చంద్రుడి ఉపరితలంపై రెండు వారాల పాటు పరిశోధనలకు చంద్రయాన్-3 మిషన్‌కు రూపకల్పన చేసిన విషయం తెలిసిందే. జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగి ఇప్పటికే 11 రోజులు పూర్తయ్యింది. మరో రెండు రోజుల్లో అక్కడ రాత్రి సమయం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రోవర్, ల్యాండర్‌ను స్లీప్ మోడ్‌లో ఉంచే ప్రక్రియ ఒకటి రెండు రోజుల్లో ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ శనివారం వెల్లడించారు. మరో రెండు రోజుల్లో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను నిద్రాణ ప్రక్రియ ప్రారంభిస్తామని సోమనాథ్ తెలిపారు.
‘రోవర్, ల్యాండర్‌లను నిద్రాణ స్థితిలోకి పంపే ప్రక్రియ ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రారంభమవుతుంది.. ఎందుకంటే అవి చంద్రుడిపై రాత్రివేళ అతిశీతల వాతావరణాన్ని తట్టుకోవాల్సి ఉంటుంది’ అని ఇస్రో చీఫ్ చెప్పారు. చంద్రయాన్-3 ఇప్పటి వరకూ చంద్రుడి గురించి ఎవరికీ తెలియని సమాచారాన్ని సేకరించింది. చంద్రుడిపై ఆక్సిజన్, సల్ఫర్, మాంగనీస్ వంటి మూలకాలు ఉన్నట్టు రోవర్ ధ్రువీకరించిన విషయం తెలిసిందే.
కాగా, చంద్రయాన్-3కి పోటీగా రష్యా ప్రయోగించిన లూనా-25 చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తూనే సాంకేతిక సమస్యతో కూలిపోయింది. ఆగస్టు 10న రష్యా ప్రయోగించిన ఈ ఉపగ్రహం.. ఐదు రోజుల్లోనే దాదాపు 4 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి కక్ష్యకు చేరింది. ఇస్రో కంటే రెండు రోజుల ముందే దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ కోసం మాస్కో ప్లాన్ చేసింది. దాదాపు యాభై ఏళ్ల తర్వాత రష్యా చేపట్టిన ఈ ప్రయోగం విఫలమైంది. ఉక్రెయిన్ యుద్ధ ఆంక్షలతో సతమతమవుతోన్న రష్యా.. లూనా-25 కోసం భారీగానే ఖర్చు చేసింది. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసి అమెరికా దాని మిత్రదేశాలకు బలమైన సందేశం పంపాలని భావించింది. కానీ, పుతిన్ ఆశలపై లూనా నీళ్లుచల్లింది.
Read More Latest Science & Technology News And Telugu News