ఆ ఆలోచన లేదు:
ఉద్యోగులను తొలగించాలనే ఆలోచన తమకు లేదని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉన్నతాధికారి తెలిపారు. ఉద్యోగిని తీసుకున్న అనంతరం వారి ప్రతిభను మెరుగుపరుస్తూ, సుదీర్ఘ కాలం తమతో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తామన్నారు. ప్రస్తుతం లేఆఫ్ ల వల్ల కొలువులు కోల్పోయిన స్టార్టప్ సంస్థల సిబ్బందిని నియమించుకోవాలని చూస్తున్నట్లు ఆ కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ వెల్లడించారు. TCS లేఆఫ్ లు ప్రకటించే అవకాశం ఉందా అన్న మీడియా ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు.

ఇదీ లేఆఫ్ లకు కారణం:
కొన్ని కంపెనీలు అవసరమైన వారి కంటే ఎక్కువ మందిని నియమించుకోవడం వల్ల ప్రస్తుతం ఉద్యోగులను తొలగించాల్సి వస్తోందని మిలింద్ అభిప్రాయపడ్డారు. ఓ అభ్యర్థి ఉద్యోగంలో చేరిన తర్వాత తన నుంచి ఉత్పాదకతతో పాటు విలువను పొందడాన్ని TCS బాధ్యతగా పరిగణిస్తుందని తెలిపారు. కొలువుకు అవసరమైన నైపుణ్యాలు అభ్యర్థిలో లేని పక్షంలో, వాటిని నేర్చుకుని అంతరాన్ని పూరించడానికి శిక్షణ ఇప్పించడంతో పాటు కొంత సమయం ఇస్తామని చెప్పారు.

ప్రవాస భారతీయులకు అండగా..
యూజర్ ఎక్స్ పీరియన్స్ డిజైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ లోని అనేక అంశాలు, ప్రొడక్ట్ ఎక్స్ పీరియన్స్ లో ప్రతిభావంతుల కోసం చూస్తున్నట్లు లక్కడ్ చెప్పారు. స్టార్టప్ ల నుంచి లేఆఫ్ ల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన వారికి అవకాశం కల్పిస్తామన్నారు. వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కోల్పోయి, వీసా నిబంధల మేరకు తిరిగి స్వదేశానికి రావడానికి ప్రయత్నిస్తున్న అమెరికాలోని ప్రవాస భారతీయులను నియమించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. మూన్ లైటింగ్ కు పాల్పడుతున్న సిబ్బంది డేటాను సేకరిస్తున్నట్లు, త్వరలో వారిపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

ఈ ఏడాది నియామకాలు తక్కువే:
గతేడాది 1.19 లక్షల మంది ట్రైనీలు సహా మొత్తం 2 లక్షల మందిని నియమించుకున్నట్లు TCS HR చీఫ్ వెల్లడించారు. వారు ప్రస్తుతం ప్రాజెక్టుల్లోకి వస్తున్నందును కొత్త నియామకాలు తగ్గుముఖం పట్టాయని వివరించారు. ఈ ఏడాదిలో 40 వేల మంది ట్రైనీలను తీసుకోవడానికి చూస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 40 శాతం మంది వారానికి మూడు రోజులు, 60 శాతం మంది రెండు రోజులు కార్యాలయాల నుంచి పని చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో కార్యాలయాలకు వచ్చేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు.