ప్రశంసల వర్షం..
భారత్ తన అతిపెద్ద సవాళ్లను అధిగమించగలిగిందని బిల్‌గేట్స్ పేర్కొన్నారు. పోలియోను నిర్మూలించడం, హెచ్‌ఐవీ వ్యాప్తిని తగ్గించడం, శిశు మరణాలను తగ్గించడం, పేదరికాన్ని తగ్గించడం, ఆర్థిక & పారిశుద్ధ్య సౌకర్యాలను మెరుగుపరచడం కోసం గేట్స్ భారతదేశాన్ని ప్రశంసించారు. త్వరలో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనుందని అన్నారు. రోటావైరస్ పై పోరాడేందుకు భారత్ తయారు చేసిన వ్యాక్సిన్‌లు ఇప్పుడు ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉపయోగించబడుతున్నాయని గేట్స్ చెప్పారు.
ఇండియాకు గేట్స్..
ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు చేస్తున్న కృషిని చూడటానికి వచ్చే వారం తాను భారత సందర్శనకు వస్తున్నట్లు గేట్స్ తెలిపారు. మారుమూల వ్యవసాయ కమ్యూనిటీల్లో వ్యర్థాలను జీవ ఇంధనాలు, ఎరువులుగా మార్చడానికి బ్రేక్‌త్రూ ఎనర్జీ ఫెలో విద్యుత్ మోహన్, అతని బృందం చేసిన కృషిని గేట్స్ ఉదహరించారు. బ్రేక్ త్రూ ఎనర్జీ పనిని చూడటానికి తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు.
వాతావరణ మార్పులు..
భూమిపై ఉన్న ఇతర దేశాల మాదిరిగానే భారత్ లో కూడా పరిమిత వనరులు ఉన్నాయని గేట్స్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ప్రపంచం ఎలా పురోగమిస్తుందో భారత్ చూపుతోందని అభినందించారు. అందరం కలిసి పనిచేస్తే వాతారవరణ మార్పులతో పోరాడగలమని గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రపంచ ఆరోగ్యాన్ని మెరుగుపరచగలమని తన నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశాడు.