ఆదివారం, 15 నవంబర్ 2026 సబ్‌స్క్రైబ్

సమాచార హక్కు చట్టం 2005: సెక్షన్ల వారీ సమగ్ర వివరణ

సమాచార హక్కు చట్టం, 2005లోని మొత్తం 31 సెక్షన్లను వరుసగా సరళమైన తెలుగులో వివరించే గైడ్: గడువులు, ఫీజులు, మినహాయింపులు, అప్పీళ్లు, జరిమానాలు, నమూనా దరఖాస్తు.

ఇది సమాచారం కోసం మాత్రమే, న్యాయ సలహా కాదు. అధికారిక గెజిట్ / ఇండియా కోడ్‌తో సరిచూసుకోండి.

సమాచార హక్కు చట్టం, 2005 (RTI Act) పౌరులకు ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్న సమాచారాన్ని అడిగి పొందే చట్టపరమైన హక్కు ఇస్తుంది. పార్లమెంటు 15 జూన్ 2005న ఆమోదించింది; కొన్ని ఏర్పాట్లు వెంటనే, మిగిలినవి 12 అక్టోబర్ 2005 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ పేజీలో చట్టంలోని 31 సెక్షన్లను వరుసగా, సరళమైన తెలుగులో వివరిస్తున్నాను. అసలు పాఠం కోసం “బేర్ యాక్ట్” పేజీని చూడండి.

ఒక్క చూపులో

అంశంముఖ్యాంశంసెక్షన్
ఎవరు అడగవచ్చుభారత పౌరులు3
ఎవరిని అడగాలిప్రభుత్వ అధికార సంస్థ (public authority) లోని ప్రజా సమాచార అధికారి (PIO)2(h), 5
ఎలా అడగాలివ్రాతపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్ రూపంలో; కారణం చెప్పనవసరం లేదు6(1), 6(2)
ఫీజునిర్ణీత రుసుము (కేంద్ర నియమాల్లో దరఖాస్తు ఫీజు ₹10; రాష్ట్రాల నియమాలు వేరు); పేదరిక రేఖకు దిగువనున్నవారికి (BPL) ఫీజు లేదు6(1), 7(1), 7(5)
సమాధాన గడువు30 రోజులు; ఒకరి ప్రాణం లేదా స్వేచ్ఛకు సంబంధించినదైతే 48 గంటలు; సహాయక PIOకి ఇస్తే +5 రోజులు7(1), 5(2)
నిరాకరించగల సమాచారంసెక్షన్ 8, 9లో చెప్పినవి మాత్రమే8, 9, 24
మొదటి అప్పీలునిర్ణయం వచ్చిన / రావలసిన తేదీ నుంచి 30 రోజుల్లో, PIO కంటే పై స్థాయి అధికారికి19(1)
రెండో అప్పీలు90 రోజుల్లో, సమాచార కమిషన్‌కు19(3)
ఫిర్యాదుసమాచార కమిషన్‌కు నేరుగా18
జరిమానాPIOకి రోజుకు ₹250, గరిష్టంగా ₹25,00020(1)

గమనిక: ఫీజులు, దరఖాస్తు విధానం వంటి వివరాలు కేంద్రం, ఒక్కో రాష్ట్రం చేసిన నియమాల (సెక్షన్లు 27, 28) మీద ఆధారపడతాయి. చట్టంలో లేని సంఖ్యలను ఇక్కడ వేరుగా గుర్తించాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర నియమాల వివరాల కోసం “RTI చట్టంలో G.O.లు, సర్క్యులర్లు” పేజీని చూడండి.

సెక్షన్ 1 సంక్షిప్త నామం, వర్తింపు, ప్రారంభం

చట్టం పేరు “సమాచార హక్కు చట్టం, 2005”. 2005లో ఇది జమ్మూ-కశ్మీర్ రాష్ట్రం మినహా భారతదేశమంతటికీ వర్తించేది; 31 అక్టోబర్ 2019 నుంచి జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకూ వర్తిస్తోంది.

  • సెక్షన్ 4(1), 5(1), 5(2), 12, 13, 15, 16, 24, 27, 28 చట్టం ఆమోదం పొందిన వెంటనే (15 జూన్ 2005) అమల్లోకి వచ్చాయి.
  • మిగిలిన భాగం 120వ రోజు, అంటే 12 అక్టోబర్ 2005న అమల్లోకి వచ్చింది.

సెక్షన్ 2 నిర్వచనాలు

చట్టంలోని ముఖ్యమైన పదాల అర్థం ఇక్కడ ఉంది. చాలా వివాదాలు ఈ నిర్వచనాల చుట్టూ తిరుగుతాయి.

