వివాహం చేసుకుని చదువుతోంది
బీహార్ లోని ముజాఫర్ జిల్లాలోని కుధని బ్లాక్ సమీపంలోని కాఫెన్ గ్రామంలో శాంతికుమారి (21) అనే మహిళ నివాసం ఉంటుంది. బ్రిజుసాహి అనే యువకుడితో శాంతికుమారి పెళ్లి జరిగిపోయింది. పెళ్లి అయిన తరువాత శాంతికుమారి పదవ తరగతి పరీక్షలు రాయడానికి సిద్దం అయ్యింది. శాంతికుమారిని ఆమె భర్త బ్రిజుసాహి ప్రోత్సహించాడు.

నిండు గర్భిణి
శాంతికుమారి నిండుగర్భిణి. బీహార్ లో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. నిండు గర్భిణి అయిన నువ్వు పరీక్షలు రాయడానికి వెళితే లేనిపోని ఇబ్బందులు వస్తాయని శాంతికుమారికి ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. తాను 10వ తరగతి పరీక్షలు రాసి పాస్ కావాలని, పై చదువులు చదవాలని శాంతికుమారి పట్టుబట్టింది.

పరీక్షా కేంద్రంలో పురిటి నొప్పులు
ముజఫర్ జిల్లాలోని మహాంత్ దర్శన్ దాస్ మహిళా కాలేజ్ (MDDM) కాలేజ్ లోని పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాయడానికి శాంతికుమారి వెళ్లింది. శాంతికుమారి భర్త బ్రిజుసాహి కూడా పరీక్షా కేంద్రం బయట ఉన్నాడు. పరీక్షలు రాస్తున్న సమయంలోనే శాంతికుమారికి పురిటి నొప్పులు రావడంతో తల్లడిల్లిపోయింది.

కాలేజ్ లోనే మగబిడ్డ
పరీక్షా కేంద్రంలోనే పర్యవేక్షురాలు మధుమిత సహాయంతో శాంతికుమారి పండంటి మగబిడ్డకు జన్మనిశ్చింది. పరీక్షా కేంద్రంలోని అధికారులు సమాచారం ఇవ్వడంతో అక్కడికి అంబులెన్స్ చేరుకుంది. వెంటనే శాంతికుమారి, బిడ్డను ఆమె భర్త బ్రిజుసాహితో పాటు అంబులెన్స్ లో సమీపంలోని సాదర్ ఆసుపత్రికి తరలించారు.

బిడ్డ పేరే ఏమిటో తెలుసా
చదువు మీద ఉన్న ద్యాసతో పురిటి నొప్పులు కూడా లెక్క చెయ్యకుండా శాంతికుమారి పరీక్షలు రాయడానికి సిద్దం అయ్యిందని ఆమె భర్త బ్రిజుసాహి మీడియాకు చెప్పారు. పరీక్ష అనే అర్థం వచ్చే లాగా బిడ్డకు ఇమ్తిహాన్ అనే నామకరణం చేస్తామని శాంతికుమారి, బ్రిజుసాహి దంపతులు మీడియాకు చెప్పారు.