అనంత విశ్వంలో (Universe) మిలియన్ల కొద్దీ సూపర్ మాసివ్ నక్షత్రాలు (Supermassive Stars) ఉండొచ్చన్న ఖగోళ శాస్త్రవేత్తల అంచనాలకు తొలి ఆధారం లభించింది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) ఈ ఆధారాన్ని సేకరించినట్టు లైవ్ సైన్స్ నివేదించింది. ఇప్పటి వరకు ఖగోళ శాస్త్రవేత్తలు గమనించిన అతిపెద్ద నక్షత్రాల ద్రవ్యరాశి (Mass) మన సూర్యుడి కంటే 300 రెట్లు ఎక్కువ. కానీ తాజాగా, జేమ్స్ వెబ్ గుర్తించిన సూపర్ మాసివ్ నక్షత్రం (Massive Star) 5,000 నుంచి 10,000 సూర్యుల ద్రవ్యరాశిని కలిగి ఉంది. ఈ పెద్ద నక్షత్రాలను ‘ఖగోళ రాక్షసులు’గా (Celestial Monster) శాస్త్రవేత్తలు అభివర్ణిస్తున్నారు. ఈ నక్షత్రాలు బిగ్ బ్యాంగ్ తర్వాత 440 మిలియన్ సంవత్సరాలకు ఉద్భవించినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. ఐరోపా శాస్త్రవేత్తల బృందం తమ పరిశోధన ఫలితాలను మే 5న ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ జర్నల్‌లో ప్రచురించారు.

‘ఈ రోజు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సేకరించిన డేటాకు ధన్యవాదాలు.. మేము ఈ అసాధారణ నక్షత్రాల ఉనికికి సంబంధించిన మొదటి ఆధారం కనుగొన్నామని నమ్ముతున్నాం’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ జెనీవా ఆస్ట్రానమీ విభాగం ప్రొఫెసర్ కొరిన్ చార్బొన్నెల్ అన్నారు. ఈ అసాధారణ నక్షత్రాల ద్రవ్యరాశి సూర్యుడి కంటే 5000 నుంచి 10000 రెట్లు ఎక్కువ ఉంటుందని, ఉపరితల ఉష్ణోగ్రత కూడా ఐదు రెట్లు అధికంగా ఉంటుందని భావిస్తున్నారు.

మరోవైపు, గోళకార సమూహాలుగా పిలిచే వివిధ నక్షత్రాల కూర్పులో ఉన్న భారీ వైవిధ్యాన్ని చూసి దశాబ్దాలుగా ఖగోళ శాస్త్రవేత్తలు కలవరపడుతున్నారు. ఈ సమూహాలు దాదాపు ప్రతి గెలాక్సీలో కనిపిస్తాయి. మన పాలపుంతలోనూ ఇటువంటివి కనీసం 180కిపైగా సమూహాలు ఉన్నాయి. ఈ సమూహాలలో కొన్ని విశ్వంలో అతిపెద్ద నక్షత్రాలకు నిలయం. విశ్వం ఆవిర్భవానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోడానికి ఇవి సహాయపడతాయి.

‘గ్లోబులర్ నక్షత్ర సమూహాల వయసు 10 నుంచి 13 బిలియన్ సంవత్సరాల మధ్య ఉంటుంది.. అయితే సూపర్ స్టార్‌ల గరిష్ట జీవితకాలం రెండు మిలియన్ సంవత్సరాలు. అందువల్ల అవి ప్రస్తుతం గమనించే సమూహాల నుంచి చాలా త్వరగా అదృశ్యమయ్యాయి.. వాటి పరోక్ష జాడలు మాత్రమే మిగిలి ఉన్నాయి’ అని బార్సిలోనా విశ్వవిద్యాలయంలో ICREA ప్రొఫెసర్, అధ్యయనం సహ రచయిత మార్క్ గీల్స్ వివరించారు.

అయితే, ఈ సూపర్ మాసివ్ నక్షత్రాలను గుర్తించడం సవాల్‌తో కూడుకున్నది. ఎందుకంటే అవి న్యూక్లియర్ ఫ్యూజన్ కోసం తమ ఇంధనాన్ని త్వరగా మండిస్తాయి.. తద్వారా జీవితకాలం తక్కువగా ఉంటుంది. చెల్లాచెదురుగా ఉన్న పురాతన నక్షత్రాల రసాయన అవశేషాలను గుర్తించడానికి గెలాక్సీ GN-z11పై జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌లోని ఇన్‌ఫ్రారెడ్ కెమెరాకు పరిశోధకులు శిక్షణ ఇచ్చారు. ఇది ఇప్పటివరకు కనుగొన్న అత్యంత సుదూర, పురాతన గెలాక్సీలలో ఒకటి. భూమి నుంచి 13.3 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.

‘ఇది (GN-z11) అధిక నత్రజని నిష్పత్తి, నక్షత్రాల అధిక సాంద్రతను కలిగి ఉన్నట్టు నిర్దారణకు వచ్చాం’అని జెనీవా యూనివర్సిటీ ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్, అధ్యయన బృందం సభ్యుడు డేనియల్ స్కేరర్ చెప్పారు. విశ్వం పుట్టుక రహస్యాన్ని ఛేదించడానికి అమెరికా, ఐరోపా, కెనడా అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోపును 2021 డిసెంబరులో ప్రయోగించిన విషయం తెలిసిందే.

Read More Latest Science & Technology News And Telugu News



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *