లేడీ పోలీసు, కానిస్టేబుల్ ఫ్రెండ్స్
తమిళనాడులో నివాసం ఉంటున్న శరవణబాబు అనే వ్యక్తి 1997లో సాయుధ దళం విభాగంలో ఉద్యోగంలో చేరాడు. శరవణబాబు నివాసం ఉంటున్న ప్రాంతంలో మరో లేడీ కానిస్టేబుల్ నివాసం ఉండేది. శరవణబాబుకు, ఆ లేడీ కానిస్టేబుల్ కు పరిచయం ఉంది. 1998లో శరవణబాబు నివాసం ఉంటున్న ఇంటికి లేడీ కానిస్టేబుల్ వచ్చి వెలుతుండటంతో స్థానికుల్లో అనుమానం పెరిగిపోయింది.

తాళం వేసిన స్థానికులు
శరవణబాబు ఇంటికి ఆ లేడీ కానిస్టేబుల్ వచ్చి వెలుతున్న విషయం స్థానికంగా నివాసం ఉంటున్న కొందరు జీర్ణించుకోలేకపోయారు. 1998లో శరణబాబు ఇంటిలోకి లేడీ కానిస్టేబుల్ వెళ్లిన వెంటనే కొందరు స్థానికులు వారి ఇంటి బయట తాళం వేసి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసు శాఖలో కలకం రేపింది.

అనుమానంతో సస్పెండ్
స్థానిక పోలీసులు శరవణబాబు, లేడీ కానిస్టేబుల్ కు వివాహేతర సంబంధం ఉందా ? అనే కోణంలో విచారణ చేశారు. అదే సమయంలో అప్పటి సాయధ దళం విభాగం ఐజీపీ మణి ఆదేశాల మేరకు శరవణబాబును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. లేడీ కానిస్టేబుల్ తనకు స్నేహితురాలు మాత్రమే అని, ఆమెకు తనకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని శరవణబాబు విచారణ అధికారుల ముందు మొత్తుకున్నా ఫలితం లేకపోయింది.

శరవణ న్యాయపోరాటం
లేడీ కానిస్టేబుల్ తనకు స్నేహితురాలు మాత్రమే అని, ఆమెకు తనకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని శరవణబాబు మద్రాసు హై కోర్టును ఆశ్రయించాడు. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది. లేడీ కానిస్టేబుల్ బయటకు వెళ్లిన సమయంలో ఇంటికి తాళం వేసి వెలుతుందని, ఆ తాళం తీసుకోవడానికి తాను వెళ్లేవాడినని, ఆమె కూడా అలాగే ఇంటికి వచ్చింది శరవణబాబు కోర్టులో చెప్పాడు.

ఎలా ఊహించుకుంటారు ?
మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి సురేస్ కుమార్ పిటిషన్ తుదివాదనలు విన్నారు. ఇంటి బయట తాళం వేసిన ఇంటిలో పెళ్లి కాని ఆడవాళ్లు, మగవాళ్లు కలిసి ఉంటే అది నేరం ఎలా అవుతుంది ?, ఆ లెక్కన వాళ్లు వ్యభిచారం చేశారు అని అంచనా వేస్తారు ? అని మద్రాసు హైకోర్టు అధికారులను ప్రశ్నించింది.

22 ఏళ్లకు సంచలన తీర్పు
స్త్రీ అయినా, పురుషుడు అయినా వారికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, ఆ విధంగా ఒకే గదిలో కలిసి ఉండటానికి అవకాశం ఉంది, అందుకని వారు వ్యభిచారం చేశారు అని చూడటం, వారికి ఆ అపవాదు అంటకట్టడం పద్దతి కాదని న్యాయమూర్తి సురేష్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేస్తూ సంచలన తీర్పు చెప్పారు. 22 ఏళ్లకు తనకు న్యాయం జరిగిందని శరవణబాబు సంతోషం వ్యక్తం చేశారు.