వరుస పతనాలు..
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ, సిగ్నేచర్ బ్యాంక్ కుప్పకూలిన తర్వాత ఈ ఆర్థిక సంక్షోభం ఇప్పుడు యూరప్ కు చేరింది. యూరప్‌లో అతిపెద్ద బ్యాంక్ అయిన క్రెడిట్ సూయిస్ దివాలా అంచున ఉంది. బుధవారం మిడ్-డే ట్రేడింగ్‌లో స్విస్ బ్యాంక్ క్రెడిట్ సూయిస్ గ్రూప్ AG షేర్లు 25 శాతానికి పైగా పడిపోయి కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. గత 5 రోజుల్లో బ్యాంక్ షేర్ 40 శాతం వరకు పడిపోయింది. ఈ నేపథ్యంలో స్విస్ సెంట్రల్ బ్యాంక్ నుంచి 54 బిలియన్ డాలర్ల వరకు రుణం తీసుకోవడం ద్వారా లిక్విడిటీని పెంచుకుంటామని క్రెడిట్ సూయిస్ గురువారం తెలిపింది. ఈ క్రమంలో స్టాక్స్ పతనం బ్యాంకు డిపాజిటర్లు ఆందోళన చెందుతున్నారు.
|
కుప్పకూలిన షేర్..
రెగ్యులేటరీ ఆంక్షల కారణంగా ఇకపై నగదును అందించలేమని స్విస్ బ్యాంక్‌లో అగ్రశ్రేణి ఇన్వెస్టర్ సౌదీ నేషనల్ బ్యాంక్ చెప్పడంతో క్రెడిట్ సూయిస్ షేర్లు బుధవారం వరుసగా రెండో రోజు సరికొత్త ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయికి కుప్పకూలాయి. బ్యాంక్ స్టాక్ ధర 2 స్విస్ ఫ్రాంక్స్ కంటే దిగువకు పడిపోవటంతో షేర్ల ట్రేడింగ్ చాలాసార్లు నిలిపివేయబడింది. UBS AG తర్వాత స్విట్జర్లాండ్‌లో ఇది రెండవ అతిపెద్ద బ్యాంక్.. ఇది దివాలా తీస్తే తీవ్ర పరిణామాలు కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. క్రెడిట్ సూయిస్ బ్యాంక్ సీఈవో ఉల్రిచ్ కోయర్నర్ దీనిపై స్పందిస్తూ.. బ్యాంక్ ఆర్థిక పరిస్థితి బాగానే ఉందని పేర్కొన్నారు.
నిధుల సమీకరణ..
Credit Suisse Group AG తన లిక్విడిటీని పెంచడానికి స్విస్ సెంట్రల్ బ్యాంక్ నుంచి 53.7 బిలియన్ డాలర్లకు సమానమైన 50 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లను రుణంగా తీసుకుంటుందని వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకుల ఆర్థిక ఆరోగ్యం గురించి భయాలు ఉత్తర అమెరికా నుంచి తాజాగా యూరప్‌కు చేరుకున్నాయి. రెగ్యులేటర్లు లైఫ్‌లైన్‌ను ఆఫర్ చేస్తున్నందున క్రెడిట్ సూయిస్ లిక్విడిటీని పెంచుతామని హామీ ఇచ్చింది.