  • “సమాచారం” (information) అంటే ఏ రూపంలో ఉన్న సామగ్రి అయినా: రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈమెయిళ్లు, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఉత్తర్వులు, లాగ్‌బుక్‌లు, ఒప్పందాలు, నివేదికలు, నమూనాలు, ఎలక్ట్రానిక్ డేటా. ఏదైనా ప్రైవేటు సంస్థ గురించి, వేరే చట్టం కింద ప్రభుత్వ సంస్థ పొందగలిగే సమాచారం కూడా ఇందులోకి వస్తుంది.
  • “ప్రభుత్వ అధికార సంస్థ” (public authority) అంటే రాజ్యాంగం కింద, పార్లమెంటు లేదా శాసనసభ చట్టం కింద, లేదా ప్రభుత్వ నోటిఫికేషన్/ఉత్తర్వు ద్వారా ఏర్పడిన సంస్థ. ప్రభుత్వ యాజమాన్యంలో, నియంత్రణలో లేదా గణనీయమైన నిధులతో నడిచే సంస్థలు, అలాగే ప్రభుత్వ నిధులతో గణనీయంగా నడిచే NGOలు కూడా చేరతాయి.
  • “హక్కు” అంటే పనులు, పత్రాలు, రికార్డుల తనిఖీ; నోట్లు, సారాంశాలు, ధృవీకరించిన నకళ్లు తీసుకోవడం; ధృవీకరించిన నమూనాలు తీసుకోవడం; డిస్కెట్లు, టేపులు, ఎలక్ట్రానిక్ రూపంలో లేదా ప్రింట్‌అవుట్‌లో సమాచారం పొందడం.
  • “థర్డ్ పార్టీ” అంటే సమాచారం అడిగిన పౌరుడు కాకుండా ఇతర వ్యక్తి; ప్రభుత్వ సంస్థ కూడా థర్డ్ పార్టీ కావచ్చు.
  • “తగిన ప్రభుత్వం” (appropriate Government) అంటే కేంద్రం నిధులిచ్చే సంస్థకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రం నిధులిచ్చే సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం.
  • “సమర్థ అధికారి” (competent authority) అంటే లోక్‌సభ/శాసనసభకు స్పీకర్, రాజ్యసభ/శాసనమండలికి చైర్మన్, సుప్రీంకోర్టుకు భారత ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టుకు దాని ప్రధాన న్యాయమూర్తి, రాజ్యాంగ సంస్థలకు రాష్ట్రపతి/గవర్నర్.

సెక్షన్ 3 సమాచార హక్కు

ఈ చట్టానికి లోబడి పౌరులందరికీ సమాచారం పొందే హక్కు ఉంటుంది. అంటే ఆ హక్కు పౌరులకు మాత్రమే (కంపెనీలు, సంఘాలకు ప్రత్యేకంగా కాదు), సమాచారం ఇవ్వడమే నియమం, మినహాయింపులు అపవాదాలు మాత్రమే.

సెక్షన్ 4 ప్రభుత్వ సంస్థల బాధ్యతలు (స్వచ్ఛంద వెల్లడి)

ప్రజలు అడగకముందే చాలా సమాచారం ప్రభుత్వ సంస్థలు స్వయంగా ప్రజలకు ఉంచాలి. దీన్ని “సుమోటో” లేదా స్వచ్ఛంద వెల్లడి అంటారు.

  • 4(1)(a): అన్ని రికార్డులను క్రమబద్ధంగా కేటలాగ్ చేసి, సూచిక పెట్టి నిర్వహించాలి; సాధ్యమైనంత మేర కంప్యూటరీకరించి నెట్‌వర్క్‌లో ఉంచాలి.
  • 4(1)(b): 120 రోజుల్లో 17 అంశాలు ప్రచురించాలి: సంస్థ నిర్మాణం, విధులు; అధికారుల అధికారాలు, బాధ్యతలు; నిర్ణయ ప్రక్రియ; నిబంధనలు, మాన్యువళ్లు; పత్రాల వర్గాల జాబితా; సంప్రదింపుల ఏర్పాట్లు; కమిటీల వివరాలు; ఉద్యోగుల డైరెక్టరీ; ప్రతి ఉద్యోగి నెల జీతం; బడ్జెట్, వ్యయ ప్రణాళికలు; సబ్సిడీ పథకాల అమలు, లబ్ధిదారుల వివరాలు; అనుమతులు, రాయితీల గ్రహీతలు; ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచార వివరాలు; పౌరులకు ఉన్న సౌకర్యాలు; PIOల పేర్లు, హోదాలు; నిర్దేశించిన ఇతర సమాచారం. వీటిని ఏటా నవీకరించాలి.
  • 4(1)(c): ముఖ్య విధానాలు రూపొందించేటప్పుడు, నిర్ణయాలు ప్రకటించేటప్పుడు సంబంధిత వాస్తవాలన్నీ ప్రచురించాలి.
  • 4(1)(d): ప్రభావితమైన వ్యక్తులకు పరిపాలనా లేదా అర్ధ-న్యాయ నిర్ణయాల కారణాలు చెప్పాలి.
  • 4(2)–(4): ప్రజలు చట్టాన్ని ఆశ్రయించే అవసరం తగ్గేలా ఇంటర్నెట్‌తో సహా వివిధ మార్గాల్లో సమాచారం ఇవ్వడానికి నిరంతరం ప్రయత్నించాలి; స్థానిక భాష, తక్కువ ఖర్చు, సులభంగా అందే పద్ధతిని పాటించాలి.

సెక్షన్ 5 ప్రజా సమాచార అధికారుల నియామకం

  • 5(1): ప్రతి ప్రభుత్వ సంస్థ 100 రోజుల్లో తన కార్యాలయాలన్నింటిలో అవసరమైనంతమంది కేంద్ర/రాష్ట్ర ప్రజా సమాచార అధికారులను (CPIO/SPIO, సంక్షిప్తంగా PIO) నియమించాలి.
  • 5(2): సబ్-డివిజన్ లేదా ఉప-జిల్లా స్థాయిలో సహాయ ప్రజా సమాచార అధికారులను (APIO) కూడా నియమించాలి. వీరి పని దరఖాస్తులు, అప్పీళ్లు స్వీకరించి వెంటనే సంబంధిత PIOకి/అప్పీలు అధికారికి/కమిషన్‌కు పంపడం. APIOకి ఇచ్చిన దరఖాస్తు విషయంలో సమాధాన గడువుకు 5 రోజులు కలుపుతారు.
  • 5(3): PIO దరఖాస్తులను పరిశీలించి, సమాచారం కోరేవారికి సహేతుకమైన సహాయం చేయాలి.
  • 5(4), 5(5): PIO ఇతర అధికారుల సహాయం కోరవచ్చు. సహాయం కోరిన అధికారి తప్పక సహాయం చేయాలి; చట్ట ఉల్లంఘన జరిగితే ఆ అధికారిని కూడా PIOగానే పరిగణిస్తారు.

సెక్షన్ 6 సమాచారం కోరుతూ దరఖాస్తు

  • 6(1): సమాచారం కావలసినవారు ఇంగ్లీషు, హిందీ లేదా ఆ ప్రాంత అధికార భాషలో వ్రాతపూర్వకంగా లేదా ఎలక్ట్రానిక్ రూపంలో, నిర్ణీత ఫీజుతో, సంబంధిత PIOకి లేదా APIOకి దరఖాస్తు చేయాలి; కావలసిన సమాచారం వివరాలు స్పష్టంగా రాయాలి. వ్రాతపూర్వకంగా రాయలేని వారికి PIO రాయడంలో సహాయం చేయాలి.
  • 6(2): సమాచారం ఎందుకు కావాలో కారణం చెప్పనవసరం లేదు; సంప్రదింపు కోసం అవసరమైన వివరాలు తప్ప వ్యక్తిగత వివరాలు అడగకూడదు.
  • 6(3): సమాచారం వేరే ప్రభుత్వ సంస్థ వద్ద ఉంటే, లేదా అది ఆ సంస్థ పనులతో ఎక్కువగా ముడిపడి ఉంటే, దరఖాస్తును (లేదా సంబంధిత భాగాన్ని) వెంటనే, ఎంత ఆలస్యమైనా 5 రోజుల్లోగా, ఆ సంస్థకు బదిలీ చేసి, ఆ సంగతి దరఖాస్తుదారుకు తెలపాలి.

సెక్షన్ 7 దరఖాస్తు పరిష్కారం

  • 7(1): PIO వీలైనంత త్వరగా, ఎట్టి పరిస్థితిలోనూ 30 రోజుల్లో, ఫీజు తీసుకుని సమాచారం ఇవ్వాలి లేదా సెక్షన్ 8, 9లో ఉన్న కారణాలతో నిరాకరించాలి. సమాచారం ఒకరి ప్రాణం లేదా స్వేచ్ఛకు సంబంధించినదైతే 48 గంటల్లో ఇవ్వాలి.
  • 7(2): గడువులో నిర్ణయం చెప్పకపోతే దరఖాస్తును నిరాకరించినట్లే పరిగణిస్తారు (deemed refusal); అప్పుడు అప్పీలు చేయవచ్చు.
  • 7(3): అదనపు ఫీజు చెల్లించాల్సి వస్తే, లెక్కలతో సహా తెలియజేయాలి; అలాగే ఫీజు మొత్తం, ఇచ్చే విధానంపై అప్పీలు హక్కును, అప్పీలు అధికారి వివరాలను తెలపాలి. నోటీసు పంపినప్పటి నుంచి ఫీజు చెల్లించే వరకు ఉన్న కాలాన్ని 30 రోజుల్లో లెక్కించరు.
  • 7(4): ఇంద్రియ వైకల్యం (చూపు, వినికిడి మొదలైనవి) ఉన్నవారికి సమాచారాన్ని చూడటానికి PIO సహాయం చేయాలి.
  • 7(5), 7(6): ప్రింటెడ్ లేదా ఎలక్ట్రానిక్ రూపంలో ఇస్తే నిర్ణీత ఫీజు కట్టాలి. ఫీజులు సహేతుకంగా ఉండాలి; ప్రభుత్వం నిర్ణయించిన పేదరిక రేఖకు దిగువనున్న వ్యక్తులకు ఫీజు లేదు. గడువు పాటించకపోతే సమాచారం ఉచితంగా ఇవ్వాలి.
  • 7(7): నిర్ణయం తీసుకునే ముందు థర్డ్ పార్టీ వాదనను (సెక్షన్ 11) పరిగణించాలి.
  • 7(8): నిరాకరిస్తే కారణాలు, అప్పీలు చేసే గడువు, అప్పీలు అధికారి వివరాలు తప్పనిసరిగా తెలపాలి.
  • 7(9): సమాచారం సాధారణంగా అడిగిన రూపంలోనే ఇవ్వాలి; అయితే అది ప్రభుత్వ సంస్థ వనరులను అసమానంగా మళ్లిస్తే, లేదా రికార్డు భద్రతకు హాని చేస్తే మినహాయింపు ఉంది.

సెక్షన్ 8 సమాచారం ఇవ్వకుండా మినహాయింపులు

సెక్షన్ 8(1) కింద ఈ సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత లేదు:

  • (a) భారత సార్వభౌమత్వం, సమగ్రత, రాష్ట్ర భద్రత, వ్యూహాత్మక, శాస్త్రీయ లేదా ఆర్థిక ప్రయోజనాలు, విదేశాలతో సంబంధాలను దెబ్బతీసేది, లేదా నేరానికి ప్రేరేపించేది.
  • (b) కోర్టు లేదా ట్రిబ్యునల్ ప్రచురించవద్దని స్పష్టంగా నిషేధించినది, లేదా కోర్టు ధిక్కారం అయ్యేది.
  • (c) పార్లమెంటు లేదా శాసనసభ ప్రత్యేక హక్కులకు భంగం కలిగించేది.
  • (d) వాణిజ్య రహస్యాలు, మేధో సంపత్తి వంటి, థర్డ్ పార్టీ పోటీ స్థితిని దెబ్బతీసే సమాచారం, పెద్ద ప్రజా ప్రయోజనం కోసం అవసరమని సమర్థ అధికారి భావిస్తే తప్ప.
  • (e) విశ్వాస సంబంధం (fiduciary) వల్ల ఒకరి వద్ద ఉన్న సమాచారం, పెద్ద ప్రజా ప్రయోజనం ఉంటే తప్ప.
  • (f) విదేశీ ప్రభుత్వం నుంచి విశ్వాసంతో అందిన సమాచారం.
  • (g) ఎవరి ప్రాణం లేదా శారీరక భద్రతకు ముప్పు తెచ్చేది, లేదా చట్ట అమలు కోసం విశ్వాసంతో ఇచ్చిన సమాచార మూలాన్ని గుర్తించేది.
  • (h) దర్యాప్తు, నిందితుల అరెస్టు లేదా విచారణ ప్రక్రియను అడ్డుకునేది.
  • (i) మంత్రిమండలి, కార్యదర్శులు, ఇతర అధికారుల చర్చల రికార్డులతో సహా క్యాబినెట్ పత్రాలు. అయితే మంత్రిమండలి నిర్ణయాలు, కారణాలు, ఆధారాలు నిర్ణయం తీసుకుని విషయం ముగిశాక ప్రకటించాలి.
  • (j) వ్యక్తిగత సమాచారం. 2005 పాఠం: ప్రజా కార్యకలాపంతో సంబంధం లేనిది, లేదా అనవసరంగా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేది; పెద్ద ప్రజా ప్రయోజనం ఉందని అధికారి భావిస్తే ఇవ్వవచ్చు. 13 నవంబర్ 2025 నుంచి డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం, 2023 ప్రకారం ఈ క్లాజు “వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన సమాచారం” అని మాత్రమే ఉంది; దీనిపై సుప్రీంకోర్టులో సవాల్ ఉంది.
  • 8(2): ఇతర మినహాయింపులు ఉన్నా, అధికారిక రహస్యాల చట్టం, 1923 ఉన్నా, సమాచారం వెల్లడించడం వల్ల కలిగే ప్రజా ప్రయోజనం, రక్షిత ప్రయోజనాలకు జరిగే హానికంటే ఎక్కువైతే ప్రభుత్వ సంస్థ సమాచారం ఇవ్వవచ్చు. దీన్ని “ప్రజా ప్రయోజన పరీక్ష” అంటారు.
  • 8(3): (a), (c), (i) క్లాజులకు లోబడి, దరఖాస్తు చేసిన తేదీకి 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన, విషయం గురించిన సమాచారాన్ని ఇవ్వాలి.
  • ప్రొవైజో (2005 పాఠం, క్లాజు (j) కింద): పార్లమెంటుకు లేదా శాసనసభకు ఇవ్వడానికి నిరాకరించలేని సమాచారాన్ని ఎవరికీ నిరాకరించకూడదు. 2025 సవరణ తర్వాత ఈ ప్రొవైజో కూడా తొలగించినట్లు నివేదికలు చెబుతున్నాయి; నోటిఫై చేసిన పాఠంతో సరిచూడండి.

సెక్షన్ 9 కాపీరైట్ ఉల్లంఘన కారణంగా నిరాకరణ

సెక్షన్ 8 కు భంగం లేకుండా, సమాచారం ఇవ్వడం “రాష్ట్రం (ప్రభుత్వం) కాకుండా మరొక వ్యక్తికి” ఉన్న కాపీరైట్‌ను ఉల్లంఘించేదైతే PIO అభ్యర్థనను తిరస్కరించవచ్చు. అంటే ప్రభుత్వ సొంత కాపీరైట్ పేరుతో నిరాకరించలేరు.

సెక్షన్ 10 సమాచారాన్ని వేరు చేసి ఇవ్వడం (పాక్షిక వెల్లడి)

  • అడిగిన రికార్డులోని కొంత భాగం మినహాయింపు కిందికి వచ్చినా, మిగతా భాగం వేరు చేయడం సాధ్యమైతే, మినహాయింపు లేని భాగాన్ని ఇవ్వాలి.
  • ఇలా ఇచ్చేటప్పుడు PIO ఏ భాగాన్ని ఎందుకు ఇవ్వలేదో, నిర్ణయం తీసుకున్న అధికారి పేరు, హోదా, ఫీజు వివరాలు, అప్పీలు హక్కు తెలుపుతూ నోటీసు ఇవ్వాలి.

సెక్షన్ 11 థర్డ్ పార్టీ సమాచారం

  • PIO ఏదైనా థర్డ్ పార్టీ ఇచ్చిన, లేదా ఆ థర్డ్ పార్టీ రహస్యంగా పరిగణించిన సమాచారాన్ని ఇవ్వాలనుకుంటే, దరఖాస్తు అందిన 5 రోజుల్లో ఆ థర్డ్ పార్టీకి వ్రాతపూర్వక నోటీసు ఇచ్చి, వారి వాదన వినాలి.
  • థర్డ్ పార్టీ నోటీసు అందిన 10 రోజుల్లో తన అభిప్రాయం చెప్పవచ్చు.
  • దరఖాస్తు అందిన 40 రోజుల్లో PIO నిర్ణయం తీసుకుని థర్డ్ పార్టీకి వ్రాతపూర్వకంగా తెలపాలి. ప్రజా ప్రయోజనం ఎక్కువైతే (వాణిజ్య రహస్యాలు మినహా) సమాచారం ఇవ్వవచ్చు.
  • ఈ నిర్ణయంపై థర్డ్ పార్టీ సెక్షన్ 19 ప్రకారం అప్పీలు చేయవచ్చు.

