చిరుతపులితో నోముల తనయుడు
సుదీర్ఘ కాలం కమ్యూనిస్టు పార్టీ నేతగా కొనసాగిన నోముల నర్సింహయ్య తెలంగాణ ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరడం, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జున సాగర్ స్థానం నుంచి గెలుపొందడం, గతేడాది ఆయన కరోనా బారినపడి కన్నుమూయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుత సాగర్ ఉప పోరులో నోముల తనయుడు భగత్ కుమార్.. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ప్రచారంలో బిజీ అయిపోయిన భగత్ తాలూకు పాత వీడియో ఒకటి నెట్టింట వైరల్ అయింది. చిరుతపులితో వాకింగ్ చేస్తున్న భగత్ వీడియోను షేర్ చేస్తూ దర్శకుడు ఆర్జీవీ ఇలా రాసుకొచ్చారు..

ప్రపంచంలో తొలి అభ్యర్థి భగత్..
‘‘వామ్మో… కేసీఆర్ టైగర్, కేటీఆర్ సింహం అని మనకు తెలుసు. కానీ, టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ చిరుత పులిని వాకింగ్‌కి తీసుకెళ్తుండడం నాకు నచ్చింది. ఒకవేళ నాకే కనుక నాగార్జున సాగర్ ఎన్నికల్లో ఓటు వేసే ఛాన్స్ ఉంటే 17న నా ఓటు ఇతనికే వేసేవాణ్ని. ఎన్నికల ప్రచారంలో నోముల భగత్… “మాకు ఓటు వేయండి. నాగార్జునసాగర్‌లో మన గర్జనకు ఏ ఒక్క పార్టీ నిలబడలేదు” అంటున్నారు. చిరుత పులితో కలిసి ప్రచారంలో పాల్గొంటున్న వ్యక్తిని నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు” అంటూ ఆర్జీవీ వరుస ట్వీట్లు చేశారు.
5ఏళ్ల కిందటి వీడియో..
చిరుతపులితో నోముల భగత్ వాకింగ్ చేసిన నిజమైనదేనని ఆయన సన్నిహితులు చెప్పారు. ఐదేళ్ల కిందట భగత్ సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లారని, అక్కడ ఓ పార్కులో సఫారీ చేశారని, జూ సిబ్బంది పర్యవేక్షణలో చురుతపులిని పట్టుకుని కాసేపు నడిచారని, పర్యాటకులను ఆకట్టుకునేలా సౌతాఫ్రికాలోని కొన్ని పార్కుల్లో ఇలాంటి అనుభవాలను కూడా అప్షన్ గా ఉంచారని భగత్ సన్నిహితులు పేర్కొన్నారు. అయితే, ఐదేళ్ల కిందటి వీడియోను ఇప్పుడెవరు వైరల్ చేశారో తెలీదని వారు చెబుతున్నారు.

భగత్ ఊరమాస్.. నిత్యం ట్రెండింగ్
చిరుతపులితో నోముల భగత్ వాకింగ్ చేసిన వీడియోను దర్శకుడు ఆర్జీవీ షేర్ చేయగా, దానిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ‘‘దీనిని బట్టి చూస్తే, వీరు సామాన్య ప్రజలకు ఎంత అందుబాటులో ఉంటారో, ఎలాంటి సేవలు అందిస్తారో, చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు” అని ఒకరు, ‘‘ఏంది మావా ఇదీ..
ఊర మాస్ రాజా నువ్వు.. ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటావ్” అని ఇంకొకరు, ‘‘పులిని పట్టుకొని సింహం వస్తుంది నాగార్జున సాగర్ లో టీఆర్ఎస్ గెలుస్తుంది” అని మరొకరు కామెంట్లు చేయగా, విమర్శకులు మాత్రం భగత్ తీరుపై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే,

సాగర్‌లో నామినేషన్ల ఉపసంహరణ
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ఉపఎన్నిక నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో శుక్రవారం ముగ్గురు తమ నామినేష న్లు ఉపసంహరించుకున్నారు. మహాజన సంఘర్షణ సమితి(ఎంఎస్పీ) తరఫున నామినేషన్ వేసిన గొడపర్తి జానకిరామయ్య, ముదిగొండ వెంకటేశ్వర్లుతోపాటు స్వతంత్ర అభ్యర్థి రావులపాటి రవిశంకర్ కూడా ఉపసంహరించుకున్నారు. ఉప ఎన్నికకు మొత్తం 77 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, వివిధ కారణాలతో 17 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. శుక్రవారం ముగ్గురు ఉపసంహరించుకున్నారు. దీంతో ప్రస్తుతానికి 57మంది బరిలో ఉన్నారు. కాగా నామినేషన్ల ఉపసంహరణకు శనివారం మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంది. చివరిరోజు ఎంతమంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.