బంధన్ బ్యాంక్..
దేశంలోని ప్రైవేటు రంగంలోని బంధన్ బ్యాంక్ తన వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ క్రమంలో బ్యాంక్ వివిధ కాలపరిమితులపై చెల్లిస్తున్న వడ్డీని 0.50 శాతం మేర పెంచినట్లు వెల్లడించింది. పెరిగిన ఈ వడ్డీ రేట్లు నిన్నటి నుంచే అమలులోకి వచ్చినట్లు బ్యాంక్ తెలిపింది.

సీనియర్ సిటిజన్లకు..
సాధారణ కస్టమర్లకు అత్యధికంగా 8 శాతం వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్న బంధన్ బ్యాంక్.. సీనియర్ సిటిజన్లకు మాత్రం కొంచెం ఎక్కువగా 8.5 శాతాన్ని అందిస్తున్నట్లు వెల్లడించింది. బ్యాంక్ 600 రోజుల కాలానికి చేసే 600 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పైన వెల్లడించిన రేట్లను చెల్లిస్తోంది. ఏడాది కాలానికి చేసే డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ చెల్లిస్తోంది. దీనికి తోడు బ్యాంక్ తన గృహ రుణాలు, పర్సనల్ లోన్స్ వంటి వాటి రేట్లను సైతం సవరించినట్లు తెలుస్తోంది.

జనతా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్..
జనతా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా తన FD వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే మారిన వడ్డీ రేట్లు ఫిబ్రవరి 1, 2023 నుంచి అమలులో ఉన్నాయని తెలుస్తోంది. రెండేళ్ల కంటే ఎక్కువ కాలానికి చేస్తున్న డిపాజిట్లపై బ్యాంక్ 8.10 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
అలాగే మూడేళ్ల కంటే ఎక్కువ కాలానికి ‘ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లస్’ అనే ప్రత్యేక FDలో పెట్టుబడి పెట్టే డిపాజిటర్లకు బ్యాంక్ 8.25 శాతం వడ్డీని చెల్లిస్తోంది. ఇదే క్రమంలో సీనియర్ సిటిజన్లకు ఈ పథకం కింద అత్యధికంగా 8.80 శాతం వడ్డీని చెల్లిస్తున్నట్లు తెలిపింది.