బడ్జెట్ సమయంలో..
దేశంలోని ప్రముఖ గోల్డ్ ఆభరణాల రిటైల్ వ్యాపారులు ఇచ్చిన సమాచారం ప్రకారం బంగారానికి ప్రజల నుంచి డిమాండ్ పెరిగింది. జనవరిలో గరిష్ఠంగా రూ.58,689కి చేరిన 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం దాదాపు రూ.2,346 తగ్గింది. బంగారం దిగుమతిపై సుంకం తగ్గుతుందని ఆశించి వినియోగదారులు వేచి ఉన్నారని.. అలాంటి ప్రకటన బడ్జెట్ ప్రసంగంలో రాకపోవటంతో మళ్లీ కొనుగోళ్లు తిరిగి ఊపందుకున్నట్లు వెల్లడైంది.

జోయాలుక్కాస్..
ప్రస్తుతం ధరలు పడిపోయి, దిగుమతి సుంకం తగ్గించే అవకాశాలు లేవని తేలటంతో పసిడి ప్రియులు తిరిగి దుకాణాలకు వస్తున్నారని జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ జాయ్ అలుక్కాస్ అన్నారు. డాలర్‌తో రూపాయి బలపడటం, అంతర్జాతీయంగా గోల్డ్ పెట్టుబడులు తగ్గటంతో ధర పడిపోవటం వంటి కారణాలతో బంగారం ధర తగ్గిందని ఆయన వెల్లడించారు. ఒక్కో కస్టమర్ సగటున బంగారంపై దాదాపు రూ.60 వేల నుంచి రూ.70 వేలు వెచ్చిస్తున్నారని పేర్కొన్నారు.

సౌత్ ఇండియన్స్..
దేశంలో మెుత్తం బంగారు ఆభరణాల డిమాండ్‌లో దాదాపు 40% దక్షిణ భారతం నుంచే వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. జనవరిలో పోల్చితే ఫిబ్రవరిలో గోల్డ్ ఆభరణాల డిమాండ్ ఇండియాలో 15% పెరిగిందని అలుక్కాస్ తెలిపారు. ఇదే క్రమంలో అమెరికాలో మాంద్యం భయాలు కొంత తగ్గటంతో అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒక నెల కనిష్ఠానికి చేరుకున్నాయి. జనవరి నెల రెండవ అర్ధభాగంలో రూ.58,689గా ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం దాదాపు రూ.56,343కు చేరుకుంది.

మలబార్ గోల్డ్ & డైమండ్స్..
ప్రస్తుతం బంగారం ధరలు తగ్గటం వినియోగదారులు కొనుగోలుకు మెుగ్గుచూపటానికి కారణంగా నిలిచిందని మలబార్ గోల్డ్ & డైమండ్స్ చైర్మన్ MP అహమ్మద్ అన్నారు. దీనికి తోడు వివాహ సీజన్ కొనసాగుతున్నందున గోల్డ్ ఆభరణాలు కొనేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారని వెల్లడించారు. స్టోర్లలో కొనుగోలుకు వచ్చిన వినియోగదారులు సగటున రూ.35-40 వేలు వెచ్చిస్తున్నట్లు సెన్కో గోల్డ్ & డైమండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ సువంకర్ సేన్ చెప్పారు.