ఉద్యోగాలు ఫసక్..
గోల్డ్‌మన్ శాక్స్ దాదాపు 3,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించిందని తెలుస్తోంది. కంపెనీ తన ఉద్యోగులకు ఉదయం 7.30 గంటలకు వ్యాపార సమావేశానికి పిలిచింది. అయితే ఇది రోజువారీ వ్యాపార కార్యకలాపాల్లో భాగం అని అందరూ భావించారు. కానీ ఈ సమావేశంలో కంపెనీ సీఈవో దాదాపు 3000 మంది ఉద్యోగులకు షాక్ ఇచ్చారు. గతవారం న్యూయార్క్ ప్రధాన కార్యాలయంలో వ్యాపార సమావేశానికి CEO డేవిడ్ సోలమన్ ఉద్యోగులను పిలిచి ఈ చర్య చేపట్టినట్లు వెల్లడైంది.

వేరే మార్గం లేక..
మాంద్యం మరింత భయంకరంగా మారుతుందనే అంచనాల నేపథ్యంలో కాన్ఫరెన్స్ రూమ్‌కు వచ్చిన ఉద్యోగులను మేనేజర్లు విధుల నుంచి తొలగించారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు తమను క్షమించాలని వారు ఉద్యోగులకు తెలిపారు. తమకు వేరే మార్గం లేకనే ఈ బలవంతపు తొలగింపులకు ఉపక్రమించినట్లు వెల్లడైంది. అలాగే ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ఉద్యోగులను కూడా మరో సమావేశానికి పిలిచారు. దీంతో అందరిలోనూ భయాలు నెలకొన్నాయి.

ఫాస్ట్ యాక్షన్..
ఉద్యోగులు ఎక్కువగా సెలవుల్లో ఉండడంతో ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్నవారికి ముందుగా విషయాన్ని తెలియజేయలేదని చెబుతున్నారు. ఈ క్రమంలో తొలగించబడిన ఉద్యోగులకు వెంటనే విధులను వీడేందుకు లేదా సెలవులో ఉన్న వారు వచ్చిన తర్వాత వెళ్లేందుకు అవకాశం ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారికి ఇది చాలా కష్టమైన సమయంగా తెలుస్తోంది.

సీఈవో ఏమన్నారంటే..
ఇప్పటి వరకు కంపెనీ కోసం సేవలు అందించిన ఉద్యోగులకు తాము కృతజ్ఞులమని సీఈవో డేవిడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. తొలగించబడినవారికి మద్దతు ఉంటుందని చెప్పారు. గోల్డ్‌మన్ సాచ్స్‌లోని ఈ తొలగింపును “డేవిడ్స్ కూల్చివేత దినం” అని అన్నారు. భారతీయ ఉద్యోగులు సైతం తొలగింపులతో తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే కొంతమంది బాధిత IIT, IIM గ్రాడ్యుయేట్లు సోషల్ మీడియాలో తమ కష్టాలను పంచుకుంటున్నారు.

దీనంతటికీ కారణం..?
ప్రపంచంలోని చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించటానికి వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి రష్యా-ఉక్రెయిన్ యుద్దం, చైనా-తైవాన్ టెన్షన్, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు, చైనాలో కరోనా కేసుల పెరుగుదల ప్రధానమైనవిగా చెప్పుకోవాలి. ఈ కారణాలతో మాంద్యంలోని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కూరుకుపోతాయని నిపుణుల అంచనాలు చెప్పాయి. అమెరికా, యూరప్ ఇప్పటికే మాంద్యం వేడికి ఇబ్బంది పడుతున్నాయి.