వచ్చే ఏడాది GDP ఇలా..
ఇండియా వృద్ధి పట్ల ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ సానుకూల దృక్పథాన్ని కనపరచింది. వచ్చే ఆర్థిక సంవత్సరం FY24 లో దేశ స్థూల జాతీయోత్పత్తి (GDP) 6 శాతం ఉండనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తన వార్షిక వృద్ధి అంచనాల్లో వెల్లడించింది. ప్రైవేట్ రంగంలో మూలధన వ్యయం పెరగడం వల్ల ఇది సాధ్యం కానున్నట్లు చెప్పింది. వరుసగా రెండో ఏడాదీ రెండంకెల ఆదాయ వృద్ధిని ఈ రంగం నమోదు చేస్తుందని అంచనా వేసింది.

భవిష్యత్తు అంచనాలు
ఈ ఆర్థిక సంవత్సరం FY23కి గాను దేశ ఆర్థిక వ్యవస్థ 7 శాతం వృద్ధి చెందుతుందని క్రిసిల్ భావిస్తోంది. రానున్న 5 ఆర్థిక సంవత్సరాల్లో సగటున 6.8 శాతం మేర వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. కార్పొరేట్ ఆదాయంలోనూ రెండంకెల పెరుగుదలను ఆశిస్తున్నట్లు పేర్కొంది.
రుతుపవనాలు సాధారణమైతే మంచి రబీ పంటను ఆశించవచ్చని జోషి అభిప్రాయపడ్డారు. తద్వారా ఆహార ద్రవ్యోల్బణం దారిలోకి వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. కరెంట్ ఖాతా లోటు, స్వల్పకాలిస బాహ్య రుణాలు ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వెల్లడించారు.

ఇవీ కారణాలు
అంతర్జాతీయంగా ఏర్పడిన భౌగోళిక, రాజకీయ పరిస్థితుల కారణంగా ఇండియాలో ద్రవ్యోల్బణం పెరిగినట్లు క్రిసిల్ చీఫ్ ఎకనామిస్ట్ డీకే జోషి తెలిపారు. తద్వారా దేశీయంగా వడ్డీరేట్ల పెంపు అనివార్యమైందన్నారు. మే 2022 నుంచి 250 బేసిస్ పాయింట్లను పెంచాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. FY23కి రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతం ఉండగా.. FY24 నాటికి 5 శాతానికి తగ్గనున్నట్లు వెల్లడించారు. క్రూడ్ ఆయిల్, కమొడిటీ ధరల్లో కొంత తగ్గుదల దీనికి కారణం కావచ్చన్నారు.