గత సంవత్సరం కన్నా తీవ్రస్థాయిలో కరోనా విజృంభిస్తోంది. రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో నమోదు కాని కేసులు అనేకం వుంటాయని భావిస్తున్నారు. మరికొంతకాలం ఇలాగే కొనసాగితే ప్రభుత్వాలు కూడా చేతులెత్తేసే పరిస్థితి ఏర్పడచ్చు.
140 కోట్ల ప్రజలకు సరిపడా వాక్సిన్ ఇప్పటికిప్పుడు ఉత్పత్తి చేయటం కష్టసాధ్యంగా మారింది.
ఇప్పటికే కోవాక్సిన్ కొరత ఏర్పడగా, ఇప్పుడు కోవిషిల్డ్ వాక్సిన్ కి కూడా అక్కడక్కడా కొరత ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.
మహారాష్ట్ర ప్రభుత్వం తమకు వాక్సిన్ సరిపోవట్లేదనీ, ఉత్పత్తి పెంచాలని కేంద్రాన్ని కోరింది.
అయితే వాక్సిన్ కి దేశంలో ఎటువంటి కొరతా లేదని కేంద్రం తెలియచేస్తోంది.
ఏదేమైనప్పటికీ ప్రస్తుతం వాక్సిన్ కోసం తెలుగు రాష్ట్రాల్లో క్యూ లైన్లు భవిష్యత్ లో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వం సూచించిన ప్రదేశాల్లో వాక్సిన్ వెంటనే వేయించేసుకుంటే మంచిది. ప్రస్తుతం 45 సంవత్సరాల పైబడి వయస్సు ఉన్నవారికే వాక్సిన్ వేస్తుండగా, మరికొద్ది రోజుల్లోనే 18 సంవత్సరాల పైబడి వయస్సు ఉన్నవారికి కూడా వాక్సిన్ వేసే అవకాశం ఉండటంతో వాక్సిన్ సెంటర్ల వద్ద మరింత క్యూ లైన్లు పెరగచ్చు.
పూణే కి చెందిన సీరం సంస్థ ఆక్స్ఫర్డ్, అస్ట్రాజెనికా బేస్డ్ కోవిషీల్డ్ వాక్సిన్ తయారు చేస్తుండగా, హైదరాబాద్ కి చెందిన భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ ని ఉత్పత్తి చేస్తోంది. కోవాక్సిన్ కన్నా కోవిషీల్డ్ 4 రెట్లు ఉత్పత్తి అధికంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు వాక్సిన్ ల తయారీ విధానం వేరు.
అస్ట్రాజెనికా వాక్సిన్ కి రక్తం మంద పరిచే లక్షణం ఉన్నట్లు కొన్ని దేశాల్లో నిపుణులు చెపుతున్నారు. దీన్ని గుండెజబ్బులు లాంటి తీవ్ర రోగాలు ఉన్నవారు, చిన్నపిల్లలకు వాడకపోవటం మంచిదని వారు చెప్తున్నారు. పెద్ద జబ్బులు ఉన్నవారు డాక్టర్ల ను సంప్రదించి వారి సూచన మేరకు తదనుగుణంగా వాక్సిన్ ని వాడటం మంచిది.
గతంలో జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు, శ్వాస సమస్య వంటి లక్షణాలు అధికంగా ఉండేవి. ప్రస్తుతం జీర్ణాశయ సమస్యలు, ఆకలి మందగించడం, నీరసం, కీళ్ళనొప్పులు వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 80% రోగుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించడంలేదని, దీనివల్లనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నదని చెప్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే వైరస్ శరీరంలోని గుండె, కాలేయం, మూత్రపిండాలు, కండ్లకు నష్టం కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో కూడా కొందరు రోగుల్లో ఈ అవయవాలు కరోనావల్ల దెబ్బతిన్నట్టు గుర్తించారు. కొందరికి కంటిచూపు మందగించినట్టు వైద్యులు తెలిపారు.
ఇవీ కొత్త లక్షణాలు
పొత్తికడుపులో నొప్పి,వికారం, వాంతులు
జీర్ణాశయ సమస్యలు, ఆకలి మందగించడం
నీరసం, కీళ్ల నొప్పులు
భారత్ లోని కొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూలు, లాక్ డౌన్ లు, ఆంక్షలు విధిస్తున్నారు. బ్రెజిల్ లాంటి దేశాల్లో రోజుకు 4000 మంది పైగా కరోనాతో మరణిస్తున్నారు. భారత్ లో ప్రజలకు వ్యాధినిరోధక శక్తి ఎక్కువ. మనకు అలాంటి పరిస్థితి ప్రస్తుతం లేనప్పటికీ, భవిష్యత్ లో ఎలా ఉంటుందో చెప్పలేం.
తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ఉండదని చెప్పినప్పటికీ,
హైదరాబాద్ లో కొన్ని కమర్షియల్ ప్రదేశాల్లో వ్యాపారవేత్తలు స్వచ్చందంగా కొంత సమయం లాక్ డౌన్ విధించుకుంటున్నారు. పరిస్థితి చేయిదాటితే ప్రభుత్వం కూడా దిగిరాక తప్పదు. హైదరాబాద్ లో ఉన్న హాస్పిటల్స్ లో బెడ్స్ సరిపోనంతగా రాబోయే కాలంలో వుండచ్చని హెల్త్ డైరెక్టర్ చెప్పటం విశేషం.
ప్రజలు కూడా కరోనా మహమ్మారిని అంత తేలిగ్గా తీసుకోకుండా స్వీయ నియంత్రణలు, జాగ్రత్తలు పాటించాల్సి ఉంది.
అవసరమైతేనే బైటకు రావాలి. మాస్క్, శానిటైజేషన్, సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలి.