News
oi-Bogadi Adinarayana
Telangana development: అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ మరో ఘనతను సాధించింది. పెద్ద రాష్ట్రాలను సైతం పక్కకు తోసుకుంటూ.. అభివృద్ధి కోసం దేశంలోనే ఎక్కువ ఖర్చు పెడుతున్నట్లు ఆర్బీఐ తెలిపింది.
కేంద్రం ఆర్థిక పరిమితులు విధించినా, నిధులు తగ్గించినా, సొంత పన్నుల ఆదాయంతోనే చరిత్ర సృష్టించిందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో టాక్స్ రాబడి 19 శాతం పెరగడం ఎంతగానో ఉపయోగపడిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వ్యయంలో ఐదు.. శాతంలో నంబర్ వన్:
రాష్ట్రాభివృద్ధి కోసం అధిక శాతం నిధులు ఖర్చు చేయడంతో గత రెండేళ్లుగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని ఆర్బీఐ తాజా నివేదిక చెబుతోంది. బడ్జెట్ లో ప్రకటించిన మొత్తంలో 75 శాతానికి పైగా అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చించినట్లు అందులో చెప్పింది.
2022-23లో మొత్తం బడ్జెట్ 2.56 లక్షల కోట్ల రూపాయలు కాగా.. 1.98 లక్షల కోట్లను వినియోగించింది. తద్వారా దేశంలో జనాభా, భౌగోళికంగా, ఆదాయం పరంగా పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ ల తర్వాత ఐదో స్థానం సాధించినట్లు వెల్లడించింది.

భారీగా పెరిగిన పన్ను రాబడి:
రిజర్వ్ బ్యాంక్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. గత రెండేళ్ల బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే 2022-23లో 77.4 శాతం, 2021-22లో 76.3 శాతం రాష్ట్రాభివృద్ధి కోసం తెలంగాణ ఖర్ఛు చేసింది. అంతకు ముందు ఏడాది 69.7 శాతం వ్యయంతో.. ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్ తర్వాత మూడో స్థానంలో నిలిచింది.
2020-21 ఆర్థిక సంవత్సరం దాదాపు 68 వేల కోట్లుగా ఉన్న తెలంగాణ పన్ను రాబడి.. 2021-22 నాటికి భారీగా పెరిగి 1.09 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరు నాటికి లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆదాయం పొందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2023 మార్చి చివరి నాటికి 1.27 లక్షల కోట్లకు చేరవచ్చని ఆర్థిక వేత్తల అంచనా.
English summary
Telangana in top place for development expenditure in a row since two years
Telangana development expenditure..
Story first published: Wednesday, January 25, 2023, 20:43 [IST]