చంద్రుడిపై అన్వేషణకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ‘చంద్రయాన్‌-3’ ప్రయోగానికి (Chandrayaan-3 Mission) సంబంధించి ఇస్రో కీలక విషయం వెల్లడించింది. చంద్రయాన్-3 మిషన్ మూడింట రెండు లక్ష్యాలు (Chandrayaan-3 Objectives) పూర్తయ్యాయని శనివారం ట్విట్టర్‌లో (ఎక్స్) తెలిపింది. మొదటిది జాబిల్లి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను (Vikram Lander) సురక్షితంగా దించడం.. రెండోది చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్‌ను (Pragyan Rover) విజయవంతంగా నడిపినట్లు ఇస్రో పేర్కొంది.

మూడో లక్ష్యమైన ‘శాస్త్రీయ పరిశోధనల నిర్వహణ’ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, ల్యాండర్, రోవర్‌లోని అన్ని పేలోడ్‌లు సక్రమంగా పని చేస్తున్నాయని ట్వీట్‌ చేసింది. దీనికి ముందు జాబిల్లి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్‌ తిరుగుతున్న మరో వీడియోను విడుదల చేసింది. విక్రమ్ ల్యాండర్ నుంచి ర్యాంప్ తెరుచుకుని.. అందులో నుంచి ఉపరితలంపైకి రోవర్‌ చేరుకోవడం వీడియో కనిపించింది. సూర్యకాంతికి బూడిదవర్ణంలో మెరిసిపోతున్న చంద్రుడి మట్టిపై విస్పష్టంగా తన చక్రాల ముద్రను నిక్షిప్తం చేసింది. ఈ రోవర్‌ 8 మీటర్లు ప్రయాణించినట్లు ఇస్రో వెల్లడించింది.

అందులోని సైన్స్‌ పరికరాలైన లేజర్‌ ఇండ్యూస్డ్‌ బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కోప్‌ (లిబ్స్‌), ఆల్ఫా పార్టికల్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌ (ఏపీఎక్స్‌ఎస్‌)లను పనిచేయించడం మొదలుపెట్టినట్లు పేర్కొంది. మరోవైపు, చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ దిగిన ప్రదేశానికి.. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ‘శివశక్తి పాయింట్‌’ అని పేరు పెట్టారు. బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో శాస్త్రవేత్తలను కలిసి, అభినందించిన అనంతరం ఈ ప్రకటన చేశారు. అనంతరం ఇస్రో వీడియో విడుదల చేస్తూ.. ‘చంద్రుడి రహస్యాలను అన్వేషించేందుకు ప్రజ్ఞాన్ రోవర్‌.. శివశక్తి పాయింట్‌ వద్ద చక్కర్లు కొడుతోంది’ అని పేర్కొంది.

జాబిల్లి ఉపరితలంపై ప్రయాణానికి వీలుగా ప్రజ్ఞాన్‌కు ఆరు చక్రాలను ఏర్పాటు చేశారు. చిన్నపాటి రాళ్లను అధిగమించడానికి ముందున్న చక్రం ఆ రాయిపైకి వెళుతుంది. మిగతా చక్రాలు రోవర్‌ను స్థిరంగా ఉంచుతాయి. ఈలోగా మొదటి చక్రం.. రాయిని దాటేస్తుంది. దీంతో రోవర్‌ ముందుకు కదులుతుంది. తర్వాత రెండో చక్రం రాయిపైకి చేరుతుంది. ఆరు చక్రాలకు వేర్వేరుగా మోటార్లు ఉండటం వల్ల.. వేటికవే విడిగా పనిచేయగలవు. అవసరాన్ని బట్టి మిగతా చక్రాలతో సంబంధం లేకుండా వాటిని ఎటువైపైనా తిప్పొచ్చు. ఈ వెసులుబాట్ల వల్ల రోవర్‌.. ఉన్న ప్రదేశం నుంచే వెనక్కి తిరగగలదు. సూర్యుడి దిశగా తన సౌరఫలకం ఉండేలా చూసుకోవడానికి ఈ విన్యాసం ఉపయోగపడుతుంది.

Read More Latest Science & Technology News And Telugu NewsSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *