ఎందుకు ప్రత్యేక విభజన..?
ఈ వ్యాపారాల స్పిన్-ఆఫ్ పెట్టుబడిదారుల్లో కంపెనీ విలువను కూడా పెంచుతుంది. ఈ లావాదేవీలో భాగంగా ఫ్లిప్‌కార్ట్ సింగపూర్, ఫోన్‌పే సింగపూర్ వాటాదారులు నేరుగా ఫోన్‌పే ఇండియాలో షేర్లను కొనుగోలు చేశారు. తమ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇది దోహదపడుతుందని రెండు కంపెనీలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.

భారతీయ కంపెనీగా..
ఈ ఏడాది ప్రారంభంలో విభజన ప్రక్రియ ప్రారంభం కాగా ప్రస్తుతం అది పూర్తైంది. దీంతో ఇప్పుడు ఫోన్ పే పూర్తిస్థాయి ఇండియన్ కంపెనీగా మారింది. దీనికి ముందు గత అక్టోబరులో ఫోన్ పే సంస్థ తన రిజిస్టర్డ్ ప్రధాన కార్యాలయాన్ని సింగపూర్ నుంచి మన దేశానికి మార్చే ప్రక్రియను ప్రారంభించింది. ఐపీవోగా మార్కెట్లోకి రావటానికి ముందుగానే ఫోన్ పే అనేక కీలక విషయాలపై వేగంగా చర్యలు తీసుకుంటోంది.

మేడ్ ఇన్ ఇండియా..
మాది మేడ్ ఇన్ ఇండియా కంపెనీ. మా కార్యాలయాలు డేటా సెంటర్, సిబ్బంది ప్రతి ఒక్కటి ఇక్కడే ఉన్నాయని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం ఫోన్ పే యూపీఐ సేవలను దాదాపుగా 400 మిలియన్ వినియోగదారులను కలిగి ఉందని కంపెనీ వెల్లడించింది. అలా నెలవారీ యూపీఐ చెల్లింపుల్లో మెుత్తంగా కంపెనీ 47 శాతం వాటాను కలిగి ఉంది.

మరిన్ని సేవలు..
ప్రస్తుతం కంపెనీ ప్రధానంగా యూపీఐ సేవలను మాత్రమే అందిస్తోంది. దీనికి తోడు ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్, క్రెడిట్ సర్వీసింగ్ మొదలైన వ్యాపారాలపై కంపెనీ దృష్టి పెట్టాలని ప్లాన్ చేస్తోంది. తన వినియోగదారులకు వీటి ద్వారా రుణ సేవలను కూడా అందించేందుకు ఈ చర్యలు దోహదపడతాయని కంపెనీ భావిస్తోంది.

2016లో..
ఫోన్ పేను 2016లో ఫ్లిప్‌కార్ట్ కొనుగోలు చేసింది. అయితే ఫ్లిప్‌కార్ట్ 2020లో ప్రత్యేక కంపెనీగా విడిపోయింది. వాల్‌మార్ట్‌తో సహా అనేక మంది పెట్టుబడిదారుల నుంచి పోన్‌పే 700 మిలియన్ డాలర్ల నిధులను సేకరించి 5.5 బిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా కొనసాగుతోంది. వ్యాపార విస్తరణ కోసం మరిన్ని నిధుల సమీకరణకు కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ తన ఆదాయాన్ని పెంచుకునేందుకు QR స్కాన్, UPI సేవల కోసం ఛార్జ్ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.