ఇన్ఫోసిస్ నారాయణమూర్తి..
నారాయణమూర్తి కంపెనీ కోసం ఎంతలా తన జీవితాన్ని కేటాయించారంటే ఇన్ఫోసిస్ అనేది ఆయన ఇంటిపేరులా మారిపోయింది. నారాయణమూర్తి అలవాట్ల గురించి ఇటీవల ఇంటర్వ్యూలో భార్య సుధామూర్తి చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన కంపెనీ కోసం పాటుపడిన తీరును సైతం అందులో వెల్లడించారు.

పిల్లలకు సమయం..
76 ఏళ్ల నారాయణమూర్తి ఇన్ఫోసిస్ సామ్రాజ్యాన్ని నిర్మించడం, విస్తరించటం కోసం తీవ్రంగా కృషిచేశారు. అలా ఆయన తన ఇద్దరు పిల్లలకు అవసరమైనంత సమయాన్ని కేటాయించలేకపోయారు. కంపెనీ ఫస్ట్.. ఫ్యామిలీ నెక్స్ష్ అనేంతగా కష్టపడ్డారని సుధామూర్తి వెల్లడించారు. అది ఆయన ప్యాషన్, డెడికేషన్ గురించి ఇప్పటి తరాలకు చాలా చెబుతోంది. అలా ఆయన తన ఇద్దరు పిల్లలైన రోహన్, అక్షదాతో సమయాన్ని గడపడం వదులుకోవాల్సి వచ్చింది.

వింత అలవాటు..
రోజూ ఉదయం 7 గంటలకు ఆఫీసుకు చేరుకోవటం గురించి ఇంటర్వ్యూలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తిని ప్రశ్నించగా దానికి ఊహించని సమాధానం వచ్చింది. అదేంటంటే.. మూర్తి ప్రతి రోజూ ఉదయం 6.20 గంటలకు ఇన్ఫోసిస్ క్యాంపస్‌కు చేరుకునేవాడినని వెల్లడించారు. 2011లో పదవీ విరమణ చేసేంత వరకు తాను అనుసరించిన ముఖ్యమైన అలవాటు ఇది అని నారాయణమూర్తి పేర్కొన్నారు. అలా ఉదయాన్నే వచ్చిన ఆయన రాత్రి 8 లేదా 9 గంటల వరకు పని చేసేవారు.

అప్పుచేసి పెట్టుబడి..
ఏడురు మిత్రులతో కలిసి ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడిగా మారటానికి తొలుత నారాయణ మూర్తి తన భార్య సుధా మూర్తి వద్ద రూ.10,000 అప్పు తీసుకున్నారు. కంపెనీ ప్రారంభించి 2 ఏళ్ల పాటు కంప్యూటర్ లేకుండా నడుస్తుండటం దిగ్భ్రాంతి కలిగించే విషయం. దీనికి ముందు 1976లో సాఫ్ట్‌ట్రానిక్స్ అనే కంపెనీని నారాయణమూర్తి ప్రారంభించగా.. అది 1.5 సంవత్సరం తర్వాత మూతపడింది.

మహా వృక్షంగా కంపెనీ..
కంప్యూటర్ కొనడానికి కూడా డబ్బు లేని సమయంలో ఇన్ఫోసిస్ ప్రారంభమైంది. కానీ ఇప్పుడు ఇంతింతై వటుదింతై అన్నట్లుగా పెరిగి ఖండాతరాలకు వ్యాపారాన్ని విస్తరించింది. ఈ క్రమంలో ప్రస్తుతం కంపెనీ మెుత్తం 3.35 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. కంపెనీ మార్కెట్ విలువ దాదాపుగా 80 బిలియన్ డాలర్లకు చేరుకుంది.