్ వంటి కీలక మౌలిక సదుపాయాలను అభివృద్ది చేస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పరిశ్రమల అవసరాల కోసం ముందస్తుగా 48,352 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నట్లు తాజాగా వెల్లడైంది.

బెంగళూరులో వెల్లడి..
బెంగళూరులో మంగళవారం జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో ఏపీలో ఉన్న గొప్ప సహజ వనరులు, మౌలిక సదుపాయాలు, ల్యాండ్ బ్యాంక్, పరిశ్రమల ఏర్పాటుకు నిబంధనల సరళీకరణకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ సంస్థలకు చెందిన ముఖ్య కార్యదర్శులు వెల్లడించారు. విశాఖలో మార్చి 3-4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నేపథ్యంలో జరిగిన ఇన్వెస్టర్స్ మీట్ సమావేశాల్లో ఇది కూడా ఒకటిగా తెలుస్తోంది.

మంత్రుల హామీ..
ఆంధ్రప్రదేశ్ ఎగుమతి సామర్థ్యాలను పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఇన్వెస్టర్లకు వివరించారు. గత మూడున్నరేళ్లలో రాష్ట్రం రూ.1.9 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులో ఇవి 90,000 ఉద్యోగాలను సృష్టిస్తాయని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రాజెక్టుల అమలు వేగంగా జరుగుతుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు. తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఓడరేవులు, ఐటీ & ఎలక్ట్రానిక్స్, హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్స్ రంగాల్లో అవకాశాలు ఇన్వెస్టర్లను ఆకర్షించాయి.