సెక్షన్ 12 కేంద్ర సమాచార కమిషన్ ఏర్పాటు

  • కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా “కేంద్ర సమాచార కమిషన్”ను ఏర్పరుస్తుంది: ఒక ప్రధాన సమాచార కమిషనర్, గరిష్టంగా పది మంది సమాచార కమిషనర్లు.
  • నియామకం రాష్ట్రపతి చేస్తారు, ప్రధానమంత్రి (అధ్యక్షుడు), లోక్‌సభ ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి నామినేట్ చేసిన కేంద్ర కేబినెట్ మంత్రి ఉన్న కమిటీ సిఫార్సు ఆధారంగా.
  • చట్టం, శాస్త్ర సాంకేతికత, సామాజిక సేవ, నిర్వహణ, జర్నలిజం, మాస్ మీడియా, పరిపాలన, పాలనలో విశేష అనుభవం ఉన్న ప్రజా ప్రముఖులై ఉండాలి. పార్లమెంటు సభ్యులు, లాభదాయక పదవులు, రాజకీయ పార్టీ, వ్యాపార బాధ్యతల్లో ఉండకూడదు.
  • కమిషన్ నిర్వహణ, పర్యవేక్షణ, దిశానిర్దేశం ప్రధాన సమాచార కమిషనర్ చేతిలో ఉంటుంది; ఆయన/ఆమె ఇతర కమిషనర్ల సహాయంతో, ఎవరి ఆదేశాలకూ లోబడకుండా స్వయంప్రతిపత్తితో వ్యవహరించవచ్చు.
  • ప్రధాన కార్యాలయం ఢిల్లీలో; కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతితో ఇతర చోట్ల కార్యాలయాలు పెట్టవచ్చు.

సెక్షన్ 13 పదవీకాలం, సేవా షరతులు (కేంద్ర కమిషన్)

  • 2005 పాఠం: ప్రధాన సమాచార కమిషనర్ 5 ఏళ్లు పదవిలో ఉంటారు, తిరిగి నియమించరాదు; 65 ఏళ్ల తర్వాత ఎవరూ ఆ పదవిలో ఉండరాదు. సమాచార కమిషనర్ 5 ఏళ్లు లేదా 65 ఏళ్లు, ఏది ముందైతే అది; సమాచార కమిషనర్‌గా మళ్లీ నియమించరాదు కానీ ప్రధాన కమిషనర్‌గా నియమించవచ్చు (రెండు పదవుల్లో కలిపి 5 ఏళ్లకు మించకూడదు). ప్రధాన కమిషనర్‌కు ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో, సమాచార కమిషనర్లకు ఎన్నికల కమిషనర్లతో సమాన జీతభత్యాలు.
  • 2019 సవరణ తర్వాత (24 అక్టోబర్ 2019 నుంచి): పదవీకాలం, జీతభత్యాలు, ఇతర షరతులను కేంద్ర ప్రభుత్వం నిబంధనల ద్వారా నిర్ణయిస్తుంది. ఈ మార్పు కమిషన్ స్వతంత్రతపై చర్చకు దారి తీసింది.
  • కమిషనర్లు రాష్ట్రపతి లేదా ఆయన నియమించిన వ్యక్తి ముందు మొదటి షెడ్యూల్ ప్రకారం ప్రమాణం చేయాలి; రాష్ట్రపతికి లేఖ రాసి రాజీనామా చేయవచ్చు.

సెక్షన్ 14 కమిషనర్ల తొలగింపు (కేంద్ర కమిషన్)

  • ప్రధాన కమిషనర్‌ను లేదా కమిషనర్‌ను రాష్ట్రపతి ఉత్తర్వుతో మాత్రమే తొలగించగలరు.
  • రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు విషయాన్ని నివేదిస్తారు; సుప్రీంకోర్టు విచారణ చేసి, దుష్ప్రవర్తన లేదా అసమర్థత రుజువైనట్లు నివేదిస్తేనే తొలగించవచ్చు.
  • విచారణ కాలంలో రాష్ట్రపతి కమిషనర్‌ను సస్పెండ్ చేయవచ్చు.
  • దివాలా తీసినట్లు తీర్పు రావడం, నైతిక పతనం కలిగే నేరంలో శిక్ష, పదవి విధులకు వెలుపల జీతంతో కూడిన ఉద్యోగం చేయడం, మానసిక/శారీరక అసమర్థత, లేదా విధులను ప్రభావితం చేసే ఆర్థిక లేదా ఇతర ప్రయోజనం పొందడం వంటి కారణాలతో రాష్ట్రపతి నేరుగా తొలగించగలరు (ఈ కారణాలకు సుప్రీంకోర్టు విచారణ అవసరం లేదు). ప్రభుత్వ ఒప్పందాల్లో ప్రయోజనం పొందితే అది దుష్ప్రవర్తనగా పరిగణిస్తారు.

సెక్షన్ 15 రాష్ట్ర సమాచార కమిషన్ ఏర్పాటు

  • ప్రతి రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా “రాష్ట్ర సమాచార కమిషన్”ను ఏర్పరుస్తుంది: ఒక రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, గరిష్టంగా పది మంది రాష్ట్ర సమాచార కమిషనర్లు.
  • నియామకం గవర్నర్ చేస్తారు, ముఖ్యమంత్రి (అధ్యక్షుడు), శాసనసభ ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రి నామినేట్ చేసిన కేబినెట్ మంత్రి ఉన్న కమిటీ సిఫార్సుపై.
  • అర్హతలు, అనర్హతలు కేంద్ర కమిషనర్లకు ఉన్నట్లే (సెక్షన్ 12 మాదిరిగా). ప్రధాన కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన చోట ఉంటుంది.

సెక్షన్ 16 పదవీకాలం, సేవా షరతులు (రాష్ట్ర కమిషన్)

సెక్షన్ 13 లాగే 2005 పాఠం ప్రకారం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌కు 5 ఏళ్లు (65 ఏళ్ల తర్వాత పదవిలో ఉండరాదు), రాష్ట్ర సమాచార కమిషనర్లకు 5 ఏళ్లు లేదా 65 ఏళ్లు ఏది ముందైతే అది (వారిని తర్వాత రాష్ట్ర ప్రధాన కమిషనర్‌గా నియమించవచ్చు, మొత్తం 5 ఏళ్ల వరకు); జీతభత్యాలు రాష్ట్ర ప్రధాన కమిషనర్‌కు ఎన్నికల కమిషనర్‌తో, రాష్ట్ర కమిషనర్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమానం. 2019 సవరణ తర్వాత (24 అక్టోబర్ 2019 నుంచి) ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం నిబంధనల ద్వారా నిర్ణయిస్తుంది. రాష్ట్ర కమిషనర్ ప్రమాణం గవర్నర్ ముందు చేస్తారు.

