తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. రెండు మూడు నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్దం అవుతోంది. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాడులో 234 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. తమిళనాడులో అధికారంలోకి రావాలంటే ఏ పార్టీ అయినా 118 సీట్లు కైవసం చేసుకోవాలి.

సై సై అంటున్న పార్టీలు
తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ డీఎంకే కూడా ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిపోటీ ఇవ్వడానికి సిద్దం అయ్యింది. ఇక జాతీయ ఉత్తమనటుడు కమల్ హాసన్ పార్టీ, క్యాప్టన్ విజయ్ కాంత్ పార్టీ, శరత్ కుమార్, రాధికాల పార్టీ, సీమాన్ పార్టీ, శశికళ ఫ్యామిలీ పార్టీ, తదితర పార్టీలు కూడా తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ సత్తా చూపించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి.

123 ఉచిత వివాహాలు
అమ్మ జయలలిత పుట్టిన రోజు ఈనెల 24వ తేదీ నిర్వహించడానికి అన్నాడీఎంకే పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మ జయలలిత పుట్టిన రోజు సందర్బంగా కోయంబత్తూరు- సిరువానీ రహదారిలోని పెరూరు చెట్టిపాళ్యం సమీపంలోని గ్రాండ్ పెవిలియన్ లో సోమవారం 123 ఉచిత వివాహాలు జరిపించారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ముఖ్య అథితులుగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వధించారు.

వెండి. మంచం, గ్యాస్ స్టౌవ్, సూట్ కేసులు ఫ్రీ……ఫ్రీ
సోమవారం ఉదయ గంట సేపు 123 ఉచిత వివాహాల శుభకార్యం జరిగింది. కోయంబత్తూరులోని తోండముత్తూర్ నియోజక వర్గంలోని అన్ని గ్రామాల ప్రజలను ఉచిత వివాహాల శుభకార్యానికి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఉచిత వివాహాలు చేసుకున్న 123 మంది జంటలకు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేతుల మీదుగా వెండి జగ్గు, మంచం, సూట్ కేసు, గ్యాస్ స్టౌవ్ తో పాటు 73 ఖరీదైన వస్తువులు ఉన్న కిట్లను అందించారు.

లెక్కలు భలే కుదిరాయి
అసెంబ్లీ ఎన్నికల్లో తాము కచ్చితంగా విజయం సాధించి అధికారంలోకి వస్తామని అన్నాడీఎంకే, బీజేపీ కూటమి అంటోంది. అందుకే 123 ఉచిత వివాహాలు జరిపించారని సమాచారం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సీట్లు 234. అమ్మ జయలలిత పుట్టిన రోజు 24వ తేదీ. అన్ని కలిసి ఇద్దరు మిత్రులు పళనిస్వామి, పన్నీర్ సెల్వం మళ్లీ అధికారంలోకి రావాలని 2 అంకెలు కలిసి వచ్చేలా చూసుకుని ఉచిత వివాహాలు జరిపించారని సమాచారం. ఇక ముందు ఏది చేసినా 2 అంకెలు కలిసి వచ్చేలా చూడాలని పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గీయులు పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు వెలుతున్నారని తెలిసింది.