దర్యాప్తు విషయంలో..
మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ఈ వ్యవహారంపై తన దర్యాప్తును కొనసాగించి.. రెండు నెలల్లో నివేదికను సమర్పించాలని సూప్రీం కోర్టు సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ఆదేశించింది. దీనికోసం సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి సప్రే నేతృత్వంలో ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. దేశంలోని ఇన్వెస్టర్ల రక్షణ కోసం రెగ్యులేటరీ మెకానిజమ్‌లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు ఈ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయబడింది.

నిబంధనల ఉల్లంఘన..
సెబీ నిబంధనల్లోని సెక్షన్-19 ఉల్లంఘించబడిందా లేదా అనే దానిపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు సెబీని ఆదేశించింది. స్టాక్ ధరలు తారుమారు అయ్యాయా? అనే వ్యవహారంపై 2 నెలల్లోగా విచారణ జరిపి స్టేటస్ రిపోర్టు సమర్పించాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం ఫిబ్రవరి 17కు తీర్పును రిజర్వ్ చేసింది.

కేంద్రానికి ఎదురుదెబ్బ..
అదానీ-హిండెన్ బెర్గ్ వ్యవహారంలో నిపుణుల పేర్లతో కూడిన సీల్డ్ కవర్‌లో కేంద్రం ఇచ్చిన సూచనలను ఆమోదించడానికి ధర్మాసనం గతంలో నిరాకరించింది. పెట్టుబడిదారుల రక్షణకు పారదర్శకత అవసరమని బెంచ్ వాదించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నిజానిజాలు బయటకు రావాలని కోరుతున్నామని సెబీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో పారదర్శకతను కోరుకుంటున్నందున కమిటీని నియమిస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
|
గౌతమ్ అదానీ స్పందన..
హిండెన్ బెర్గ్ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరుకున్న తరుణంలో నేడు విచారణ తర్వాత అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ స్పందించారు. వివాదంలో నిజాలను, వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు అత్యుతన్నత న్యాయస్థానం కమిటీని ఏర్పాటు చేయటాన్ని స్వాగతిస్తున్నానంటూ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ట్వీట్ ద్వారా వెల్లడించారు. కోర్టు ఇచ్చిన గడువులో దర్యాప్తు చేయటం ద్వారా విషయం కొలిక్కి వస్తుందని.. చివరికి సత్యమే గెలుస్తుందని తన ట్వీట్‌లో స్పష్టం చేశారు.