సెక్షన్ 17 కమిషనర్ల తొలగింపు (రాష్ట్ర కమిషన్)

సెక్షన్ 14 మాదిరిగానే: రాష్ట్ర ప్రధాన కమిషనర్‌ను లేదా రాష్ట్ర కమిషనర్‌ను గవర్నర్ ఉత్తర్వుతో మాత్రమే తొలగించగలరు; గవర్నర్ సుప్రీంకోర్టుకు విషయాన్ని నివేదిస్తారు, సుప్రీంకోర్టు దుష్ప్రవర్తన లేదా అసమర్థతను నిర్ధారిస్తేనే తొలగింపు (దివాలా, నైతిక పతనం నేరం, లాభదాయక ఉద్యోగం, శారీరక/మానసిక అసమర్థత వంటి కారణాలకు నేరుగా తొలగించవచ్చు).

సెక్షన్ 18 సమాచార కమిషన్ల అధికారాలు, విధులు

  • ఫిర్యాదులు: సమాచారం ఇవ్వడానికి PIOని నియమించలేదని, దరఖాస్తు స్వీకరించలేదని, నిరాకరించారని, గడువులో సమాధానం ఇవ్వలేదని, అధిక ఫీజు వసూలు చేశారని, అసంపూర్ణ/తప్పుడు/తప్పుదారి పట్టించే సమాచారం ఇచ్చారని, లేదా ఇతర ఏ విధంగా అయినా హక్కుకు భంగం కలిగిందని ఎవరైనా ఫిర్యాదు చేస్తే కమిషన్ విచారించాలి.
  • సుమోటో విచారణ: సహేతుక కారణాలు ఉంటే కమిషన్ స్వయంగా విచారణ ప్రారంభించవచ్చు.
  • సివిల్ కోర్టు అధికారాలు: సమన్లు పంపడం, వ్యక్తులను హాజరుపరచడం, పత్రాలు కోరడం, ప్రమాణ పత్రాలు తీసుకోవడం, సాక్షులను పిలవడం వంటి అధికారాలు కమిషన్‌కు ఉన్నాయి. ఏ రికార్డునైనా పరిశీలించవచ్చు; ఏ కారణంతోనైనా దాన్ని దాచడానికి వీల్లేదు.

సెక్షన్ 19 అప్పీళ్లు

  • మొదటి అప్పీలు (19(1)): PIO నుంచి నిర్ణయం రాకపోయినా, నిర్ణయంతో అసంతృప్తి ఉన్నా, గడువు ముగిసిన లేదా నిర్ణయం అందిన తేదీ నుంచి 30 రోజుల్లో PIO కంటే పై స్థాయి అధికారికి (మొదటి అప్పీలేట్ అధికారి) అప్పీలు చేయవచ్చు. సరైన కారణం ఉంటే 30 రోజుల తర్వాత కూడా అంగీకరించవచ్చు.
  • థర్డ్ పార్టీ అప్పీలు (19(2)): సెక్షన్ 11 కింద థర్డ్ పార్టీ సమాచారం ఇవ్వాలన్న ఉత్తర్వుపై ఆ థర్డ్ పార్టీ 30 రోజుల్లో అప్పీలు చేయవచ్చు.
  • రెండో అప్పీలు (19(3)): మొదటి అప్పీలు నిర్ణయం వచ్చిన (లేదా రావలసిన) తేదీ నుంచి 90 రోజుల్లో సమాచార కమిషన్‌కు; సరైన కారణంతో 90 రోజుల తర్వాత కూడా అంగీకరించవచ్చు.
  • భారం (19(5)): నిరాకరణ సమర్థనీయమని నిరూపించే బాధ్యత PIOదే.
  • గడువు (19(6)): అప్పీలును 30 రోజుల్లో, ప్రత్యేక కారణాలను నమోదు చేస్తే గరిష్టంగా 45 రోజుల్లో పరిష్కరించాలి.
  • కమిషన్ నిర్ణయం (19(7)–(9)): కమిషన్ నిర్ణయం కట్టుబడి ఉంటుంది. నిర్దిష్ట రూపంలో సమాచారం ఇప్పించడం, PIOని నియమించమనడం, సమాచారం ప్రచురించమనడం, రికార్డుల నిర్వహణ పద్ధతులు మార్చమనడం, శిక్షణ ఇవ్వమనడం, నష్టపరిహారం చెల్లించమనడం, జరిమానా విధించడం, లేదా దరఖాస్తును తిరస్కరించడం చేయవచ్చు.

సెక్షన్ 20 జరిమానాలు

  • కారణం లేకుండా దరఖాస్తు స్వీకరించకపోయినా, గడువులో సమాచారం ఇవ్వకపోయినా, దురుద్దేశంతో నిరాకరించినా, తెలిసి తప్పుడు/అసంపూర్ణ/తప్పుదారి పట్టించే సమాచారం ఇచ్చినా, సమాచారాన్ని నాశనం చేసినా, ఏ విధంగా అడ్డుకున్నా, కమిషన్ PIOకి రోజుకు ₹250 జరిమానా విధిస్తుంది; గరిష్ఠం ₹25,000.
  • జరిమానా విధించే ముందు PIOకి తన వాదన చెప్పుకునే అవకాశం ఇవ్వాలి; తాను సహేతుకంగా, శ్రద్ధగా వ్యవహరించానని నిరూపించే భారం PIOదే.
  • కారణం లేకుండా పదేపదే ఇలా జరిగితే కమిషన్ ఆ PIOపై సర్వీసు నిబంధనల ప్రకారం క్రమశిక్షణా చర్యకు సిఫార్సు చేస్తుంది (20(2)).

