National
oi-Chandrasekhar Rao
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో శనివారం మధ్యాహ్నం సుక్మా జిల్లాల్లో చోటు చేసుకున్న భారీ ఎన్ కౌంటర్ తరువాత పలువురు సీఆర్పీఎఫ్ జవాన్లు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. 15 మంది వరకు సీఆర్పీఎఫ్ జవాన్లు అదృశ్యమైనట్లు అధికారులు నిర్ధారించారు. వారి కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలను చేపట్టినట్లు తెలిపారు. బిజాపూర్, సుక్మా జిల్లాల సరిహద్దుల్లో సుమారు మూడు గంటల పాటు హోరాహోరీగా సాగిన ఎదురు కాల్పుల్లో అయిదు మంది మావోయిస్టులు మరణించారు. మరో అయిదు మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు.
ఈ ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాన్ల సంఖ్య 22కు చేరింది. ఈ ఉదయం సీఆర్పీఎఫ్ కోబ్రా విభాగం జవాన్లు, పారా మిలటరీ బలగాలు ఎదురు కాల్పులు చోటు చేసుకున్న ప్రదేశానికి వెళ్లారు. క్షేత్రస్థాయిలో అక్కడి పరిస్థితులును సమీక్షించారు. బిజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లో శనివారం మధ్యాహ్నం ఎదురు కాల్పులు చోటు చేసుకున్న ప్రదేశానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. అక్కడ వారికి సీఆర్పీఎఫ్ జవాన్లకు చెందిన 17 భౌతిక కాయాలు, బుల్లెట్లు, మందుగుండు సామాగ్రి లభించాయి. భౌతిక కాయాలను హెలికాప్టర్ల ద్వారా రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు.
#WATCH | On ground visuals from the site of Naxal attack at Sukma-Bijapur border in Chhattisgarh; 22 security personnel have lost their lives in the attack pic.twitter.com/nulO8I2GKn
— ANI (@ANI) April 4, 2021
సంఘటనా స్థలం నుంచి కొన్ని బుల్లెట్లు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎదురు కాల్పుల కోసం జవాన్లు వినియోగించిన ఆయుధాల కోసం అణువణువు గాలించారు. అవేవీ వారికి లభించలేదు. మావోయిస్టులు వాటిని తమ వెంట తీసుకెళ్లి ఉంటారని నిర్ణారణకు వచ్చారు. జవాన్ల భౌతిక కాయాలు చెల్లా చెదురుగా పడి ఉండటం వారిని కలచి వేసింది. అనంతరం మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహించారు. ఎన్కౌంటర్ చోటుచేసుకున్న చుట్టు పక్కల అడవులను జల్లెడ పట్టారు.

ఈ ఎన్కౌంటర్లో అమరులైన జవాన్ల సంఖ్య పెరగడం పట్ల కేంద్ర ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమర జవాన్ల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. అస్సాం ఎన్నికల పర్యటనలో ఉన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. తన షెడ్యూల్ను కుదించుకున్నారు. హుటాహుటిన దేశ రాజధానికి బయలుదేరి వెళ్లారు. మావోయిస్టుల మెరుపుదాడిపై ఆయన హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మావోయిస్టులను ఏరిపారేయడానికి అవసరమైన చర్యలను తీసుకోవడానికి హోం మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.