ప్రతికూల శక్తిని ఎలా తొలగించాలి..?
భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం. చిన్న చిన్న విషయాలకే గొడవపడిపోతుంటారు. వాగ్వాదంకు దిగుతారు. కొన్ని సార్లు ఈ గొడవలు విబేధాలకు దారి తీసి కాపురంలో చిచ్చుకూడా ఏర్పడే అవకాశం ఉంది. ఈ గొడవలు మరింత ముదిరితే విడాకులకే దారి తీసే ఛాన్స్ ఉంది. ఇలాంటి గొడవలు లేకుండా సంసారం సాఫీగా సాగడంలో ఉప్పు సహాయం చేస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. గళ్ల ఉప్పును పడకగదిలో ఒక మూలకు ఉంచాలని చెబుతున్నారు.ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఈ ఉప్పు తీసుకుని బాంధవ్యాలను చక్కగా మారుస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

ఉప్పుతో వాస్తు దోషం తొలిగిపోతుందా..?
ఇంట్లో ఉన్న వాస్తు దోషం తొలిగిపోవాలంటే ఇంట్లోని వాష్‌రూంలో ఒక గాజు గిన్నెలో ఉప్పు ముద్ద ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది. వాస్తుదోషాలు సరవుతాయి. అయితే వాష్‌రూంలో ఉంచిన ఉప్పును 15 రోజుల తర్వాత మార్చుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇక ఒక వ్యక్తి సమస్యలతో కృంగిపోయి ఉన్నప్పుడు, తీవ్రంగా అలసిపోయినప్పుడు నీటిలో కొంత ఉప్పు వేసి స్నానం చేయాలి. ఇక స్నానం చేసి తుడుచుకునేప్పుడు ఉప్పు వాడితే చాలా సమస్యలు తొలగిపోతాయి. శారీరక, మానసిక, ఆర్థిక సమస్యలు తొలిగిపోవాలంటే తుడుచుకునేందుకు ఉప్పు వినియోగించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది. అయితే ఈ పరిహారం గురువారం తప్ప మిగతారోజులన్నీ చేయొచ్చు. ఒక్క గురువారం రోజున మాత్రం చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

చిన్న పిల్లలకు దిష్టి తగలకుండా ఏం చేయాలి..?
సాధారణంగా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు కీడు జరగకుండా, చెడు కళ్లు వారిపై పడకుండా దిష్టి తీస్తాం. అయితే ఉప్పుతో కూడా చిన్న పిల్లలకు దిష్టి తీయొచ్చు. ఇంట్లో పిల్లలపై ఎవరి చెడు కళ్లయినా పడితే అనారోగ్యంకు గురవడం జరుగుతుంది. ఇది చాలా మంది నమ్ముతారు. ఇలా జరగకూడదంటే చిటికెడు ఉప్పు , ఆవాలతో పరిహారం చేస్తే సరిపోతుంది. ఇందుకోసం ఉప్పు ఆవపిండిని కలిపి ఏడుసార్లు చిన్న పిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడేయండి. ఇలా చేయడం వల్ల చిన్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
(గమనిక: పైన పొందుపర్చిన సమాచారం కేవలం నమ్మకాలు, ఇతరుల నుంచి సేకరించిన సమాచారం మాత్రమే. వన్‌ఇండియా తెలుగు ఎక్కడా నిర్థారించడం లేదు.)