సెక్షన్ 21 సద్భావంతో చేసిన చర్యలకు రక్షణ

ఈ చట్టం లేదా దాని కింద నియమాల ప్రకారం సద్భావంతో చేసిన, లేదా చేయడానికి ఉద్దేశించిన పనికి ఎవరిపైనా దావా, ప్రాసిక్యూషన్ లేదా ఇతర న్యాయ చర్య ఉండదు.

సెక్షన్ 22 చట్టానికి అధిక ప్రభావం

అధికారిక రహస్యాల చట్టం, 1923తో సహా ప్రస్తుతం అమల్లో ఉన్న ఏ ఇతర చట్టంతో లేదా ఈ చట్టం కాకుండా వేరే ఏ పత్రంతో ఏ విరుద్ధం ఉన్నా, ఈ చట్టం నిబంధనలే అమలవుతాయి.

సెక్షన్ 23 కోర్టుల అధికార పరిధి నిషేధం

ఈ చట్టం కింద జారీ అయిన ఏ ఉత్తర్వుపైనా ఏ కోర్టూ దావా, దరఖాస్తు లేదా ఇతర చర్యను స్వీకరించకూడదు; ఈ చట్టంలో ఇచ్చిన అప్పీలు ద్వారా మాత్రమే సవాలు చేయవచ్చు. (రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 32, 226 కింద హైకోర్టులు, సుప్రీంకోర్టుకు ఉన్న న్యాయ సమీక్ష అధికారం ఈ సెక్షన్ వల్ల పోదని సాధారణంగా భావిస్తారు; ప్రత్యేక కేసుల్లో న్యాయవాది సలహా తీసుకోండి.)

సెక్షన్ 24 కొన్ని సంస్థలకు చట్టం వర్తించదు

  • రెండో షెడ్యూల్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ గూఢచార, భద్రతా సంస్థలకు (ఇంటెలిజెన్స్ బ్యూరో, RAW, ED, NCB, BSF, CRPF, CISF, NSG మొదలైనవి, మొత్తం 18) ఈ చట్టం వర్తించదు.
  • అయితే అవినీతి ఆరోపణలు, మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణల సమాచారాన్ని మినహాయించరాదు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారం సమాచార కమిషన్ ఆమోదం తర్వాత, దరఖాస్తు అందిన 45 రోజుల్లో ఇవ్వాలి.
  • కేంద్రం నోటిఫికేషన్ ద్వారా ఈ షెడ్యూల్‌ను సవరించవచ్చు (సంస్థలను చేర్చవచ్చు, తొలగించవచ్చు); ఆ నోటిఫికేషన్లు పార్లమెంటు ముందు ఉంచాలి.
  • రాష్ట్ర ప్రభుత్వాలు తమ గూఢచార, భద్రతా సంస్థలను నోటిఫై చేసి మినహాయించవచ్చు; అదే అవినీతి, మానవ హక్కుల నిబంధన వర్తిస్తుంది; నోటిఫికేషన్లను శాసనసభ ముందు ఉంచాలి.

సెక్షన్ 25 పర్యవేక్షణ, నివేదిక

  • ప్రతి సంవత్సరం ముగిశాక కేంద్ర/రాష్ట్ర సమాచార కమిషన్ ఈ చట్టం అమలుపై నివేదిక తయారు చేసి తగిన ప్రభుత్వానికి పంపుతుంది.
  • ప్రతి మంత్రిత్వ శాఖ/విభాగం తన పరిధిలోని సంస్థల సమాచారాన్ని సేకరించి కమిషన్‌కు ఇస్తుంది: అందిన దరఖాస్తుల సంఖ్య, నిర్ణయాల సంఖ్య, నిరాకరణ కారణాలు, అప్పీళ్లు, జరిమానాలు, వసూలైన ఫీజులు వంటి వివరాలు.
  • నివేదికను కేంద్రం పార్లమెంటు ఉభయసభల ముందు, రాష్ట్రం శాసనసభ ముందు ఉంచాలి. చట్టం నిబంధనలకు అనుగుణంగా లేని సంస్థలకు సిఫార్సులు కూడా చేయవచ్చు.

సెక్షన్ 26 కార్యక్రమాల తయారీ

  • నిధులు, ఇతర వనరులు అందుబాటులో ఉన్నంత మేరకు తగిన ప్రభుత్వం విద్యా కార్యక్రమాలు నిర్వహించవచ్చు: ప్రజలు, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు, చట్టం ఇచ్చిన హక్కును ఎలా వినియోగించుకోవాలో అవగాహన పెంచాలి.
  • ప్రభుత్వ సంస్థలను ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనమని ప్రోత్సహించాలి, తమ కార్యకలాపాల గురించి సమయానికి, ఖచ్చితమైన సమాచారం ప్రచారం చేసేలా చూడాలి, PIOలకు శిక్షణ ఇవ్వాలి, శిక్షణ సామగ్రి తయారు చేయాలి.
  • చట్టం ప్రారంభమైన 18 నెలల్లోగా తగిన ప్రభుత్వం తన అధికార భాషలో సులభంగా అర్థమయ్యే గైడ్ రూపొందించాలి: చట్ట లక్ష్యాలు, ప్రతి ప్రభుత్వ సంస్థ PIO చిరునామా, ఫోన్ నంబర్లు, దరఖాస్తు విధానం, కమిషన్ సహాయం, అందుబాటులో ఉన్న న్యాయ పరిష్కారాలు, ఫీజులు వంటివి ఉండాలి; అవసరమైతే క్రమం తప్పకుండా నవీకరించాలి.

