భాజపా భేష్
ఆర్థిక లోటును అదుపు చేయడంలో మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కాంగ్రెస్ ముఖ్య నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అస్థిరత నెలకొన్న రోజుల్లోనూ రుణాలు, ద్రవ్య లోటును సమన్వయంతో నియంత్రించడం అద్భుతమన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అద్భుతంగా పని చేసిందని కితాబిచ్చారు.

అనుభవం నుంచి పాఠం
“2009-11 చేదు అనుభవం నుంచి పాఠం నేర్చుకున్నాను. మన రుణాలను చక్కగా నిర్వహించాలని అర్థమైంది. అది ప్రభుత్వ వ్యయం, ద్రవ్యోల్బణం, ఖర్చు చేసే సామర్థ్యాలను ప్రభావితం చేస్తుంది. ద్రవ్యలోటు, రుణ నిర్వహణపై ఏక కాలంలో దృష్టి కేంద్రీకరించినందుకు మోడీ ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి” అని చిందంబరం అన్నారు. గత UPA ప్రభుత్వ హయాంలో 9 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మాజీ మంత్రి.. ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఆధాయ, వ్యయాల్లో భారీ వ్యత్యాసం
అధిక వ్యయాలు, తక్కువ రాబడి కారణంగా జనవరి చివరి నాటికి ఆర్థిక లోటు.. పూర్తి ఏడాది లక్ష్యంలో 67.8 శాతానికి చేరిందని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ డేటా చెబుతోంది. ఏప్రిల్- జనవరి మధ్య వ్యయం, రెవెన్యూ వసూళ్లలో రూ.11.9 లక్షల కోట్ల వ్యత్యాసం ఉన్నట్లు పేర్కొంది. ఈ లోటుని పూడ్చటానికి కేంద్రం మార్కెట్ నుంచి రుణాలు తీసుకుంది.

ఇదీ ప్రభుత్వ లక్ష్యం
ప్రస్తుతం అంచనా ప్రకారం 2022-23 పూర్తి ఏడాదికిగాను లోటు రూ.17.55 లక్షల కోట్లు లేదా GDPలో 6.4 శాతం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. 2023-24లో 5.9 శాతానికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025-26 నాటికి ద్రవ్యలోటును GDPలో 4.5 శాతం దిగువకు తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. అయితే 2023 బడ్జెట్ ప్రకారం భారత విదేశీ రుణం మొత్తం.. ఆర్థిక లోటులో 1 శాతం (దాదాపు 22 వేల కోట్ల) మాత్రమే ఉండటం గమనార్హం.