సెక్షన్ 27 తగిన ప్రభుత్వం నియమాలు చేసే అధికారం

తగిన ప్రభుత్వం (కేంద్రం లేదా రాష్ట్రం) గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ చట్టం అమలుకు నియమాలు చేయవచ్చు: ఉదా. సెక్షన్ 4(1)(b)(xvii) కింద ప్రచురించాల్సిన అదనపు సమాచారం, సెక్షన్ 6(1), 7(1), 7(5) కింద ఫీజులు, అప్పీళ్ల విధానం, సమాచారం ఇచ్చే విధానం, కమిషన్ అనుసరించే ప్రక్రియ. 2019 సవరణ ద్వారా కమిషనర్ల పదవీకాలం, జీతభత్యాలు, సేవా షరతులపై నియమాలు చేసే అధికారం కేంద్రానికి ఇచ్చారు (క్లాజులు (ca), (cb)). ఫీజు నియమాలు రాష్ట్రాల వారీగా మారేది ఈ సెక్షన్ వల్లే.

సెక్షన్ 28 సమర్థ అధికారి నియమాలు

లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభలు, కోర్టులు, రాజ్యాంగ సంస్థల వంటి వాటికి సంబంధించి సమర్థ అధికారులు (స్పీకర్, చైర్మన్, ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్రపతి/గవర్నర్) తమ సంస్థ కోసం ఫీజు, అప్పీళ్లు వంటి అంశాలపై నియమాలు చేయవచ్చు. అందుకే సుప్రీంకోర్టు, హైకోర్టుల RTI నియమాలు వేరుగా ఉంటాయి.

సెక్షన్ 29 నియమాలను సభల ముందు ఉంచడం

కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతి నియమాన్ని పార్లమెంటు ప్రతి సభ ముందు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతి నియమాన్ని రాష్ట్ర శాసనసభ ముందు ఉంచాలి.

సెక్షన్ 30 ఇబ్బందులు తొలగించే అధికారం

చట్టం అమలులో ఇబ్బంది ఏర్పడితే, చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి రెండేళ్లలోపు (అంటే 2007 అక్టోబర్ వరకు) కేంద్ర ప్రభుత్వం చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉత్తర్వు జారీ చేయవచ్చు; ఆ ఉత్తర్వులను పార్లమెంటు ఉభయసభల ముందు ఉంచాలి. ఈ గడువు ఎప్పుడో ముగిసింది.

సెక్షన్ 31 రద్దు

సమాచార స్వేచ్ఛ చట్టం, 2002 (Freedom of Information Act, 2002) ఈ చట్టంతో రద్దయింది.

ఆచరణలో RTI దరఖాస్తు ఎలా చేయాలి

  1. ఎవరికి: సంబంధిత శాఖ/కార్యాలయంలోని PIOకి. ఎవరు PIOనో తెలియకపోతే ఆ శాఖ వెబ్‌సైట్‌లో చూడండి లేదా కార్యాలయంలో అడగండి (సెక్షన్ 4(1)(b)(xvi) ప్రకారం PIO పేర్లు ప్రచురించాలి).
  2. ఎలా రాయాలి: స్పష్టమైన, నిర్దిష్టమైన ప్రశ్నలు (తేదీలు, ఫైలు నంబర్లు, పనులు, కాలం). “ఎందుకు” కాకుండా “ఏమిటి, ఎప్పుడు, ఎంత” అని అడిగితే పనికొస్తుంది. కారణం చెప్పనవసరం లేదు.
  3. ఫీజు: మీ రాష్ట్ర/కేంద్ర నియమాల ప్రకారం నిర్ణీత ఫీజు కట్టాలి. BPL కార్డు ఉంటే ఫీజు లేదు; కార్డు ప్రతి జతచేయండి.
  4. రశీదు: దరఖాస్తు కాపీ, ఫీజు రశీదు, పోస్టు రశీదు భద్రపరచండి.
  5. 30 రోజులు గడిచాక: సమాధానం రాకపోతే లేదా అసంతృప్తి ఉంటే, 30 రోజుల్లోపు మొదటి అప్పీలు; తర్వాత 90 రోజుల్లో సమాచార కమిషన్‌కు రెండో అప్పీలు లేదా ఫిర్యాదు.

నమూనా దరఖాస్తు

గౌరవనీయులైన ప్రజా సమాచార అధికారి గారికి,
[శాఖ / కార్యాలయం పేరు, చిరునామా]

విషయం: సమాచార హక్కు చట్టం, 2005 లోని సెక్షన్ 6(1) కింద సమాచారం కోరుతూ దరఖాస్తు.

దయచేసి ఈ క్రింది సమాచారాన్ని అందజేయగలరు: 1) [ప్రశ్న 1]; 2) [ప్రశ్న 2]; 3) [ప్రశ్న 3]. కాలం: [నుంచి – వరకు].

ఫీజు ₹[ ] [చెల్లింపు విధానం, వివరాలు] ద్వారా చెల్లించాను. (BPL అయితే: BPL కార్డు నంబర్ [ ], కాపీ జతచేశాను.)

[పేరు], [చిరునామా], [ఫోన్/ఈమెయిల్], [తేదీ], [సంతకం]

చట్టపరమైన సలహా కాదు: ఇది చట్టాన్ని సరళంగా అర్థం చేసుకోవడానికి మాత్రమే. నిర్దిష్ట కేసుల్లో అధికారిక గెజిట్/ఇండియా కోడ్‌ను చూడండి లేదా న్యాయవాదిని సంప్రదించండి. నియమాలు, ఫీజులు, ఆన్‌లైన్ పోర్టల్ వివరాలు తరచుగా మారతాయి.